పిట్ట కొంచెం.. గురిలో ఘనం!

చిట్టి చేతుల చిరుత... బుడి బుడి అడుగుల బుడత.. గురిలో సాధించెను ఘనత.. చిరుప్రాయం నుంచే తపన.. అలుపెరగని కఠోర సాధన.. కురిపించింది రికార్డుల వాన.. పసి వయసులోనే అలవోకగా ఇవన్నీ సాధించిన ఆ చిన్నారి గురించి తెలుసుకుందామా!

Updated : 28 Jun 2023 06:44 IST

చిట్టి చేతుల చిరుత... బుడి బుడి అడుగుల బుడత.. గురిలో సాధించెను ఘనత.. చిరుప్రాయం నుంచే తపన.. అలుపెరగని కఠోర సాధన.. కురిపించింది రికార్డుల వాన..
పసి వయసులోనే అలవోకగా ఇవన్నీ సాధించిన ఆ చిన్నారి గురించి తెలుసుకుందామా!

తమిళనాడులోని చెన్నైకు చెందిన సంజనకు ప్రస్తుతం ఏడు సంవత్సరాలు. నాన్న నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తారు. అమ్మ గృహిణి. వీళ్లది సాధారణ మధ్యతరగతి కుటుంబం. వీళ్లకు క్రీడానేపథ్యం ఏమీ లేదు. కానీ సంజన మాత్రం విలువిద్యలో ఆరితేరింది. తనకు అయిదేళ్ల వయసున్నప్పుడే ‘గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’లో స్థానం సంపాదించింది. కేవలం 3.50 గంటల్లోనే 1,111 బాణాలను సంధించింది. ఎనిమిది మీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని పదే పదే చేధించి ప్రపంచరికార్డును బద్దలు కొట్టింది.

రెండేళ్ల ప్రాయంలో..   

అది సంజన రెండో పుట్టినరోజు. ఆ వేడుకల్లో చిన్నారికి ఓ చిన్న విల్లు, విల్లంబులు బహుమతిగా వచ్చాయి. ఇంకా ఎన్నో బొమ్మలు కానుకగా వచ్చినా.. చిన్నారి సంజనకు ఆ విల్లు మాత్రమే నచ్చింది. ఎప్పుడూ దాంతోనే ఆడుకునేది. ఇతర ఆటవస్తువుల వైపు కన్నెత్తి కూడా చూసేది కాదు. తమ కూతురిలో ఉత్సాహాన్ని గమనించి
అమ్మానాన్న విలువిద్యలో శిక్షణ ఇప్పించారు. గురువు సైతం సంజన తపన చూసి ఆశ్చర్యపోయారు. ఏదో ఒకనాడు కచ్చితంగా ఒలింపిక్స్‌లో పాల్గొనే స్థాయికి వెళుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

నిరంతర కసరత్తు...

సంజన బడి నుంచి రాగానే రోజూ దాదాపు నాలుగు గంటలు సాధన చేస్తోంది. గురువు అంచనాలకు తగ్గట్లే విలువిద్యలో రాణిస్తోంది. అమ్మ ఒడిలో గారాలు పోతూ... గిన్నెలో పాలబువ్వ తినాల్సిన వయసులోనే ఏకంగా గిన్నిస్‌ బుక్‌లో స్థానం సంపాదించింది. ఒక్కసారిగా ప్రపంచం దృష్టిని తన వైపు తిప్పుకుంది.

మేకులపై నిల్చొని...

కొంతకాలం క్రితం సంజన మరో సాహస కృత్యమూ చేసింది. మేకుల మీద నిల్చొని విలువిద్యను ప్రదర్శించింది. అదీ మామూలుగా కాదు. తన ముందు తొట్టిలో పెట్టిన నీటిలో చూస్తూ... తల మీదుగా ఏర్పాటు చేసిన తిరుగుతున్న లక్ష్యాన్ని గురి చూసి కొట్టింది. అంటే లక్ష్యాన్ని నేరుగా చూడకుండా కేవలం నీటిలో ప్రతిబింబాన్ని చూస్తూ విల్లంబులు వదిలింది. ఇలా 13 నిమిషాల 15 సెకన్లలో 75 బాణాలను సంధించింది. ఇది కూడా ఓ ప్రపంచరికార్డే.

తాళ్ల సాయంతో తలకిందులుగా వేలాడుతూ 13 నిముషాల్లో 111 బాణాలతో లక్ష్యాన్ని సాధించింది. ఒళ్లు గగుర్పొడిచే ఈ విన్యాసంతో అందరూ అవాక్కయ్యేలా చేసింది. భవిష్యత్తులో మరింతగా రాణించి ఒలింపిక్స్‌లో పాల్గొనడమే తన లక్ష్యమని ఈ చిన్నారి చెబుతోంది. మరి మనం కూడా సంజనకు మనసారా ఆల్‌ ది బెస్ట్‌ చెబుదామా!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని