సాధన చేసింది.. రికార్డు సాధించింది!

హాయ్‌ నేస్తాలు..! స్కూల్‌కి టైమ్‌ అవుతుందని ఉదయాన్నే అమ్మానాన్నలు మనల్ని నిద్రలేపితే, ఇష్టం లేకపోయినా తప్పదు కాబట్టి బద్ధకంగా లేస్తుంటాం.

Published : 08 Jul 2023 00:20 IST

హాయ్‌ నేస్తాలు..! స్కూల్‌కి టైమ్‌ అవుతుందని ఉదయాన్నే అమ్మానాన్నలు మనల్ని నిద్రలేపితే, ఇష్టం లేకపోయినా తప్పదు కాబట్టి బద్ధకంగా లేస్తుంటాం. అలాంటిది వాకింగ్‌, యోగా, ఇతర వ్యాయామాలు అంటే.. ఇంకేమైనా ఉందా.. మన వల్ల కాదని ముసుగుతన్ని ఎంచక్కా నిద్రపోతాం. అలాంటిది ఓ నేస్తం అయితే.. అబ్బురపరిచే ఆసనాలు వేస్తూ, రికార్డుల మీద రికార్డులు సాధిస్తోంది. ఆ వివరాలే ఇవీ..  

కేరళలోని కొల్లాం జిల్లాకు చెందిన ఆద్రికి ఆరు సంవత్సరాలు. ఇటీవల ఒక నిమిషంలో 108 ‘ఫుల్‌ స్ల్పిట్‌ పుష్‌ అప్స్‌’ చేసి, అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అంతేకాదు.. ‘వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లోనూ స్థానం సంపాదించింది.

యూకేజీ నుంచే ఆసక్తి..

ప్రస్తుతం ఆద్రి ఒకటో తరగతి చదువుతోంది. చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులతోపాటు వ్యాయామం చేసేది. క్రమంగా దాన్నే అలవాటుగా మార్చుకుంది. యూకేజీలో చేరాక.. టీవీలో చూసి తనకూ కరాటే నేర్చుకోవాలని అనిపించి.. నాన్నను అడిగింది. ఆయనా సరేననడంతో.. ఇంటికి దగ్గర్లోని శిక్షణ కేంద్రంలో చేర్పించారు. అక్కడే చిన్న చిన్న కసరత్తులూ నేర్చుకోవడం ప్రారంభించింది. బడికి ఇబ్బంది లేకుండా ఉండేందుకు.. ఉదయాన్నే నిద్ర లేచేది. చకచకా తయారై.. శిక్షణకు వెళ్లివచ్చేది. ఆ తర్వాత స్నేహితులతోపాటు తరగతులకు హాజరయ్యేది. అలా ‘ఫుల్‌ స్ల్పిట్‌ పుష్‌ అప్స్‌’ కూడా ప్రాక్టీస్‌ చేసింది. చిన్నారిలోని ఆసక్తిని, ప్రతిభను గమనించిన కోచ్‌.. ఆద్రితో ఏదైనా రికార్డు సాధించేలా తీర్చిదిద్దాలని మరిన్ని మెలకువలు నేర్పించారు. అలా గత నెలలో ఒక నిమిషంలో 108 ‘ఫుల్‌ స్ల్పిట్‌ పుష్‌ అప్స్‌’ చేసి అందరినీ అబ్బురపరిచింది. అతి చిన్న వయసులోనే ఈ ఘనత సాధించిన బాలికగానూ రికార్డు సృష్టించింది. అంతేకాదు.. తనకి పాటలు పాడటం అన్నా, మార్షల్‌ ఆర్ట్స్‌ అన్నా చాలా ఇష్టమట. ఖాళీ సమయాల్లో అవి కూడా నేర్చుకుంటోందీ నేస్తం. ఆద్రిని చూస్తుంటే.. వయసు చిన్నదే అయినా, ప్రతిభ మాత్రం ఘనం అనిపిస్తోంది కదూ..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని