ఆసనాలు భళా.. ‘గిన్నిస్‌’ వచ్చెనిలా..!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. ‘మీకు యోగా తెలుసా?’ - ‘ఓ.. ఎందుకు తెలియదు.. పత్రికల్లో, టీవీల్లో తరచుగా ఆ పేరు వింటుంటాం కదా’ అంటారు.. అంతే కదా.. మన వయసు పిల్లలకు దాని గురించి తెలుస్తుంది కానీ, ఆసనాలు వేయడం అంతగా రాదు.

Published : 12 Mar 2023 00:49 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌.. ‘మీకు యోగా తెలుసా?’ - ‘ఓ.. ఎందుకు తెలియదు.. పత్రికల్లో, టీవీల్లో తరచుగా ఆ పేరు వింటుంటాం కదా’ అంటారు.. అంతే కదా.. మన వయసు పిల్లలకు దాని గురించి తెలుస్తుంది కానీ, ఆసనాలు వేయడం అంతగా రాదు. ఒకరిద్దరికి సులభమైన ఆసనాలు కొన్ని వచ్చి ఉండొచ్చు. అయితే, ఓ నేస్తం మాత్రం యోగాలో ఏకంగా ప్రపంచ రికార్డే సాధించింది. ఇంతకీ తనెవరో, ఆ వివరాలేంటో తెలుసుకుందామా..!

భారత్‌కు చెందిన ప్రాన్వీ గుప్తా వాళ్ల కుటుంబం కొన్నేళ్ల క్రితమే దుబాయ్‌లో స్థిరపడింది. ప్రస్తుతం తనకు ఎనిమిది సంవత్సరాలు. ఈ వయసులో ఆసనాలు వేయడమే కష్టం. కానీ, ఈ నేస్తం మాత్రం ఏకంగా బోలెడు మందికి యోగా నేర్పించే అర్హత పొందింది. ప్రపంచంలోనే అతి పిన్న వయసు యోగా శిక్షకురాలిగా ‘గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’లో చోటు దక్కించుకుంది.

తల్లిని చూసి సాధన..

ప్రాన్వీ వాళ్ల అమ్మకు ప్రతిరోజూ యోగా సాధన చేయడం అలవాటు. నిత్యం అమ్మ సాధన చూసి, క్రమంగా యోగాపైన ఇష్టం పెంచుకుంది. తనకు కూడా ఆ ఆసనాలు వేయాలని అనిపించింది. అలా మూడున్నరేళ్ల వయసు నుంచే తల్లితోపాటు యోగా ప్రాక్టీస్‌ చేయడం ప్రారంభించింది. కొన్నాళ్లకు సొంతంగానే సాధన చేయసాగింది. ఒకవైపు చదువుకుంటూనే ఖాళీ సమయాల్లో యోగా శిక్షణ తరగతులకూ హాజరయ్యేది. కొద్దిరోజుల తర్వాత ప్రాన్వీ ప్రతిభ చూసి.. ‘యోగా టీచర్స్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రాం’లో చేరేలా శిక్షకురాలు ప్రోత్సహించారు. అంతేకాదు.. 200 గంటల కోర్సును కూడా విజయవంతంగా పూర్తి చేసింది. దాంతో గతేడాది నవంబర్‌లో గిన్నిస్‌ బుక్‌ ప్రతినిధులు తన పేరు నమోదు చేసుకున్నారు. తాజాగా ‘అతి పిన్న వయసు యోగా శిక్షకురాలు’గా అధికారిక ధ్రువపత్రం అందించారు. ప్రాన్వీ ఏడు సంవత్సరాల 165 రోజుల వయసున్నప్పుడు ఈ రికార్డు సాధించిందన్నమాట. అయితే, ‘అతి పిన్న వయసు యోగా శిక్షకుడు’గా తొమ్మిదేళ్ల 220 రోజుల వయసులో గుర్తింపు సాధించిన రేయాన్ష్‌ కంటే ఈ నేస్తమే చిన్నది కావడం విశేషం.

తెలివితేటలు అపారం..

గతంలోనూ ప్రాన్వీకి చాలా అవార్డులు, రివార్డులు వచ్చాయి. వాటిలో ఇంటర్నేషనల్‌ ఒలింపియాడ్స్‌లో వచ్చిన బంగారు పతకాలే తనకు ఎంతో పేరు తీసుకొచ్చాయట. ఈ నేస్తానికి చాలా తెలివితేటలు ఉన్నాయనీ, దానికి మించి.. నేర్చుకోవాలనే ఆసక్తి కూడా ఉందని తన టీచర్‌ చెబుతున్నారు. క్లాసులకు మాత్రం కచ్చితంగా హాజరయ్యేదట. ‘చదువుకుంటూనే మరో విద్య నేర్చుకోవడం అంత సులభం కాదు.. పెద్దలతోపాటు పిల్లలకూ యోగా ఎంతో మంచిది. ఆసనాల వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. క్రమశిక్షణ అలవడుతుంది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతోనే ప్రపంచ రికార్డు సాధించా’ అని ప్రాన్వీ గర్వంగా చెబుతోంది. ఇంత మేలు చేసే యోగాను మరింత మందికి నేర్పించాలని, ఓ యూట్యూబ్‌ ఛానల్‌ కూడా ప్రారంభించింది. పిల్లలూ.. ‘మిమ్మల్ని మీరు నమ్మండి.. ఉన్నతమైన కలలు కనండి’.. అని చెబుతున్న ఈ నేస్తం చాలా గ్రేట్‌ కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని