జట్టుగా.. కలసికట్టుగా!

హాయ్‌ నేస్తాలూ...! మనకు ఈ మధ్యే వేసవి సెలవులు ముగిసి, పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి కదూ! అవును ఇంతకు మీరు స్కూలుకు ఎలా వెళ్తున్నారు. మీలో కొంతమంది స్కూలు బస్సులో వెళ్తుంటారు. ఇంకొందరు ఆటోలు, సైకిళ్ల మీద ప్రయాణిస్తుంటారు.

Updated : 21 Jun 2023 04:52 IST

హాయ్‌ నేస్తాలూ...! మనకు ఈ మధ్యే వేసవి సెలవులు ముగిసి, పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి కదూ! అవును ఇంతకు మీరు స్కూలుకు ఎలా వెళ్తున్నారు. మీలో కొంతమంది స్కూలు బస్సులో వెళ్తుంటారు. ఇంకొందరు ఆటోలు, సైకిళ్ల మీద ప్రయాణిస్తుంటారు. మరికొందరిని అమ్మో.. నాన్నో.. తమ వాహనాల మీద దించేసి వస్తారు. బడి మరీ దగ్గరున్న వాళ్లు కాలినడకన కూడా వెళ్తుంటారు కదా! కానీ ఓ దేశంలోని కొందరు విద్యార్థులు వారంలో ఓ రోజు ఎలా వెళ్తున్నారో తెలుసా...!

స్కాట్లాండ్‌లో స్కూలు పిల్లలు ప్రతి శుక్రవారం ‘బైక్‌ బస్‌’ మీద బడికి వెళ్తున్నారు. ‘బైక్‌ బస్‌’ అంటే ఏంటబ్బా...! అని మీకీపాటికే అనుమానం వచ్చి ఉంటుంది. ఆ ఏముంది... బైక్‌లాంటి బస్సో... బస్‌లాంటి బైకో అయి ఉంటుందని మీలో ఇంకొందరు అనుకొంటూ ఉంటారు. కానీ కాదు. పిల్లలంతా జట్టుగా.. కలసికట్టుగా... తమతమ సైకిళ్ల మీద స్కూలుకు వెళ్లడాన్నే ‘బైక్‌ బస్‌’ అని పిలుస్తున్నారు. వీరంతా ఓ చోట ప్రారంభమవుతారు. మధ్యలో మరి కొందరు కలుస్తారు. ఏ రూట్లో వెళ్లాలనుకుంటున్నారో ముందే నిర్ణయించుకుంటారు. మధ్య మధ్యలో విరామాలూ ఉంటాయి.

ఎంతో ఇష్టంగా...

సైకిళ్లు తొక్కుకుంటూ బడికి వెళ్లడానికి అక్కడి పిల్లలు భలే ఆసక్తి చూపిస్తున్నారు. దీనివల్ల తమకు ఎంతో ఉత్సాహంగా ఉందని చెబుతున్నారు. ట్రాఫిక్‌ నియమాల మీద కూడా స్పష్టమైన అవగాహన ఏర్పరచుకుంటున్నారు. సమయపాలన, క్రమశిక్షణ, సహచరులతో స్నేహభావం అలవరుచుకుంటున్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు వారంలో ఒకరోజు బైక్‌ బస్‌ మీద బడికి వెళ్లడాన్ని ఇష్టపడుతున్నారు. దీని వల్ల విద్యార్థులకు శారీరక శ్రమ దొరుకుతోంది. పర్యావరణానికీ ఎంతో కొంత మేలు జరుగుతోంది.

ప్రత్యేక పరికరం సాయంతో...

మొట్టమొదట 2021లో స్పానిష్‌ నగరమైన విక్‌లో ఈ బైక్‌ బస్‌ విధానం ప్రాచుర్యం పొందింది. తర్వాత ఆస్ట్రియాలోని గ్రాజ్‌లో, జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో, అమెరికాలోని పోర్ట్‌ల్యాండ్‌లో... ఇలా ఇంకా పలు దేశాల్లో బైక్‌ బస్‌ పద్ధతిని అవలంబిస్తున్నారు. కానీ స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో మరో ప్రత్యేకత కూడా ఉంది. ఇక్కడ సైకిళ్ల మీద వచ్చే పిల్లలు ప్రత్యేక పరికరాన్ని ఉపయోగిస్తున్నారు. కూడళ్లలోని ట్రాఫిక్‌ లైట్లను ఈ గ్యాడ్జెట్‌ నియంత్రిస్తోంది. ఈ పరికరంలోని బటన్‌ నొక్కితే పదిసెకన్ల బదులుగా 45 సెకన్ల వరకు ట్రాఫిక్‌ ఆగిపోతోంది. అప్పుడు విద్యార్థులు తేలికగా తమ సైకిళ్లతో కూడలిని దాటగలుగుతున్నారు. ఇలా పిల్లలు సరదాగా స్కూలుకెళుతూనే, ఆరోగ్య, పర్యావరణ పరిరక్షణకు సందేశమూ ఇస్తున్నారు. నేస్తాలూ... మొత్తానికి ఇవీ ‘బైక్‌ బస్‌’ విశేషాలు. భలే ఉన్నాయి కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని