Published : 28 Apr 2022 00:56 IST

పిట్ట కొంచెం.. ఉపన్యాసం ఘనం!

వందల మంది ముందు స్టేజీ మీద మాట్లాడాలంటే ఎంత పెద్దవారికైనా కాళ్లూ చేతులూ వణుకుతాయి. అసలు గొంతులోంచి మాట కూడా సరిగా బయటకు రాదు. ఎన్నో ప్రయత్నాల తర్వాత కానీ స్టేజీ ఫియర్‌ పోదు. కానీ ఓ బుడత మాత్రం మొదటి ప్రయత్నంలోనే అదరగొట్టింది. ఏకంగా రాష్ట్రస్థాయిలో ప్రథమ బహుమతిని కైవసం చేసుకుంది. అందరూ అవాక్కయ్యేలా చేసింది. ఆ చిన్నారి గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందామా..!

శామ్నా అంజనీ నారాయణకు పదకొండేళ్లు. ప్రస్తుతం నల్గొండలో ఆరో తరగతి చదువుతోంది. ఐనవోలు లక్ష్మీ నారాయణ, తారా పట్టతిల్‌ తల్లిదండ్రులు. నాన్న వ్యాపారి. అమ్మ టీచర్‌. ఇటీవల తెలంగాణ రాష్ట్ట్ర్ర ప్రభుత్వం నిర్వహించిన అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా రాష్ట్రస్థాయి ఉపన్యాస పోటీల్లో పాల్గొని.. జూనియర్‌ విభాగంలో  మొదటి బహుమతి గెలుచుకుంది.

బొమ్మను గీస్తే...

శామ్నాకు చిన్నప్పటి నుంచీ బొమ్మలు గీయడమంటే చాలా ఆసక్తి. పలు స్థాయిల్లో చిత్రలేఖనం పోటీల్లో పాల్గొంటూ బహుమతులు గెలుచుకుంటూ వస్తోంది. ఉపన్యాస పోటీల్లో మాత్రం ఇంతకు ముందెప్పుడూ పాల్గొనలేదు. అమ్మ ఇచ్చిన ప్రోత్సాహంతో అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన పోటీల్లో పాల్గొని సత్తా చాటి.. రాష్ట్రస్థాయికి ఎంపికైంది.

300 మందిని వెనక్కి నెట్టి..

రాష్ట్రస్థాయి పోటీలకు అన్ని జిల్లాల నుంచి మొత్తం 300 ఎంట్రీలు వచ్చాయి. అందులో శామ్నా ఉపన్యాసం న్యాయనిర్ణేతల్ని ఆకట్టుకుంది. రాష్ట్ట్ర్రస్థాయిలోనూ మొదటి స్థానాన్ని నిలబెట్టుకుంది. మొదటిసారిగా వక్తృత్వ పోటీల్లో పాల్గొనడమే కాకుండా జిల్లా, రాష్ట్రస్థాయిలో మొదటి బహుమతి గెలుచుకోవడం ఓ రకంగా రికార్డే అని చెప్పాలి.

కరోనా వల్ల...

కొవిడ్‌ మహమ్మారి కారణంగా ఈసారి జిల్లా స్థాయి పోటీలన్నీ ఆన్‌లైన్‌లోనే జరిగాయి. పిల్లలంతా తమ ఉపన్యాసాన్ని వీడియో తీసి నిర్వాహకులకు పంపారు. వాటిలో శామ్నా మొదటిస్థానం దక్కించుకోవడంతో రాష్ట్రస్థాయికి ఎంపికైంది. అక్కడా తన సత్తా చాటింది. ఇటీవల బహుమతి అందుకోవడానికి హైదరాబాద్‌ వెళ్లింది ఈ నేస్తం. అంతవరకు కేవలం ఆన్‌లైన్‌ పోటీల్లోనే పాల్గొన్న శామ్నా.. వేదిక మీద కొన్ని వందల మంది ఎదుట ఎటువంటి భయమూ లేకుండా మాట్లాడింది. ఆమె ఉపన్యాసానికి అక్కడివారంతా ముగ్ధులయ్యారు. చప్పట్లతో తమ అభినందనలు తెలిపారు.

నాలుగు భాషల్లోనూ..

బహుమతితోపాటు ధ్రువీకరణ పత్రాన్ని ఏకంగా తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ అలీ చేతుల మీదుగా అందుకుంది శామ్నా. మళ్లీ వచ్చే సంవత్సరం నిర్వహించనున్న పోటీల్లో కూడా ప్రతిభ చూపాలని చిన్నారిని మంత్రి ప్రోత్సహించారు. పదేళ్లకే నాలుగు భాషల్లో ప్రావీణ్యం సంపాదించుకుంది. మలయాళం, తెలుగు, ఇంగ్లిష్‌, హిందీ నేర్చుకుంది. ఇంతకీ తనకు హిందీ ఎలా వచ్చో తెలుసా.. టీవీల్లో కార్టూన్లు చూస్తూ నేర్చుకుందట! ఈ వయసులోనే అద్భుతాలు సృష్టిస్తున్న చిన్నారి శామ్నా నిజంగా చాలా గ్రేట్‌ కదూ!

- భూపతి సత్యనారాయణ, ఈజేఎస్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు