పేర్లు చెప్పాడు.. రికార్డు సృష్టించాడు!

హాయ్‌ నేస్తాలూ..! మనం స్కూల్లో పరీక్షలు రాయడానికి చాలాసేపు చదువుతూనే ఉంటాం.. అయినా రాసేటప్పుడు అన్ని జవాబులూ గుర్తుకు రావు.. అమ్మ ఏదైనా తెమ్మని దుకాణానికి పంపితే ఏం తీసుకురమ్మందో కూడా మధ్యలోనే మర్చిపోతాం.. కానీ ఓ బుడతడు మాత్రం ఎక్కువ దేశాల జెండాలను గుర్తుపెట్టుకొని రికార్డు సృష్టించాడు.

Updated : 11 Jul 2023 05:38 IST

హాయ్‌ నేస్తాలూ..! మనం స్కూల్లో పరీక్షలు రాయడానికి చాలాసేపు చదువుతూనే ఉంటాం.. అయినా రాసేటప్పుడు అన్ని జవాబులూ గుర్తుకు రావు.. అమ్మ ఏదైనా తెమ్మని దుకాణానికి పంపితే ఏం తీసుకురమ్మందో కూడా మధ్యలోనే మర్చిపోతాం.. కానీ ఓ బుడతడు మాత్రం ఎక్కువ దేశాల జెండాలను గుర్తుపెట్టుకొని రికార్డు సృష్టించాడు.మరి తనెవరో.. ఆ వివరాలేంటో తెలుసుకోవాలనుందా..? అయితే వెంటనే ఈ కథనం చదివేయండి..

తమిళనాడులోని విల్లుపురం జిల్లాకు చెందిన దర్శన్‌ 197 దేశాలకు సంబంధించిన జాతీయ జెండాలను 4.40 నిమిషాల్లోనే గుర్తించాడు. దీంతో ‘వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో స్థానం సంపాదించుకున్నాడు. అలాగే తను ‘కలామ్స్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’లోనూ చోటు దక్కించుకున్నాడు. ఇంతకీ ఈ బుడతడి వయసు ఎంతో తెలుసా.. మూడేళ్లు మాత్రమే. ఇంత చిన్న వయసులోనే రికార్డులు సృష్టించి అందరి మన్ననలు పొందుతున్నాడు. ప్రస్తుతం తను ఎల్‌కేజీ చదువుతున్నాడు.

ఆడుతూ.. పాడుతూ..

‘దర్శన్‌ ఆడుతూపాడుతూనే అవన్నీ నేర్చుకున్నాడు. మొదట్లో తను స్కూల్‌ నుంచి వచ్చాక జాతీయ జెండాల ఫొటోలను చూపించి వాటి పేర్లు చెప్తుంటే శ్రద్ధగా వినేవాడు. ఆ తరువాత అదే తనకు ఆటగా మారిపోయింది. కొన్ని రోజుల తరువాత నుంచి ఫోన్‌లో జెండాల ఫొటోలను పెట్టుకొని తనే వాటి పేర్లను చెప్పేవాడు’ అని వాళ్లమ్మ శశిరేఖ అంటున్నారు. ఈ రికార్డు ఇంతకు ముందు మయాన్‌ అనే చిన్నారి పేరున ఉండేది. ఇవీ ఈ బుడతడి విశేషాలు. దర్శన్‌ మరెన్నో రికార్డులు సాధించాలని తనకు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పేద్దామా..!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని