‘లక్ష’ణమైన ప్రసిద్ధి!

హలో ఫ్రెండ్స్‌.. ‘అబ్బా.. ఈ ఎండాకాలంలో వర్షాలేంటి?’, ‘వామ్మో.. ఇంత ఉక్కపోతా.. అసలు వర్షాకాలంలోఈ ఎండలేంటి?’ - అని ఈ మధ్యకాలంలో అనుకొనే ఉంటారు.. కనీసం పెద్దవాళ్లు అన్నప్పుడైనా వినే ఉంటారు.

Updated : 27 Aug 2023 18:34 IST

హలో ఫ్రెండ్స్‌.. ‘అబ్బా.. ఈ ఎండాకాలంలో వర్షాలేంటి?’, ‘వామ్మో.. ఇంత ఉక్కపోతా.. అసలు వర్షాకాలంలో ఈ ఎండలేంటి?’ - అని ఈ మధ్యకాలంలో అనుకొనే ఉంటారు.. కనీసం పెద్దవాళ్లు అన్నప్పుడైనా వినే ఉంటారు. దీనంతటికీ పచ్చదనం తగ్గిపోవడంతోపాటు ప్లాస్టిక్‌ వాడకం ప్రధాన కారణాలని పుస్తకాల్లో చదువుకునే ఉంటారు. ఓ నేస్తం మాత్రం అందరిలా చదివి వదిలేయకుండా, ఈ సమస్య పరిష్కారానికి తనవంతు కృషి చేయాలని అనుకుంది. ఆ దిశగా అడుగులు వేస్తూ.. అనేక ప్రశంసలతోపాటు అవార్డులూ గెలుచుకుంది. ఆ వివరాలే ఇవీ..

తమిళనాడు రాష్ట్రంలోని చెంగల్పట్టుకు చెందిన ప్రసిద్ధికి ప్రస్తుతం పది సంవత్సరాలు. ఈ వయసులోనే ఇప్పటివరకూ దాదాపు లక్ష మొక్కలు నాటింది. మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించాల్సిన ఆవశ్యకతపైన దేశవిదేశాల్లో అవగాహన కల్పిస్తోంది. ఆ రాష్ట్ర ‘చైల్డ్‌గ్రీన్‌ అంబాసిడర్‌’గానూ గుర్తింపు సాధించింది.

ఎలా మొదలైందంటే..

అది 2016.. వార్దా తుపాను తీరం దాటింది. దాంతో భారీ గాలులతో కూడిన వర్షాలకు తమిళనాడు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వేలాదిగా చెట్లు నేలకూలాయి. అప్పుడు ప్రసిద్ధికి నాలుగు సంవత్సరాలు. భారీ వృక్షాలూ వేళ్లతోసహా కూలిపోవడం తనను కలచివేసిందట. ఎన్నో ఏళ్లు కష్టపడితేనే కానీ మళ్లీ అంతటి వృక్షాలు పెరగవని తల్లిదండ్రులు అనుకుంటున్న మాటలూ తనను కదిలించాయి. ఎలాగైనా సాధ్యమైనన్ని మొక్కలు నాటి, పచ్చదనాన్ని పెంపొందించాలని ఆ క్షణమే నిర్ణయించుకుందా నేస్తం. తన ఆలోచనను ఇంట్లో పెద్దవాళ్లకు చెప్పడంతో వారూ సంతోషంగా సరేనన్నారు. అమ్మానాన్నల ప్రోత్సాహంతో చదువుకుంటూనే రెండేళ్లపాటు మొక్కల పెంపకం, అనువైన వాతావరణం, భూసార పరిస్థితులు తదితర అంశాలపైన అవగాహన పెంచుకుంది. ఈ కార్యక్రమంలో తనతోపాటు ఇంకా చాలామందిని భాగస్వాములను చేయాలని, అందుకో వేదిక అవసరమనీ భావించింది. అలా ఆరో తరగతి చదువుతున్నప్పుడే ‘ప్రసిద్ధి ఫార్మ్స్‌ ఫౌండేషన్‌’ను స్థాపించింది. ఈ వేదిక సాయంతో తాను మొక్కలు నాటుతూ జీవ వైవిధ్యాన్ని పెంపొందించడం, ఇతరులూ నాటేలా అవగాహన కల్పించడమే ధ్యేయంగా పెట్టుకుందా బాలిక.  

అందరి సహకారంతో..

తెలిసీతెలియని వయసులోనే వచ్చిన ఆలోచన కదా.. అని తన పనిని ప్రసిద్ధి ఏమాత్రం నిర్లక్ష్యం చేయలేదు. స్పష్టమైన లక్ష్యంతో సాగుతూ.. గతేడాది డిసెంబరు 15 నాటికి లక్ష మొక్కలు నాటిన ఘనతను దక్కించుకుంది. రాష్ట్ర ప్రభుత్వంతోపాటు ఇతర సంస్థల నుంచీ సత్కారాలు అందుకుంది. ఇప్పటివరకూ ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ ద్వారా 20కి పైగా దేశాల్లో పచ్చదనంపైన అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, సామాజికవేత్తల సహకారంతో రాష్ట్రంలోని చెన్నై, చెంగల్పట్టు, కాంచీపురం, విళుపురం, కన్యాకుమారి తదితర ప్రాంతాలతోపాటు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోనూ పర్యావరణ ర్యాలీలు నిర్వహించింది. ఇటీవల తమిళనాడు రాష్ట్ర ‘చైల్డ్‌గ్రీన్‌ అంబాసిడర్‌’గానూ ఎంపికై ప్రత్యేకతను చాటుకుంది.

ప్లాస్టిక్‌ అంతానికి..  

2050 నాటికి సముద్రాల్లో జీవజాతుల కంటే ప్లాస్టిక్‌ వస్తువులే అధికంగా ఉంటాయని ఇటీవల ఓ నివేదికలో వెల్లడైంది. పత్రికలు, టీవీల ద్వారా ఈ విషయం తెలుసుకున్న ప్రసిద్ధి.. తదుపరి తన దృష్టి ప్లాస్టిక్‌ వాడకం తగ్గించడం, రీసైక్లింగ్‌పైన పెట్టాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగానే రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ‘జీ3’ (జెనరేట్‌ యువర్‌ ఓన్‌ ఆక్సిజన్‌, గ్రో యువర్‌ ఓన్‌ ఫుడ్‌, గిఫ్ట్‌ ద కమ్యూనిటీ) అనే ప్రాజెక్ట్‌ని ప్రారంభించింది. ఈ కార్యక్రమాల్లో పాల్గొనే వారికి విత్తనాలతోపాటు మొక్కలు నాటేందుకు కుండీలు, పక్షులకు ఆహారం పెట్టే చిన్న మట్టి పాత్రలూ అందిస్తోంది. దీనికి కొందరు దాతలు సహకరిస్తున్నారట. తరచుగా పాఠశాలలకు వెళ్తూ, తన ప్రాజెక్టు గురించి వివరిస్తోందీ బాలిక. ప్రసిద్ధి సేవలకు గుర్తింపుగా అమెరికా నుంచి ‘ఎర్త్‌డే నెట్‌వర్కింగ్‌ రైజింగ్‌ స్టార్‌’, ‘యంగ్‌ ఛేంజ్‌ మేకర్‌’ అవార్డులను దక్కించుకుంది. ఇంగ్లాండ్‌ ఉన్నత పురస్కారాల్లో ఒకటైన ‘ద డయానా అవార్డు’తోపాటు ఇతర పురస్కారాలనూ అందుకుంది. పిల్లలూ.. ఈ నేస్తం స్ఫూర్తితో మనమూ మొక్కలు నాటి, వీలైనంతగా ప్లాస్టిక్‌కి దూరంగా ఉందాం.. సరేనా!! 

పి.లక్ష్మీ హరికృష్ణ,న్యూస్‌టుడే,ఆర్కేనగర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని