చిన్నారి బాహుబలి!

హాయ్‌ నేస్తాలూ.. ఉదయాన్నే నిద్ర లేవమంటే ‘బాబోయ్‌’ అనేస్తాం. అమ్మ ఎంత అరుస్తున్నా.. ‘ప్లీజ్‌.. ఇంకో అయిదు నిమిషాలు’ అంటూ మారాం చేస్తాం. హడావిడిగా నిద్రలేచి స్కూల్‌కి రెడీ అయిపోతాం. ఇక వ్యాయామంలాంటి వాటి గురించైతే అసలే పట్టించుకోం.. కానీ, ఓ బుడతడు మాత్రం ఏకంగా ప్రపంచ రికార్డే సాధించాడు.

Published : 06 Nov 2023 00:02 IST

హాయ్‌ నేస్తాలూ.. ఉదయాన్నే నిద్ర లేవమంటే ‘బాబోయ్‌’ అనేస్తాం. అమ్మ ఎంత అరుస్తున్నా.. ‘ప్లీజ్‌.. ఇంకో అయిదు నిమిషాలు’ అంటూ మారాం చేస్తాం. హడావిడిగా నిద్రలేచి స్కూల్‌కి రెడీ అయిపోతాం. ఇక వ్యాయామంలాంటి వాటి గురించైతే అసలే పట్టించుకోం.. కానీ, ఓ బుడతడు మాత్రం ఏకంగా ప్రపంచ రికార్డే సాధించాడు. మరి తనెవరో, ఆ వివరాలేంటో తెలుసుకుందామా..!

అసోం రాష్ట్ర రాజధాని గువాహటికి చెందిన యువాన్‌ గుప్తాకు ప్రస్తుతం ఆరు సంవత్సరాలు. సాధారణంగా ఈ వయసు పిల్లలైతే అప్పుడప్పుడే స్కూల్‌కి వెళ్తుంటారు. ఈ పతకాలూ, రికార్డులూ అంటే ఏంటో కూడా తెలిసుండదు. కానీ, ఈ చిన్నారి మాత్రం ఇటీవల నిర్వహించిన ‘కెటిల్‌బెల్‌ ఛాంపియన్‌షిప్‌-2023’లో బంగారు పతకం సాధించాడు. అంతేకాదు.. ‘స్నాచ్‌ కెటిల్‌బెల్‌’ విభాగంలో ఈ రికార్డు సాధించిన అతిచిన్న వయస్కుడిగానూ నిలిచాడు.

సాధనతోనే సాధించాడు.. 

‘మరి ఇంత చిన్న వయసులో అదెలా సాధ్యమైంది?’ అనే సందేహం మీకు వచ్చే ఉంటుంది కదా.. నిరంతర సాధనతోనే అది సాధ్యమైందని చెబుతున్నాడు యువాన్‌. చిన్నతనం నుంచి ఈ నేస్తం వాళ్ల తల్లిదండ్రులు నిత్యం జిమ్‌కు వెళ్లేవారట. ఇంటికొచ్చాక కూడా కసరత్తులు చేసేవారు. వాళ్లను చూస్తూ పెరగడంతో యువాన్‌కు సైతం వ్యాయామం పైన ఆసక్తి కలిగింది. ‘ఇంతకీ కెటిల్‌బెల్‌ అంటే ఏంటి?’ అని ఆలోచిస్తున్నారా.. అదో రకమైన వెయిట్‌ లిఫ్టింగ్‌ అన్నమాట. ఇనుముతో చేసిన గోళాలను వాటికున్న హ్యాండిల్‌ సహాయంతో పైకి ఎత్తి, మళ్లీ కిందకు దించడమన్నమాట. ఇది ఒక చేత్తో లేదా రెండు చేతులతోనూ చేయొచ్చు. ఈ ఆటంటే యువాన్‌కి చాలా ఇష్టమట. అందుకే ఎలాగైనా ఇందులో ఛాంపియన్‌షిప్‌ గెలవాలని చాలా ప్రాక్టీస్‌ చేశాడు. అనుకున్నట్లుగానే బంగారు పతకం సాధించి శెభాష్‌ అనిపించుకున్నాడు.

బోలెడు ప్రశంసలు..

ఇదే మొదటి అవార్డు అని అనుకునేరు నేస్తాలూ.. అంతకంటే ముందు జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ అనేక బహుమతులు అందుకున్నాడట. ఈ బుడతడి ప్రతిభకు గుర్తింపుగా ‘ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’, ‘ఏషియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లోనూ చోటు దక్కింది. అలాగని చదువును ఏమాత్రం నిర్లక్ష్యం చేయడం లేదు. భవిష్యత్తులో మరిన్ని రికార్డులు సాధించాలనేది తన లక్ష్యమని యువాన్‌ ధీమాగా చెబుతున్నాడు. మరి మనమూ ఈ నేస్తానికి ‘ఆల్‌ ది బెస్ట్‌’ చెప్పేద్దామా..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని