పన్నెండేళ్ల పతకాల వీరుడు!

హాయ్‌ నేస్తాలూ..! మనం ఉదయాన్నే లేచి రెడీ అయ్యి స్కూల్‌కు వెళ్లాలంటేనే బద్ధకిస్తాం. ఇంకో అరగంటలో స్కూల్‌ బస్సు వస్తుంది అన్నప్పుడు లేచి గబగబా తయారయ్యి వెళ్లిపోతాం..

Updated : 04 Aug 2023 05:26 IST

హాయ్‌ నేస్తాలూ..! మనం ఉదయాన్నే లేచి రెడీ అయ్యి స్కూల్‌కు వెళ్లాలంటేనే బద్ధకిస్తాం. ఇంకో అరగంటలో స్కూల్‌ బస్సు వస్తుంది అన్నప్పుడు లేచి గబగబా తయారయ్యి వెళ్లిపోతాం.. అలాంటిది మనల్ని యోగా చేయమంటే ఇక అంతే సంగతులు.. దాని దరిదాపుల్లోకి కూడా వెళ్లం. కానీ ఓ నేస్తం మాత్రం ఏకంగా యోగా తరగతులే చెప్తున్నాడు. ఇది ఒక్కటే కాకుండా ఇతర రంగాల్లోనూ తన ప్రతిభతో ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. మరి తనెవరో.. ఆ వివరాలేంటో తెలుసుకుందామా..!

బిహార్‌ రాష్ట్రానికి చెందిన రుద్ర ప్రతాప్‌ సింగ్‌ ఒకవైపు యోగా, మరోవైపు విలువిద్య ఇంకా స్కేటింగ్‌లోనూ తన ప్రతిభను చాటుతూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. ప్రస్తుతం అతని వయసు పన్నెండేళ్లు. కానీ తను ఏకంగా యోగా తరగతులు కూడా నిర్వహిస్తున్నాడు. తాను చేసే యోగా వీడియోలను వాళ్ల నాన్న సాయంతో సామాజిక మాధ్యమాల్లో నిత్యం పోస్టు చేస్తూనే ఉంటాడు. అలా అతని ప్రతిభతో ఇన్‌స్టాగ్రాంలో దాదాపు 82వేల మంది ఫాలోవర్లను సంపాదించుకున్నాడు. ఇంతే కాదు నేస్తాలూ..! యోగా విభాగంలో నిర్వహించిన కొన్ని పోటీల్లో ఛాంపియన్‌గా నిలిచి బంగారు, వెండి పతకాలతో పాటు పలు ప్రశంసాపత్రాలు అందుకున్నాడు. అలాగే నేషనల్‌ యోగా ఛాంపియన్‌షిప్‌లో కూడా పోటీ చేశాడు.

విలువిద్య, స్కేటింగ్‌లోనూ..

రుద్ర యోగాతో పాటు ఇతర వాటిల్లో కూడా చాలా చురుగ్గా పాల్గొంటాడు. ఇటీవల చేతులతో భూమి మీద బ్యాలెన్స్‌ చేస్తూ కాళ్లతో బాణం వేసిన వీడియో అందరినీ ఆశ్చర్యపరిచింది. అందులో కాళ్లతో బాణం వేసి.. దూరంగా ఉన్న బెలూన్‌ను పగలగొట్టాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేసిన వారం రోజుల్లోనే 3.2 మిలియన్ల మంది వీక్షించారు. పలువురు నెటిజన్లు తనపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇంకో విషయం ఏంటంటే రుద్ర కళ్లకు గంతలు కట్టుకొని కూడా ఈ సాహసాన్ని పూర్తిచేయగలడు. తాను చిన్నప్పటి నుంచే విలువిద్యలో కూడా శిక్షణ తీసుకుంటున్నాడట. అలాగే స్కేటింగ్‌ చేయడంలోనూ దిట్టే. ఇందులోనూ నేషనల్‌ ఛాంపియన్‌ షిప్‌నకు ఎంపికయ్యాడు. ఇంత చిన్న వయసులో చదువుతోపాటు వివిధ రంగాల్లో ప్రతిభ చాటుకుంటున్నాడంటే రుద్ర చాలా గ్రేట్‌ కదూ.. మరి మనమూ తనకు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పేద్దామా..!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని