పన్నెండేళ్లకే అయిదు పట్టాలు!

హలో ఫ్రెండ్స్‌.. ఇంటికొచ్చాక హోంవర్క్‌ చేయడమంటేనే ‘అబ్బా’ అనేస్తాం. ఉదయం నిద్రలేవగానే టీచర్‌ కోప్పడతారని ఏదో హడావిడిగా చేసేస్తుంటాం.

Updated : 07 Jun 2023 05:14 IST

హలో ఫ్రెండ్స్‌.. ఇంటికొచ్చాక హోంవర్క్‌ చేయడమంటేనే ‘అబ్బా’ అనేస్తాం. ఉదయం నిద్రలేవగానే టీచర్‌ కోప్పడతారని ఏదో హడావిడిగా చేసేస్తుంటాం. కానీ, ఓ నేస్తం అయితే.. పన్నెండేళ్లకే ఒకటీ రెండూ కాదు ఏకంగా అయిదు డిగ్రీలతో కాలేజీ చదువును పూర్తి చేశాడు. ఇంతకీ అతడెవరో, ఆ వివరాలేంటో చదివేయండి మరి..

మెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన క్లోవిస్‌ హంగ్‌కు ప్రస్తుతం 12 సంవత్సరాలు. సాధారణంగా మనదగ్గరైతే ఈ వయసు వారంతా ఏడో, ఎనిమిదో తరగతి చదువుతుంటారు. కానీ, క్లోవిస్‌ మాత్రం ఏకంగా అయిదు డిగ్రీలతో కళాశాల చరిత్రలో ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు.

అమ్మ సహకారంతో..

తొమ్మిదేళ్ల వయసులోనే క్లోవిస్‌ కళాశాల చదువును ప్రారంభించాడు. ఆ కాలేజీలో 13 ఏళ్లకే ‘యంగెస్ట్‌ గ్రాడ్యుయేట్‌’గా గుర్తింపు తెచ్చుకున్న జాక్‌ రికో స్ఫూర్తితో అతడి రికార్డును బద్దలుకొట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. దాంతో మొదటి రోజు నుంచే కష్టపడి చదవడం ప్రారంభించాడీ నేస్తం. మొదట గణితం తరగతులకు మాత్రమే హాజరయ్యేవాడు. తర్వాత అవి తనకు సులభంగా అర్థం అవుతుండటంతో ఇతర తరగతులకూ వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అంతేకాదు.. ఆ కాలేజీలో అందుబాటులో ఉన్న ‘స్పెషల్‌ అడ్మిట్‌’ అనే ప్రోగ్రాంలో భాగంగా హోమ్‌ స్కూలింగ్‌లోనూ జాయినయ్యాడు. ఇంట్లో తల్లి కూడా టీచర్‌ కావడంతో క్లోవిస్‌ను దగ్గరుడి చదివించేది. సందేహాలను కూడా వెంటవెంటనే నివృత్తి చేసేదట. అలా అయిదు అంశాల్లో ఒకేసారి డిగ్రీని పూర్తి చేసేసి, తను అనుకున్నది సాధించాడు.

అధ్యాపకుల ఆశ్చర్యం..

మొదట్లో క్లోవిస్‌ను చూసి తోటి విద్యార్థులతోపాటు అధ్యాపకులూ ఆశ్చర్యపోయేవారట. ‘ఇంత చిన్న వయసులోనే ఇక్కడి వరకూ ఎలా వచ్చావు?’ అంటూ తనను రకరకాల ప్రశ్నలు అడుగుతూ చిన్నచూపు చూసేవారట. కానీ, కొద్దిరోజుల్లోనే ఈ నేస్తంలోని ప్రతిభను గమనించి.. వారంతా అతడిని తమలో ఒకరిగా భావించడం ప్రారంభించారట. ఇంకో విశేషం ఏంటంటే.. నాయకత్వ లక్షణాలు, సమస్యలపైన స్పందించే గుణం ఉండటంతో అక్కడి విద్యార్థి సంఘానికి ఈ నేస్తమే నేతృత్వం వహించేవాడట. భవిష్యత్తులో చిన్న పిల్లల వైద్యుడు కావాలనేది తన లక్ష్యమని చెబుతున్నాడు. నిజంగా ఈ నేస్తం చాలా గ్రేట్‌ కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని