చిన్నారి కళ.. చిత్రాలు భళా!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. రెండున్నరేళ్ల వయసు పిల్లలంటే వచ్చీరాని మాటలతో, బుడి బుడి అడుగులతో తెగ అల్లరి చేస్తుంటారు కదూ! కానీ, అందరూ అలాగే ఉంటారనుకోకండి. ప్రతిభకు వయసుతో సంబంధం

Published : 23 Apr 2022 00:31 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌.. రెండున్నరేళ్ల వయసు పిల్లలంటే వచ్చీరాని మాటలతో, బుడి బుడి అడుగులతో తెగ అల్లరి చేస్తుంటారు కదూ! కానీ, అందరూ అలాగే ఉంటారనుకోకండి. ప్రతిభకు వయసుతో సంబంధం లేదని నిరూపిస్తోంది ఓ చిన్నారి. చిత్రకళతో అందరినీ మెప్పిస్తున్న ఆ నేస్తం గురించి తెలుసుకుందాం రండి..

ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్‌కు చెందిన అన్వి అగర్వాల్‌కు ప్రస్తుతం రెండున్నరేళ్లు. వయసు చిన్నదే అయినా తన ప్రతిభ మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మాగ్నెట్‌, పెండ్యూలమ్‌, రిఫ్లెక్షన్‌, బబూల్‌ తదితర 37 రకాల టెక్నిక్స్‌తో ఇప్పటివరకూ 72 పెయింటింగ్స్‌ గీసిన ఈ నేస్తం రెండేళ్లకే ‘వండర్‌ కిడ్‌’గా పేరు తెచ్చుకుంది.

తొమ్మిది నెలల వయసులోనే..
అన్వి.. తొమ్మిది నెలల వయసున్నప్పటి నుంచే బొమ్మలు గీయడం ప్రారంభించిందట. లాక్‌డౌన్‌ సమయంలో అందరూ ఇంటికే పరిమితం కావడంతో.. పాపకు ఏదైనా కొత్తగా నేర్పించాలని తల్లిదండ్రులు అనుకున్నారు. అప్పుడే పెయింటింగ్‌ను అన్వికి పరిచయం చేశారట. చిన్న వయసులోనే ఎక్కువ బొమ్మలు గీసేయడంతో ‘వరల్డ్‌ బుక్‌ రికార్డ్స్‌’లో చోటు దక్కించుకుంది. ఇటీవల ‘లండన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లోనూ ఈ నేస్తం పేరు నమోదు కావడంతో తల్లిదండ్రులు సంబరపడిపోతున్నారు. అంతేకాదు.. ఏడాదిన్నర వయసులోనే స్పానిష్‌ భాష నేర్చుకోవడం ప్రారంభించిందట. స్థానిక భాషలోని పదాలనూ స్పష్టంగా పలుకుతూ.. తన మేధాశక్తితో ఔరా అనిపిస్తోందట.

ముఖ్యమంత్రి ఫిదా
తాజాగా అన్వి తల్లిదండ్రులు ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ను కలిశారు. చిన్నారి ప్రతిభను ఆయనకు వివరించడంతోపాటు తను గీసిన బొమ్మనూ బహూకరించారు. దాన్ని చూసిన ముఖ్యమంత్రి.. పాప టాలెంట్‌కు ఫిదా అయ్యారు. తన ఆటోగ్రాఫ్‌ చేసిన ఓ చిత్రపటాన్ని కూడా చిన్నారికి అందించారట. అబ్బురపరిచే ప్రతిభతో ‘వండర్‌ కిడ్‌’గా పేరు తెచ్చుకున్న అన్వి.. ఎంతోమంది పిల్లలకు స్ఫూర్తి అని ఆయన కొనియాడారట. చిన్న వయసులోనే ఇంత ప్రతిభతో, ఇన్ని రికార్డులు సాధించిన ఈ నేస్తం నిజంగా గ్రేట్‌ కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని