ప్లాస్టిక్‌ వ్యర్థాలే.. ఈ బడిలో ఫీజు!

హాయ్‌ నేస్తాలూ..! ‘వాడేసిన ప్లాస్టిక్‌ బాటిళ్లను, చాక్లెట్లు తినేశాక ఆ కవర్లను ఏం చేస్తారు?’ అని మనల్ని ఎవరైనా అడిగితే, వారివైపు అమాయకంగా చూస్తాం.

Published : 08 Nov 2023 00:07 IST

హాయ్‌ నేస్తాలూ..! ‘వాడేసిన ప్లాస్టిక్‌ బాటిళ్లను, చాక్లెట్లు తినేశాక ఆ కవర్లను ఏం చేస్తారు?’ అని మనల్ని ఎవరైనా అడిగితే, వారివైపు అమాయకంగా చూస్తాం. ‘ఇదేం ప్రశ్న.. వాటిని ఏం చేస్తాం.. చెత్తబుట్టలో పడేస్తాం’ అని జవాబిస్తారు. అంతే కదా.. కానీ ఓ స్కూల్లో మాత్రం వాటినే ఫీజుగా తీసుకుంటున్నారట. నిజమే ఫ్రెండ్స్‌.. పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే.. ఈ కథనం చదివేయండి మరి..!  

అసోంలోని పమోహి ప్రాంతం.. చుట్టూ కొండలతో, పచ్చని చెట్లతో అలరారే ఓ మారుమూల పల్లెటూరు. 2016లో అక్కడికి పర్మిత శర్మ, ముక్తర్‌ అనే దంపతులు ఒకసారి వెళ్లారు. ప్రకృతి అందాలు బాగున్నా.. ఎక్కడ చూసినా ప్లాస్టిక్‌ వ్యర్థాలు పేరుకుపోయి కనిపించాయట. అంతేకాదు.. అక్కడి పిల్లలకు చదువు అసలే రాదని తెలిసింది. దాంతో ఆ రెండు సమస్యలకు వాళ్లు పరిష్కారం చూపాలనుకున్నారు. అలా వచ్చిందే స్కూల్‌ ఏర్పాటు ఆలోచన. ‘స్కూల్‌ పెట్టి చదువు చెబుతారు సరే.. మరి ప్లాస్టిక్‌కు పరిష్కారం ఎలా?’ అని వెంటనే మీకో సందేహం వచ్చే ఉంటుంది. ప్లాస్టిక్‌ బాటిళ్లు, కవర్లే ఆ స్కూల్‌కి వచ్చే విద్యార్థులు చెల్లించాల్సిన ఫీజు మరి. అలా ఒకే దెబ్బకు రెండు సమస్యలకు పరిష్కారం చూపించారన్నమాట.

ప్లాస్టిక్‌ వ్యర్థాలే ఫీజు..

ఈ స్కూల్‌కి వచ్చే విద్యార్థుల నుంచి వారానికి 25 ప్లాస్టిక్‌ బాటిళ్లను మాత్రమే ఫీజుగా తీసుకుంటూ విద్య అందిస్తున్నారు. వాటితోపాటు చాక్లెట్‌ కవర్లు, ప్యాకింగ్‌ సామగ్రిని కూడా ఇవ్వొచ్చు. ‘మరి వాటిని వాళ్లేం చేసుకుంటారు?’ అని అనుకోకండి నేస్తాలూ.. ఆ ప్లాస్టిక్‌ వ్యర్థాలను రీసైక్లింగ్‌ చేసి.. రోడ్లు వేయడంతోపాటు టైల్స్‌ తయారు చేస్తున్నారట.  

చదువొక్కటే కాదు..  

ఈ బడిలో చదువుతోపాటు ఇతర భాషలూ, ప్లాస్టిక్‌ రీసైక్లింగ్‌, పర్యావరణ పరిరక్షణ, గార్డెనింగ్‌ తదితర అంశాలనూ నేర్పిస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే.. పై తరగతి విద్యార్థులే తక్కువ తరగతుల్లో ఉన్న వారికి క్లాసులు చెబుతుంటారట. అంతేకాదు.. అందుకు వాళ్లకు డబ్బులు కూడా చెల్లిస్తారు. డబ్బులు అనగానే నిజమైనవని అనుకోకండి.. ప్లాస్టిక్‌ కరెన్సీ నోట్లు ఇస్తారు. వాటితో అక్కడి దుకాణాల్లో సరకులు, దుస్తులు, స్నాక్స్‌ కొనుక్కోవచ్చు. విద్యార్థులకు ఎన్ని ఎక్కువ మార్కులు వస్తే, అంత అధికంగా డబ్బులు ఇస్తారట. ఈ విధానంతో మారుమూల ప్రాంత పిల్లలకు చదువుతోపాటు రోజువారీ జీవనానికి అవసరమైన ఆర్థిక సహాయమూ అందుతుందన్నమాట.

ఒక్కరూ మానేయలేదట..

ఏడేళ్లుగా ఈ బడి నడుస్తున్నా.. ఇంతవరకూ ఒక్కరు కూడా మధ్యలో చదువు మానేయలేదని నిర్వాహకులైన ఆ భార్యాభర్తలు సంతోషంగా చెబుతున్నారు. ఇటీవల ఈ స్కూల్‌కి సంబంధించిన వీడియోను అక్కడి మంత్రి సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో తక్కువ సమయంలోనే వైరల్‌గా మారింది. ‘ఇది చాలా మంచి ఆలోచన’, ‘నిజంగా గ్రేట్‌ కపుల్‌’ అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఫ్రెండ్స్‌.. ఈ పాఠశాల విశేషాలు భలే ఉన్నాయి కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని