చేతులు కలిపి... మార్గం కనిపెట్టె!

వాళ్లంతా చిట్టి చిన్నారులు. కల్లాకపటం తెలియని పొన్నారులు. లిపిలేని తమ భాషను కాపాడుకోవడం కోసం తమ చిన్ని చేతులను కలిపారు. భాషా పరిరక్షణకు ఉడతా భక్తిగా బుడతలంతా ఒక్కటయ్యారు. ఇంతకీ వాళ్లంతా ఏం చేశారు. ఏం చేస్తున్నారో.. తెలుసుకోవాలని ఉందా?!...

Published : 17 Aug 2022 01:03 IST

వాళ్లంతా చిట్టి చిన్నారులు. కల్లాకపటం తెలియని పొన్నారులు. లిపిలేని తమ భాషను కాపాడుకోవడం కోసం తమ చిన్ని చేతులను కలిపారు. భాషా పరిరక్షణకు ఉడతా భక్తిగా బుడతలంతా ఒక్కటయ్యారు. ఇంతకీ వాళ్లంతా ఏం చేశారు. ఏం చేస్తున్నారో.. తెలుసుకోవాలని ఉందా?!

ది తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి జిల్లా. ఇక్కడ కోటగిరికి సమీపంలో సెమ్మనారై అనే కుగ్రామం ఉంది. ఈ ఊర్లో గిరిజన రెసిడెన్షియల్‌ పాఠశాల ఉంది. లిఖిత రూపం లేని, లిపి లేని అంతరించిపోతున్న గిరిజన భాషలను పరిరక్షించే ఉద్దేశంతో ‘లాంగ్వేజ్‌ బాక్స్‌’ను ఏర్పాటు చేశారు.

రాసి.. పెట్టెలో వేసి...

ఈ పాఠశాలలో ఇరుల, కురుంబ తెగలకు చెందిన విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు. వీళ్లు తమ భాషకు సంబంధించిన పదాలను ఓ కాగితంపై ఇంగ్లిష్‌లో లేదా తమిళంలో రాసి ఈ ‘భాషా పెట్టె’లో వేస్తున్నారు. ఇలా తమ భాషకు సంబంధించి అంతరించిపోతున్న పదాలను రక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారు.

పదాల బ్యాంక్‌!

మనమంతా రూపాయి, రూపాయి పిగ్గీ బ్యాంక్‌లో దాచుకుంటున్నట్లు.. అక్కడి పిల్లలంతా ఒక్కో పదాన్నే ఈ ‘భాషా పెట్టె’లో దాచుకుంటున్నారు. వీరికి లక్ష్మణ్‌ అనే రచయిత ఒకరు సాయం చేస్తున్నారు. ఈయన ఇరుల పాటలను సేకరించి పరిరక్షిస్తున్నారు.

ఆరు నెలలకు ఓసారి..

ఇలా పదాలను పెట్టెలో వేయడంతోనే బాధ్యత తీరిపోదు. ప్రతి ఆరు నెలలకు ఓసారి ఈ భాషా పెట్టెను తెరిచి, పదాలను సేకరిస్తున్నారు. త్వరలోనే ఈ పదాలతో ఓ పుస్తకాన్నీ ముద్రించనున్నారు. ‘‘గిరిజనుల భాషల్లో ఎంతో సాహిత్యం ఉంది. పాటలు, జాతీయాలు, సంస్కృతీ సంప్రదాయాలు వీటిలో దాగి ఉన్నాయి. కానీ ఇవన్నీ ప్రస్తుతం అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి. ఈ భాషలకు లిపి లేకపోవడమే ప్రధాన కారణం. ఇలా ‘భాషా పెట్టె’ను ఏర్పాటు చేసుకుని తమ భాషను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్న పిల్లలది నిజంగా మంచి ఆశయం’’ అంటున్నారు గిరిజన భాషల మీద పరిశోధన చేస్తున్న ఎన్‌.తిరుమూర్తి. మరి మనమూ సెమ్మనారై ఊర్లోని గిరిజన రెసిడెన్షియల్‌ పాఠశాల విద్యార్థులకు ఆల్‌ ది బెస్ట్‌ చెబుదామా..!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని