ఇవేం పిట్టలండీ బాబూ!

కొంచెం రూపులో.... కాస్త రంగులో... ఇంకొంచెం సైజులో... మరికొంచెం తీరులో... పక్షుల్ని ఇట్టే గుర్తుపట్టేస్తాం... కానీ కొన్ని చాలా ప్రత్యేకకం... వింత ఆకారాలతో ‘ఇవి పక్షులా!?’ అన్నట్టు ఉంటాయి... నమ్మకపోతే మీరే చూడండి!...

Published : 15 May 2019 00:32 IST

కొంచెం రూపులో.... కాస్త రంగులో... ఇంకొంచెం సైజులో... మరికొంచెం తీరులో... పక్షుల్ని ఇట్టే గుర్తుపట్టేస్తాం... కానీ కొన్ని చాలా ప్రత్యేకకం... వింత ఆకారాలతో ‘ఇవి పక్షులా!?’ అన్నట్టు ఉంటాయి... నమ్మకపోతే మీరే చూడండి!

గోల్డెన్‌ ఫెసంట్‌

‘తలపై బంగారపు కుచ్చు పెట్టుకున్నట్టుందే’ అనుకుంటున్నారా? లేదు లేదు. ఇలా రంగురంగుల్లో మెరిసిపోవడమే దీని గొప్ప. పొడవైన తోకతో ఉండే ఈ పక్షి ఇంచుమించు 40 అంగుళాల పొడవు ఉంటుంది. చైనాలో దీన్ని అదృష్టం, సంపదలకి గుర్తుగా భావిస్తారు.

క్రిస్‌మస్‌ ఫ్రిగెట్‌

హిందూమహా సముద్రంలోని క్రిస్‌మస్‌ దీవిలో మాత్రమే ఉంటుంది కాబట్టి ఈ పక్షికి ఈ పేరు. మొత్తం నలుపు రంగులో ఉండే దీని మెడ కింద ఎర్రని బుడగలాంటి రూపం ఉంటుంది. అందుకే చాలా చిత్రంగా ఉంటుంది. జంట పక్షిని ఆకట్టుకోవడానికే దీని ఈ వింత రూపం.

సూపర్బ్‌ బర్డ్‌ ఆఫ్‌ ప్యారడైజ్‌

మామూలుగా ఉన్నప్పుడు పక్షిలానే ఉంటుంది. పురి విప్పి నాట్యం చేసిందంటే బయటపడుతుంది దీని అసలు రూపం. ఇది జతని ఆకర్షించడానికి డ్యాన్స్‌ చేస్తుంది. అప్పుడిలా నీలం, నలుపు రంగుల్లో గమ్మత్తయిన రూపంతో కనువిందు చేస్తుంది.

కాక్‌ ఆఫ్‌ ది రాక్‌

పేరే కాదండోయ్‌! దీని రూపమూ వింతే మరి. తల నారింజ ఎరుపు రంగుల్లో, శరీరం బూడిద రంగులో భలే గమ్మత్తుగా ఉంటుంది. అంతేనా! దీనికో చిత్రమైన కిరీటమూ ఉంటుంది. కొండలపై గూళ్లు కట్టుకుంటుందని కాక్‌ ఆఫ్‌ ది రాక్‌ అనే పేరొచ్చింది.

కింగ్‌ వల్చర్‌

చూస్తేనే ‘బాబోయ్‌ ఇదేం జీవిరా’ అనుకుంటున్నారు కదూ. ఇది రాబందుల్లో ఓ రకం. రెండున్నర అడుగుల పొడవు ఉంటుందిది. దీని ప్రత్యేకత అంతా దీని ముఖంలోనే ఉంది. కనురెప్పలు లేని దీని కళ్లు, విచిత్రంగా ఉండే కొక్కెంలాంటి ముక్కు ఓ భయంకరమైన ఆకారంలా కనిపించేట్టు చేస్తాయి.


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని