పిల్లల కోసం ‘కాఫీ విత్‌ కలెక్టర్‌’!

హాయ్‌ పిల్లలూ.. ‘నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు?’ అని ఎవరైనా అడిగితే - మనలో వందకు ఎనభై మంది కలెక్టర్‌నవుతా అని సమాధానం చెబుతాం! ఒక జిల్లాకు బాస్‌లాంటి ఆ వ్యక్తిని కలిసే అవకాశం వస్తే ఎగిరి గంతేస్తాం.

Updated : 01 Mar 2022 00:51 IST

హాయ్‌ పిల్లలూ.. ‘నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు?’ అని ఎవరైనా అడిగితే - మనలో వందకు ఎనభై మంది కలెక్టర్‌నవుతా అని సమాధానం చెబుతాం! ఒక జిల్లాకు బాస్‌లాంటి ఆ వ్యక్తిని కలిసే అవకాశం వస్తే ఎగిరి గంతేస్తాం. అలాంటిది, కొందరు పిల్లలకు మాత్రం ప్రతి వారం జిల్లా కలెక్టర్‌తో మాట్లాడే అవకాశం వస్తోంది. ఆ వివరాలేంటో చదివేయండి మరి..

మిళనాడు రాష్ట్రంలోని విరుధానగర్‌ జిల్లాకు మేఘనాథ్‌ రెడ్డి కలెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఒకరోజు విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారాయన. పిల్లల చదువు, బడుల్లో సౌకర్యాలు తదితర బోలెడు అంశాలు చర్చకు వచ్చాయి. అప్పుడే, ఆ కలెక్టర్‌కు ఓ ఆలోచన వచ్చింది. అదేంటంటే - నేరుగా పిల్లలతోనే మాట్లాడాలని!

వారానికో పాఠశాల నుంచి..

అలా అనుకున్నదే తడవుగా.. మొన్న జనవరి నుంచి ప్రతి వారం ఒక్కో ప్రభుత్వ పాఠశాల నుంచి ఎంపిక చేసిన 20 మంది విద్యార్థులతో కలెక్టర్‌ సమావేశమవుతున్నారు. ఈ కార్యక్రమానికి ‘కాఫీ విత్‌ కలెక్టర్‌’ అని పేరు కూడా పెట్టారాయన. ఇంతకీ ఎలా ఎంపిక చేస్తారంటే.. చదువు, ఆటలు, ఇతర అంశాల్లో ప్రతిభ చూపిన 10 మంది అబ్బాయిలు, 10 మంది అమ్మాయిలను కలెక్టర్‌తో సమావేశానికి ఎంపిక చేస్తారట. ఎంచక్కా కాఫీ తాగుతూ, స్నాక్స్‌ తింటూ.. పిల్లలు తమ సందేహాలను నివృత్తి చేసుకోవడంతో పాటు భవిష్యత్తుకు సంబంధించి అనేక ప్రశ్నలు అడుగుతున్నారట. త్వరలోనే అక్కడి ప్రైవేటు పాఠశాలల పిల్లలనూ ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయనున్నారు.

మరో జిల్లా కలెక్టర్‌ కూడా..

ఐఏఎస్‌ అధికారి మేఘనాథ్‌ రెడ్డి స్ఫూర్తితో తిరువళ్లూరు కలెక్టర్‌ జాన్‌ కూడా గత ఫిబ్రవరిలోనే ‘విద్యార్థులతో సమావేశం’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇతర రంగాలకు చెందిన గొప్ప వ్యక్తులు, ప్రభుత్వ బడుల్లో చదివి ప్రయోజకులైన వారినీ ఈ సమావేశాలకు అతిథులుగా తీసుకొస్తున్నారు. కలెక్టర్లే నేరుగా పిల్లలతో సమావేశం అవుతుండటంతో బడుల్లోని సమస్యలూ వారికి తెలుస్తున్నాయట. నిజంగా గొప్ప ఆలోచన కదూ! మీకూ అలా ఉన్నతాధికారులతో చర్చల్లో పాల్గొనే అవకాశం రావాలంటే.. చక్కగా చదువుకోవడమో, బాగా ఆడటమో చేసెయ్యండి మరి!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని