చిత్రం... భళారే బహుమానం!

వయసు కేవలం పన్నెండు సంవత్సరాలు. మరో వైపు కండరాల సంబంధిత వ్యాధి. అయినా ఓ చిన్నారి గీసిన చిత్రం యునెస్కో- ఐసీహెచ్‌పీలో బహుమతి గెలుచుకుంది. ఇంతకీ ఆ బుడతడు ఎవరు?

Published : 10 Jul 2022 00:26 IST

వయసు కేవలం పన్నెండు సంవత్సరాలు. మరో వైపు కండరాల సంబంధిత వ్యాధి. అయినా ఓ చిన్నారి గీసిన చిత్రం యునెస్కో- ఐసీహెచ్‌పీలో బహుమతి గెలుచుకుంది. ఇంతకీ ఆ బుడతడు ఎవరు? అతడు గీసిన చిత్రమేంటో తెలుసుకోవాలని ఉందా.. అయితే ఇంకెందుకాలస్యం? ఈ కథనం చదివేయండి.

అహ్మదాబాద్‌కు చెందిన అయాన్‌ జరివాలా ప్రస్తుతం ఏడో తరగతి చదువుతున్నాడు. ప్రమాదకరమైన కండరాల సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. ఇంత విపత్కర పరిస్థితుల్లోనూ అయాన్‌ అద్భుతాన్ని చేశాడు. యునెస్కో- ఇంటర్నేషనల్‌ హైడ్రోలాజికల్‌ ప్రోగ్రాం (ఐహెచ్‌పీ)లో భాగంగా ఇటీవల నిర్వహించిన చిత్రలేఖన పోటీలో తన సత్తా చాటాడు.

మూడు గీస్తే..
ఈ పోటీ.. ‘వాటర్‌ వియ్‌ వాంట్‌’ థీమ్‌ మీద సాగాయి. ఇందులో అయాన్‌ 6-12 సంవత్సరాల విభాగంలో చిత్రలేఖనంలో పోటీపడ్డాడు. అయాన్‌ మూడు చిత్రాలను పోటీకోసం పంపాడు. ఇందులో ‘ది రైన్‌బో ఫార్మ్‌’ ఏకంగా ప్రథమ బహుమతిని గెలుచుకుంది.

రంగుల తివాచీ!
భూమి మీద రంగురంగుల తివాచీ పరిచినట్లున్న ‘ది రైన్‌బో ఫార్మ్‌’ బొమ్మ గీశాడు మన అయాన్‌. నదుల నుంచి పారే నీరు భూమి మీద పంటలు పండటానికి ప్రధాన కారణమవుతుంది. ఆ పంటలు అనేకరంగులతో హరివిల్లును తలపిస్తాయని అర్థం. ఇంత చిన్న వయసులోనే అంత విస్తృతార్థంతో బొమ్మను గీశాడు. అలా న్యాయనిర్ణేతల మనసు కట్టిపడేసి బహుమతి గెలుచుకున్నాడు.

ఆత్మవిశ్వాసాన్ని పెంచింది..
తాను గీసిన బొమ్మకు బహుమతి రావడంతో అయాన్‌ చాలా ఆనందించాడు. అతడిలో ఆత్మవిశ్వాసమూ పెరిగింది. ఆనందానికి ఎంతో శక్తి ఉందని, అది ప్రస్తుతం తనకు తెలుస్తోందని సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. తాను సాధించిన ఈ విజయం వెనక తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహం ఎంతో ఉందని చెబుతున్నాడు మన అయాన్‌.

వరంలాంటి విజయం
‘అయాన్‌ సాధించిన గుర్తింపు నిజంగా మాకు ఒక వరంలాంటింది. ఎందుకంటే మేం అతని చికిత్స కోసం త్వరలోనే నిధుల సేకరణను ప్రారంభించాలనుకుంటున్నాం. యునెస్కో నుంచి వచ్చిన గుర్తింపు, వారి పోటీలో ప్రథమ స్థానంలో నిలవడం నిజంగా మాకు ఎంతో సహాయపడనుంది’ అని అయాన్‌ తల్లిదండ్రులు సంధ్య, జుబైర్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి మనమూ ఈ చిన్నారికి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పేద్దామా!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని