ప్రతిభ చూపాడు.. రికార్డులు పట్టాడు..

హాయ్‌ నేస్తాలూ.. మనం క్లాసులో ఫస్టు వస్తేనే, కనిపించినవారికల్లా గొప్పగా చెప్పుకొంటాం. మరి ఏకంగా ఏదైనా రికార్డు సాధిస్తే?.. ఇంకేమైనా ఉందా.. ప్రపంచం మొత్తం వినిపించేలా గట్టిగా అరిచి చెప్పాలనుకుంటాం.

Published : 29 Jul 2023 00:07 IST

హాయ్‌ నేస్తాలూ.. మనం క్లాసులో ఫస్టు వస్తేనే, కనిపించినవారికల్లా గొప్పగా చెప్పుకొంటాం. మరి ఏకంగా ఏదైనా రికార్డు సాధిస్తే?.. ఇంకేమైనా ఉందా.. ప్రపంచం మొత్తం వినిపించేలా గట్టిగా అరిచి చెప్పాలనుకుంటాం. అయితే, ఓ నేస్తం ఒకటీ రెండూ కాదు ఏకంగా నాలుగు రికార్డులు సాధించి ఔరా అనిపిస్తున్నాడు. ఇంతకీ అతడెవరో, ఆ రికార్డులేంటో తెలుసుకుందామా..!

హారాష్ట్రలోని ముంబయికి చెందిన పూర్వాంశ్‌ అరోరాకు ప్రస్తుతం ఏడు సంవత్సరాలు. ఆడుతూపాడుతూ బడికెళ్లాల్సిన ఇంత చిన్న వయసులోనే తన ప్రతిభతో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. ఏకంగా నాలుగు ‘ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’ సాధించి.. ‘పిట్ట కొంచెం, కూత ఘనం’ అని నిరూపిస్తున్నాడు.


క్యూబ్‌తో ఫటాఫట్‌..

మనకు రూబిక్‌ క్యూబ్‌ సాల్వ్‌ చేయడమంటే భలే సరదా కదూ.. పోటీలు పడి మరీ చకచకా సాధించాలని చూస్తాం. అయితే, పూర్వాంశ్‌ అరోరా మాత్రం కళ్లకు గంతలు కట్టుకొని.. కేవలం 2 నిమిషాల 22 సెకన్లలోనే 3్ల3 రూబిక్‌ క్యూబ్‌ను సాల్వ్‌ చేసేశాడు. అతి తక్కువ సమయంలోనే సాధించి గుర్తింపు పొందాడీ నేస్తం. అంతేకాదు.. ‘ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లోనూ స్థానం దక్కించుకున్నాడు.


లెక్కలకే సవాల్‌..

అన్ని సబ్జెక్టుల కంటే మనం మ్యాథ్స్‌ అంటేనే భయపడిపోతాం. ఆ చిక్కుల లెక్కల క్లాస్‌ ఎప్పుడు అయిపోతుందా.. అని ఎదురుచూస్తుంటాం. ఇక ఆ ఫార్ములాలు గుర్తుంచుకునేందుకు పెద్ద యుద్ధమే చేస్తాం. కానీ పూర్వాంశ్‌ మాత్రం 40 మ్యాథ్స్‌ ఫార్ములాలను కేవలం రెండు నిమిషాల్లోనే గడగడా చెప్పేశాడు. ఎంతో ప్రాక్టీస్‌ చేస్తేనే ఇది సాధ్యమైందనీ చెబుతున్నాడు. ఈ ఘనతకు మరో రికార్డు అందుకున్నాడు.


ఫ్రెంచ్‌ అక్షరాలతో ఆట

ఏడేళ్ల వయసులో కాస్త పెద్ద పదాలు పలకాలంటేనే తడబడుతుంటాం. కానీ, పూర్వాంశ్‌ మాత్రం అయిదేళ్లకే ఫ్రెంచ్‌ భాష నేర్చుకోవడం ప్రారంభించాడు. ఆ భాషకు సంబంధించిన అక్షరాలను, పదాలను అతితక్కువ సమయంలో చెప్పి రికార్డుల్లోకి ఎక్కేశాడు. హిందీ, ఇంగ్లిష్‌తోపాటు ఏదైనా విదేశీ భాష నేర్చుకుంటే భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉంటాయని తల్లిదండ్రులు అనడంతో ట్యూషన్‌లో చేరాడట. ఇష్టంతో ప్రాక్టీస్‌ చేసి.. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు.


అమెరికా అధ్యక్షుల పేర్లతో..

బడిలో ఇచ్చిన హోంవర్క్‌ చేయడానికి బద్ధకిస్తుంటాం. కానీ, ఈ నేస్తం మాత్రం అమెరికాకు ఇప్పటివరకూ అధ్యక్షులుగా సేవలందించిన వారి పేర్లను కేవలం 46 సెకన్లలో గుక్కతిప్పుకోకుండా చెప్పేశాడు. దీనికీ తన పేరిట ఓ రికార్డు సాధించాడు. మరో విషయం ఏంటంటే.. ఈ నాలుగు రికార్డులనూ కొద్దిరోజుల వ్యవధిలోనే దక్కించుకున్నాడు. ముందు ముందు మరిన్ని రికార్డులు సాధించాలని పూర్వాంశ్‌కు మనమూ ఆల్‌ ది బెస్ట్‌ చెప్పేద్దామా..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని