డబ్బు దాచుకో.. అవసరానికి తీసుకో..!

హలో ఫ్రెండ్స్‌.. అనవసర ఖర్చులు చేయకుండా, డబ్బులను పొదుపుగా దాచుకోవాలని ఇంట్లో పెద్దవాళ్లతోపాటు టీచర్లూ చెబుతుంటారు కదా! కానీ, మనలో చాలామంది పాకెట్‌ మనీ మొత్తాన్నీ ఖర్చు చేసేస్తుంటారు.

Published : 25 Jul 2023 00:08 IST

హలో ఫ్రెండ్స్‌.. అనవసర ఖర్చులు చేయకుండా, డబ్బులను పొదుపుగా దాచుకోవాలని ఇంట్లో పెద్దవాళ్లతోపాటు టీచర్లూ చెబుతుంటారు కదా! కానీ, మనలో చాలామంది పాకెట్‌ మనీ మొత్తాన్నీ ఖర్చు చేసేస్తుంటారు. అలాకాకుండా, ‘నేటి పొదుపే రేపటికి మదుపు’ అంటూ తమ విద్యార్థులు డబ్బులను దాచుకునేలా ప్రోత్సహిస్తున్నారో పాఠశాల ఉపాధ్యాయులు. మరి ఆ బడి ఎక్కడుందో, ఆ వివరాలేంటో తెలుసుకుందామా..!!

గుజరాత్‌ రాష్ట్రం ఖేడా జిల్లాలోని కాజీపురా ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు పాఠాలతోపాటు డబ్బులను పొదుపు చేయడం కూడా నేర్పిస్తున్నారు అక్కడి ఉపాధ్యాయులు. అలాగని, విద్యార్థులంతా తరగతులు ఎగ్గొట్టి మరీ బ్యాంకులకు వెళ్తున్నారనుకుంటే పొరబడినట్లే. ఉపాధ్యాయులే విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి, ఆ స్కూల్‌లోనే ఓ ఖాళీ గదిని బ్యాంకుగా మార్చేశారు.

విద్యార్థులే అంతా..  

బడిలో ఏర్పాటు చేసిన బ్యాంకుకు ‘బ్యాంక్‌ ఆఫ్‌ కాజీపురా’ అని పేరు కూడా పెట్టారు. ఇందులో మేనేజర్‌, క్యాషియర్‌గా ఆ స్కూల్‌ విద్యార్థులే వ్యవహరిస్తున్నారు. ఇంట్లో ఇచ్చిన పాకెట్‌ మనీలో కొంత మొత్తాన్ని ఈ బ్యాంకులో దాచుకుంటున్నారు. అంతకుముందు వరకూ పాకెట్‌ మనీతో బడి బయట ఉన్న దుకాణాల్లో చిరుతిళ్లు కొనుక్కొనే విద్యార్థులు.. బ్యాంకు ఏర్పాటు చేసిన తర్వాత జంక్‌ ఫుడ్‌ తినడం బాగా తగ్గించేశారట. పిల్లలు ఒకరికొకరు పోటీ పడి మరీ డబ్బులు దాచుకుంటున్నారని ఉపాధ్యాయులు చెబుతున్నారు.

చిన్న చిన్న అవసరాలకు..

ఈ బ్యాంకులో దాచుకున్న డబ్బులను ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్‌డ్రా చేసుకోవచ్చు. కాకపోతే, ఎందుకోసమో తెలుపుతూ ఒక చలాన్‌ నింపి ఇవ్వాల్సి ఉంటుంది. చిన్న చిన్న అవసరాలకూ అమ్మానాన్నలపైన ఆధారపడకుండా, పొదుపు చేసిన డబ్బులతో పిల్లలే సొంతంగా సమకూర్చుకోవచ్చు. ఒకటి నుంచి ఎనిమిదో తరగతి చదివే విద్యార్థులకు మాత్రమే ఈ బ్యాంకు సేవలు అందుబాటులో ఉంటాయి. ఈ ఆలోచనతో పిల్లల్లో పొదుపుతోపాటు బ్యాంకు సేవలపైన అవగాహన పెంపొందుతోందని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చెబుతున్నారు. నేస్తాలూ.. మన స్కూల్లో కూడా ఇటువంటి ఏర్పాటు ఉంటే బాగుంటుందని అనిపిస్తోంది కదూ..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని