Updated : 11 Sep 2022 06:23 IST

ఈ బుడత.. పతకాల్లో చిరుత!

పట్టుమని పదేళ్లు లేవు... కానీ పట్టుపడితే మాత్రం.. పతకాలు వచ్చి తీరాల్సిందే!
పోనీ ఓ విభాగమా అంటే.... ఊహూ.. కానే కాదు.... పలు విభిన్న విభాగాల్లో రాణిస్తూ... దూసుకుపోతోంది.. ఇంతకీ ఎవరా బుడత... ఎక్కడుంటుందీ చిరుత... తెలుసుకుందామా మరి!

కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం ఆర్‌బీ పట్నం గ్రామానికి చెందిన మన్యం పల్లవి(8) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతోంది. గ్రామీణ నేపథ్యం ఉన్న ఆమె జిమ్నాస్టిక్స్‌, రన్నింగ్‌, స్విమ్మింగ్‌ ఇలా మూడు విభాగాల్లో జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించి అనేక  పతకాలు సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఏకంగా అంతర్జాతీయ పోటీలకు అర్హత సాధించి ఔరా అనిపిస్తోంది. ఈ ఏడాది అక్టోబరు 26 నుంచి 30 వరకు ఈజిప్టులో జరగనున్న అంతర్జాతీయ స్విమ్మింగ్‌, రన్నింగ్‌, రైఫిల్‌ షూటింగ్‌ పోటీలకు ఎంపికైంది.

నాన్న చేయూత!
చదువుతోపాటు క్రీడల్లోనూ తన కుమార్తె రాణించాలనే సంకల్పంతో పల్లవిని చిన్నప్పటి నుంచి, నాన్న మన్యం చిన్న, అమ్మ వెంకట లక్ష్మి ప్రోత్సహిస్తున్నారు. 2018 నుంచి నాన్న రోజూ కాకినాడ తీసుకొని వెళ్లి జిమ్నాస్టిక్స్‌, రన్నింగ్‌, స్విమ్మింగ్‌, రోలర్‌ స్కేటింగ్‌లో శిక్షణ ఇప్పిస్తున్నారు. ఆ చిన్నారి సైతం తండ్రి నమ్మకాన్ని నిలబెడుతూ.. ఆయా రంగాల్లో చక్కగా రాణిస్తోంది.

విజయాల పరంపర!
2019లో కాకినాడలో జోనల్‌ స్థాయిలో నిర్వహించిన రోలర్‌ స్కేటింగ్‌ పోటీల్లో ప్రథమ స్థానం, 2022లో కాకినాడలో జరిగిన జిమ్నాస్టిక్స్‌ జిల్లాస్థాయి పోటీల్లో ప్రథమ స్థానం, గుంటూరులో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో ద్వితీయ స్థానం పొందింది. 2022లో విశాఖపట్నంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రథమం, ఆగస్టు 13, 14వ తేదీల్లో మహారాష్ట్ర పుణెలోని శ్రీ శివ్‌ ఛత్రపతి స్పోర్ట్స్‌ మైదానంలో జరిగిన 11వ జాతీయస్థాయి పోటీల్లో తృతీయ స్థానం సాధించింది.


రోజూ 3 గంటల సాధన..

‘గ్రామంలో కబడ్డీ పోటీలు జరిగినపుడు నాన్న తీసుకెళ్లేవారు. దీంతో నాకు కూడా క్రీడలపై ఆసక్తి పెరిగింది. రోజూ కాకినాడ తీసుకొని వెళ్లి స్కేటింగ్‌లో శిక్షణ ఇప్పించేవారు. మూడు గంటలపాటు సాధన చేసేదాన్ని. నాకు నాలుగున్నరేళ్ల వయసు వచ్చిన తర్వాత జిమ్నాస్టిక్స్‌, స్విమ్మింగ్‌లో శిక్షణ ప్రారంభించా. ఇప్పుడు నా వయసు ఎనిమిదేళ్లు. అంతర్జాతీయ స్థాయి పోటీల్లోనూ రాణించేందుకు నిరంతరం సాధన చేస్తున్నా’ అని చెబుతోంది ఈ చిన్నారి. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలని మనమూ పల్లవికి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పేద్దామా మరి.

- మహమ్మద్‌ రియాజ్‌ పాషా, న్యూస్‌టుడే, పెద్దాపురం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని