చిన్న వయసు.. పెద్ద ఘనత!

హలో నేస్తాలూ.. ఇంట్లో అమ్మ వండి పెడుతుంటే ఎంచక్కా తింటూ మన పని మనం చేసుకుంటున్నాం. ఏమాత్రం ఆలోచించకుండా మిగిలిన ఆహార పదార్థాలను బయట పడేస్తున్నాం.

Published : 09 Sep 2022 00:44 IST

హలో నేస్తాలూ.. ఇంట్లో అమ్మ వండి పెడుతుంటే ఎంచక్కా తింటూ మన పని మనం చేసుకుంటున్నాం. ఏమాత్రం ఆలోచించకుండా మిగిలిన ఆహార పదార్థాలను బయట పడేస్తున్నాం. అలా వృథా చేయడం వల్ల కలుగుతున్న సమస్యలు, భవిష్యత్తులో రాబోయే ముప్పు తదితర అంశాలపైన ఓ చిన్నారి అయితే భారీ అధ్యయనమే చేసింది. అందుకు ఓ రికార్డూ సాధించింది. ఆ వివరాలే ఇవీ..

దిల్లీకి చెందిన ఓవియా సింగ్‌కు ప్రస్తుతం 11 సంవత్సరాలు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు తమ అభిప్రాయాలను పంచుకునే ‘టెడెక్స్‌ టాక్స్‌’లో పాల్గొన్న అతి పిన్న వయస్కురాలిగా గుర్తింపు సాధించింది. అంతే,కాదు.. పర్యావరణానికి సంబంధించిన అంశం ‘భూసారం’పైన అనర్గళంగా మాట్లాడి అందరితో శెభాష్‌ అనిపించుకుంది. 

స్కూల్‌ ప్రాజెక్టులో భాగంగా..

తాను చదువుతున్న బడిలో ఉపాధ్యాయులు ఒకసారి ఇచ్చిన ప్రాజెక్టులో భాగంగా పర్యావరణానికి సంబంధించిన అంశాలపైన పరిశోధన చేయసాగింది ఓవియా. ఆ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆహార కొరత, పెరుగుతున్న జనాభా తదితర గణాంకాలు చూసి ఆశ్చర్యపోయిందామె. మూడో ప్రపంచ యుద్ధమంటూ జరిగితే, అది ఆహారానికి సంబంధించిందే కావొచ్చని అప్పుడే గట్టిగా నమ్మింది. జనాభాకు సరిపడా ఆహార ఉత్పత్తి లేదని.. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తు తరాలకు చాలా ప్రమాదకరమని అర్థమైంది. దీనంతటికీ ఏటా భూసారం కొట్టుకుపోవడమే ప్రధాన కారణమని తెలుసుకుంది. ఆ దిశగా మరింత లోతుగా పరిశోధన చేసింది ఓవియా. రోజూ భూమిపైన జరుగుతున్న ఆహార వృథాకు సంబంధించిన లెక్కలు ఆమెను మరింత కలవరపెట్టాయి.

గణాంకాల ఆధారంగా..

సాధారణంగా పొలాల్లో ఏదైనా పంట పండాలంటే 4 నుంచి 5 శాతం సహజసిద్ధమైన పోషకాలు అవసరం. అటువంటి పోషకాలు ఇప్పటికే అర శాతం కొట్టుకుపోయాయనీ, ఆ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా సాగు భూమి విస్తీర్ణం దాదాపు 40 శాతం తగ్గిపోయిందని టెడెక్స్‌ వేదిక మీద నుంచి గణాంకాలతో సహా ప్రసంగించింది ఓవియా. ఓ సర్వే ప్రకారం వరదలు, ఇతర కారణాల వల్ల ఏటా 5,334 మిలియన్‌ టన్నుల మేరకు భూసారం సముద్రంలో కలిసిపోతుందట. అందులో కొంత భాగం ప్రాజెక్టుల వద్ద పూడికగా పేరుకుంటోందని చెబుతుందీ బాలిక. కొన్ని దశాబ్దాల కింద కూరగాయలు, ఆకుకూరల్లో లభించిన పోషకాల శాతం.. ప్రస్తుతం చాలా తగ్గిపోయిందట. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తు తరాల వారందరూ పౌష్టికాహార లోపంతో బాధపడే ముప్పు పొంచి ఉందని అంచనా వేసిందీ నేస్తం. ఈ వయసులోనే లోతైన పరిశోధనతో ఇంత సమాచారం సేకరించిన ఓవియా నిజంగా గ్రేట్‌ కదూ. ఇప్పటి నుంచైనా పర్యావరణం కోసం మనవంతుగా ఆహారం వృథా చేయడం మానేద్దాం ఫ్రెండ్స్‌.. సరేనా!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని