ఈ అన్నాచెల్లెళ్లు అద్భుతం..!

హాయ్‌ నేస్తాలూ.. మనం స్కూల్‌ నుంచి ఇంటికి రాగానే.. ఏం చేస్తాం? ఏదైనా హోంవర్క్‌ ఉంటే.. అది పూర్తి చేసేసి ఎంచక్కా ఆడుకోవాలని చూస్తాం.

Published : 24 Sep 2023 00:21 IST

హాయ్‌ నేస్తాలూ.. మనం స్కూల్‌ నుంచి ఇంటికి రాగానే.. ఏం చేస్తాం? ఏదైనా హోంవర్క్‌ ఉంటే.. అది పూర్తి చేసేసి ఎంచక్కా ఆడుకోవాలని చూస్తాం. లేదంటే టీవీలో కార్టూన్లు చూస్తూ టైంపాస్‌ చేస్తాం అంతే కదా ఫ్రెండ్స్‌! కానీ, ఇద్దరు అన్నాచెల్లెళ్లు మాత్రం తమ చిట్టి చేతులతో అద్భుతం చేస్తున్నారు. మరి వాళ్లెవరో ఆ వివరాలేంటో వారి మాటల్లోనే తెలుసుకుందామా..!

మాది విశాఖపట్నం. మా పేర్లు నర్ల ప్రణవ్‌, ఆన్య. ప్రస్తుతం మేము అయిదు, మూడో తరగతి చదువుతున్నాం. అమ్మానాన్నలు అనిల, పవన్‌... వ్యాపారవేత్తలు. మేము రోజూ స్కూల్‌ నుంచి వచ్చాక హోంవర్క్‌ పూర్తి చేసుకొని, కాసేపు ఆడుకునేవాళ్లం. అయినా ఏమీ తోచేది కాదు. ఏదైనా పని చేయాలనుకున్నాం. కానీ స్కూల్‌కు వెళ్తూ ఏ పని చేయాలన్నా కష్టమవుతుందని అమ్మ చెప్పడంతో ఆగిపోయాం. ఆ తరవాత అమ్మ సలహాతోనే 2021 డిసెంబరులో రసాయనాలు వాడకుండా సబ్బులు తయారుచేయడం ప్రారంభించాం.

పాకెట్‌ మనీతో..!

అప్పుడప్పుడు అమ్మానాన్నలు ఇచ్చిన డబ్బు కొంత, అమ్మ పెట్టుబడి కొంత.. వాటితోనే సబ్బుల తయారీకి కావాల్సిన సరకులు కొన్నాం. మొదట్లో అవి సరిగ్గా రాలేదు. మధ్యలోనే విరిగిపోయేవి. పెట్టిన పెట్టుబడి కూడా రాలేదు. ఎక్కడ తప్పు జరుగుతుందో గమనించాం. అవి సరిగ్గా ఆరకపోవడమే కారణమని తెలిసి అప్పటి నుంచి జాగ్రత్తగా తయారు చేశాం. ఆ తరవాత బాగానే అమ్ముడయ్యాయి. అమ్మ ఇచ్చిన డబ్బులు మళ్లీ తిరిగి ఇచ్చేశాం.

పువ్వులతో సబ్బులు..!

సాధారణంగా బయట దొరికే సబ్బుల్లో చాలా రసాయనాలు వాడతారు. అందులో కొన్నింటి వల్ల క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకే మేము సహజంగా లభించే వాటితో సబ్బులు తయారు చేయాలనుకున్నాం. దాని కోసం పువ్వులు, సహజ నూనెలనే వాడుతున్నాం. తయారీ ప్రక్రియ అంతా మా ఇంట్లోనే జరుగుతుంది. వాటన్నింటిని కరిగించడానికి అమ్మ సాయం చేస్తుంది. ఇక వాటిని కత్తిరించడం, ప్యాక్‌ చేయడం అన్నీ మేమిద్దరమే చూసుకుంటాం.  

ఇన్‌స్టాలో ఆర్డర్లు..!

మేము తయారుచేసిన సబ్బులను అమ్మడానికి ఇన్‌స్టాగ్రాంలో ఓ పేజీని క్రియేట్‌ చేశాం. ఇప్పటి వరకు మూడు వేల వరకు సబ్బులు విక్రయించాం. దాదాపు రూ. లక్ష వరకు సంపాదించాం. తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్లకు మా సబ్బులు పంపిస్తున్నాం.

ఎన్నో ఆకృతులు..!

ఆర్డరు వచ్చిన తరవాతనే సరకు తయారుచేయడం ప్రారంభిస్తాం. కొందరు వైద్యులు కూడా మా సబ్బులను చూసి ప్రశంసలు అందించారు. విశాఖలో నిర్వహించే స్టాల్స్‌లో, కొన్ని దుకాణాల్లో కూడా మా సబ్బులు విక్రయిస్తున్నాం. వివిధ రంగులు, ఫ్లేవర్లలో తయారు చేస్తున్నాం. గులాబీ, ఐస్‌క్రీం, మిక్కీ మౌస్‌, డోనట్‌, గుర్రం, కేక్‌, కోడిగుడ్డు, టెడ్డీబేర్‌, బిస్కెట్‌, కప్‌కేక్‌ ఇలా వివిధ ఆకృతుల్లో తీర్చిదిద్దుతున్నాం. రంగుల కోసం పర్పుల్‌, పింక్‌, వైట్‌, ఎల్లో ఫ్లేవర్లలో.. నారింజ, మల్లె, గులాబీ, పుదీనా, వెనీలా తదితర ఎసెన్షియల్‌ ఆయిల్స్‌ను వినియోగిస్తున్నాం. ఈ వ్యాపారాన్ని మరింత విస్తరించాలన్నదే మా లక్ష్యం.

కేతిరెడ్డి రాజ్యలక్ష్మి, ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని