బుడి బుడి అడుగులతో బుడతా భక్తిగా...!

తప్పటడుగులు వేసే చిరుప్రాయం నుంచే ఆ చిన్నారి... మానవులు ప్రకృతి విషయంలో వేస్తున్న ‘తప్పు’టడుగుల మీద స్పందించింది. స్వచ్ఛందంగా ముందుకు వచ్చింది.

Updated : 21 Jul 2023 04:48 IST

తప్పటడుగులు వేసే చిరుప్రాయం నుంచే ఆ చిన్నారి... మానవులు ప్రకృతి విషయంలో వేస్తున్న ‘తప్పు’టడుగుల మీద స్పందించింది. స్వచ్ఛందంగా ముందుకు వచ్చింది. ఏకంగా ఐక్యరాజ్యసమితి చేపట్టిన కార్యక్రమంలో పాలు పంచుకుంటోంది. ఆ బుడత సేవలకు తగిన గుర్తింపు లభించింది. ఇంతకీ ఆ చిన్నారి ఎవరు? ఆమెకు దక్కిన గుర్తింపు ఏంటో తెలుసుకుందామా!

మోక్షారాయ్‌కు ప్రస్తుతం ఏడు సంవత్సరాలు. ఈ చిన్నారి భారత సంతతికి చెందిన బ్రిటన్‌ బాలిక. రాగిణి రాయ్‌, సౌరవ్‌ రాయ్‌ దంపతుల కుమార్తె. తనకు మూడేళ్ల వయసున్నప్పటి నుంచే పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తోంది. ఐక్యరాజ్యసమితి నిర్వహిస్తున్న కార్యక్రమంలో ఉడతా భక్తిగా, స్వచ్ఛందంగా తన వంతు పాత్ర పోషిస్తోంది. తమ కూతురిలో ఇంత చిన్న వయసు నుంచే పర్యావరణ స్పృహ ఉండటంపై చిన్నారి అమ్మానాన్న ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పిల్లల నుంచే ఈ మార్పు రావడం మన సమాజానికి, పర్యావరణానికి ఎంతో మంచిదని వారంటున్నారు.

ప్లాస్టిక్‌పై పోరు...

నేడు ప్లాస్టిక్‌ మన నిత్యజీవితంలో భాగమై పోయింది. మైక్రోప్లాస్టిక్‌ రూపంలో మన శరీరంలోనూ తిష్ఠ వేసి మనల్ని కబళిస్తోంది. ఈ మైక్రోప్లాస్టిక్‌ కాలుష్యానికి వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో మోక్షారాయ్‌ పాలు పంచుకుంటోంది. తనకు అయిదేళ్ల వయసున్నప్పుడే ఈ చిన్నారి ఏకంగా 193 దేశాల నేతలకు లేఖలు రాసింది. వాతావరణ మార్పులు, ప్లాస్టిక్‌ కాలుష్యం గురించి పాఠ్యాంశాల్లో ప్రవేశపెట్టాలని, పిల్లలకు వీటి మీద స్పష్టమైన అవగాహన కల్పించాలని కోరింది. అలాగే కాలుష్య నివారణ, లింగ అసమానతల నిర్మూలనకు తగిన చర్యలు తీసుకోవాలంది. లేఖలు అందుకున్న వారంతా చిన్నారి అభ్యర్థనపై సానుకూలంగా స్పందించారు. పర్యావరణంపై మోక్షారాయ్‌కున్న అవగాహనకు ముగ్ధులయ్యారు. తన చిట్టి చేతులతోనే చేస్తున్న గట్టి చర్యలను ప్రశంసించారు. చిన్నారి సూచనలు తప్పకుండా పాటిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఈ బుడత... పేద చిన్నారుల సహాయార్థం చేపట్టిన పలు నిధుల సేకరణ కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంది. పేదరిక నిర్మూలనకు కూడా ప్రపంచమంతా కృషి చేయాలని కోరింది. ఇంత చిన్న వయసులోనే మోక్షారాయ్‌లో ఉన్న సామాజిక స్పృహను బ్రిటన్‌ ప్రభుత్వం గుర్తించింది. ప్రతిష్ఠాత్మక ‘బ్రిటన్‌ ప్రైమ్‌ మినిస్టర్‌ పాయింట్స్‌ ఆఫ్‌ లైట్‌’ అవార్డును ప్రకటించింది. ఇటీవలే బ్రిటన్‌ ఉప ప్రధాని ఆలివర్‌ డౌడెన్‌ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకుంది.   

అంతా ఏకమై...

పుస్తకాలతో కుస్తీ పట్టాల్సిన ఈ వయసులోనే నీకు పర్యావరణం మీద ఎందుకంత ప్రేమ అని ఎవరైనా అడిగితే....‘మనం రోజూ మన పళ్లను శుభ్రం చేసుకుంటాం. ఇలా చేయకపోతే మనం తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటాం. వ్యాధుల బారిన కూడా పడతాం. మన దంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ఎంత అవసరమో, పర్యావరణాన్ని కాలుష్యం బారి నుంచి కాపాడటం కూడా అంతే అవసరం. మనమంతా ఏకమై వాతావరణ మార్పులు, కాలుష్యం, పేదరికం, లింగ వివక్షతల మీద పోరాడాలి. అప్పుడే మార్పు సాధ్యమవుతుంది’ అని చెబుతోంది మోక్షారాయ్‌. యావత్‌ ప్రపంచాన్ని దీని గురించి ఆలోచించేలా తన వంతు ప్రయత్నం చేస్తోంది. నేస్తాలూ.... చిరుప్రాయంలోనే ఇంతటి పర్యావరణ స్పృహ కలిగి ఉన్న మన మోక్షారాయ్‌ నిజంగా గ్రేట్‌ కదూ! మరి మనం కూడా మనవంతుగా పర్యావరణ పరిరక్షణకు, ప్లాస్టిక్‌ నివారణకు కృషి చేద్దామా!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని