సాధించిన పతకం.. నాన్నకు అంకితం!

తనను ప్రాణానికి ప్రాణంగా పెంచుతున్న నాన్న మరణం... ఆ చిన్నారిని కన్నీటి సంద్రమే చేసింది. అయినా వెనకడుగు వేయకుండా... నాన్న ఆశయ సాధన కోసం ముందుకే సాగింది.

Published : 11 Dec 2022 00:21 IST

తనను ప్రాణానికి ప్రాణంగా పెంచుతున్న నాన్న మరణం... ఆ చిన్నారిని కన్నీటి సంద్రమే చేసింది. అయినా వెనకడుగు వేయకుండా... నాన్న ఆశయ సాధన కోసం ముందుకే సాగింది. ఏకంగా బంగారు పతకాన్ని సాధించి, తన నాన్నకు అంకితమిచ్చి నివాళులర్పించింది. ఇలా ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది ఓ చిన్నారి చిరుత. ఇంతకీ ఆ బుడత ఎవరు? సాధించిన ఘనతేంటో తెలుసుకుందామా!

మ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఈర్లపూడికి చెందిన కృతిక ప్రస్తుతం ఆరో తరగతి చదువుతోంది. వాళ్ల నాన్న శ్రీనివాసరావు ఎఫ్‌ఆర్వో (ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌). ఉద్యోగ రీత్యా ప్రస్తుతం కొత్తగూడెంలో ఉంటున్నారు. తన తండ్రి క్రమశిక్షణ, పట్టుదల, కృషి చిన్నారి కృతికను ఆకర్షించింది. తనూ నాన్నలా అందరికీ ఆదర్శంగా నిలవాలని నిశ్చయించుకుంది. అందుకే నాన్న బాటే తన బాటగా ముందుకు సాగాలనుకుంది. చిన్నారి ఉత్సాహం చూసి ఆ తండ్రి కూడా తనను ఆటల్లో ప్రోత్సహించారు. ఒకటో తరగతి నుంచే పరుగు పోటీల్లో పాల్గొంటూ, సత్తా చాటుతూ వస్తోంది.

మనో ధైర్యంతో...

సబ్‌ జూనియర్‌ అండర్‌-10లో ఎలాగైనా రాష్ట్రస్థాయిలో బంగారు పతకం సాధించాలని చిన్నారిని తండ్రి సాధన చేయిస్తున్నారు. ఆరేడు నెలలుగా రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో తనే పాపను మైదానానికి తీసుకెళ్లి, తీసుకురావడం చేసేవారు. ఇంకో నాలుగు రోజుల్లో జిల్లాస్థాయి అథ్లెటిక్స్‌ పోటీలు ఉన్నాయనగా శ్రీనివాసరావు విధి నిర్వహణలో చనిపోయారు. అంత బాధలోనూ కుంగిపోలేదు కృతిక. నాన్న లేరని బాధపడుతూ కూర్చోకుండా, ఆయన లక్ష్యాన్ని నెరవేర్చాలనే దృఢ నిశ్చయంతో ఆ పోటీల్లో పాల్గొంది. మనోధైర్యంతో, కోచ్‌ మల్లికార్జున్‌ శిక్షణలో అండర్‌-10 విభాగంలో లాంగ్‌జంప్‌లో స్వర్ణం, 100 మీటర్ల పరుగులో రజతం కైవసం చేసుకుంది. రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించింది.

రాష్ట్రస్థాయిలోనూ సత్తాచాటి..

ఈనెల 5, 6 తేదీల్లో హైదరాబాద్‌లో జరిగిన అథ్లెటిక్స్‌ రాష్ట్రస్థాయి పోటీల్లో లాంగ్‌జంప్‌లో స్వర్ణపతకం సాధించి నాన్నకు అంకితమిచ్చింది. ఇప్పటి వరకు అయిదు సార్లు రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ పోటీల్లో పాల్గొన్నా పతకాలు సాధించలేకపోయింది. తన కోసం నాన్న కన్న కలల్ని నెరవేర్చడానికి ఎలాగైనా పతకం సాధించాలని ఈ సారి బరిలో దిగింది. స్వర్ణ పతకంతో నివాళి అర్పించింది.

నాన్న కల నెరవేరుస్తా...

‘నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాన్న అడుగుజాడల్లో నడిచాను. నాన్నే నా చేయిపట్టుకుని నడిపించారు. ఎన్నో నీతికథలు చెప్పారు. క్రమశిక్షణ, పట్టుదల, కృషితో ఎదగాలని చెబుతుండేవారు. ఐఎఫ్‌ఎస్‌ గురించి వివరించేవారు. నాన్న ఐఎఫ్‌ఎస్‌ కావాలనుకున్నారు. కానీ వీలు కాలేదు. నన్ను ఐఎఫ్‌ఎస్‌గా చూడాలనుకున్నారు. కానీ ఆయన ఇప్పుడు లేరు. అయినా నాన్న కలను నెరవేరుస్తాను’ అంటోన్న కృతిక మనందరికీ ఎంతో ఆదర్శం కదూ! భవిష్యత్తులో తాను అనుకున్నది సాధించాలని మనమూ మనస్ఫూర్తిగా ఈ చిన్నారికి ఆల్‌ ది బెస్ట్‌ చెబుదామా.

బి. సత్యనారాయణ, హైదరాబాద్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని