శెభాష్‌ శాన్యా..!

హలో ఫ్రెండ్స్‌.. ఎండాకాలం వచ్చిందంటే చాలు.. అగ్నిప్రమాదాలకు సంబంధించిన వార్తలు బోలెడు కనిపిస్తుంటాయి.

Updated : 11 Nov 2023 05:35 IST

హలో ఫ్రెండ్స్‌.. ఎండాకాలం వచ్చిందంటే చాలు.. అగ్నిప్రమాదాలకు సంబంధించిన వార్తలు బోలెడు కనిపిస్తుంటాయి. మనం ఎటైనా బయటకు వెళ్లేటప్పుడు, గ్యాస్‌ ఆఫ్‌ చేశానా లేదా అని.. అమ్మ ఒకటికి రెండుసార్లు చెక్‌ చేస్తుంటుంది. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో పాఠాల్లో ఉంటుంది. అయితే, ఓ నేస్తం అగ్ని ప్రమాదాలను ముందే పసిగట్టగలిగేలా ఓ ఆవిష్కరణ చేసింది. అవార్డూ అందుకుంది. ఆ వివరాలే ఇవి..

శాన్యా గిల్‌.. అమెరికాలో స్థిరపడిన భారత కుటుంబం వీళ్లది. 12 సంవత్సరాల ఈ అమ్మాయి ప్రస్తుతం ఆరో తరగతి చదువుతోంది. ఇటీవలే 65వేల మందితో పోటీపడి మరీ ప్రఖ్యాత ‘థర్మో ఫిషర్‌ సైంటిఫిక్‌ తిళీదినివిదీ అవార్డు’ను గెలుచుకుంది.

ఆ ప్రమాదంతోనే ఆలోచన

శాన్యా వాళ్ల కుటుంబం కాలిఫోర్నియాలో నివసిస్తోంది. గతేడాది ఒకరోజు వాళ్ల ఇంటికి సమీపంలో ఉన్న ఓ రెస్టరంట్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. మంటల వల్ల అక్కడ జరిగిన ప్రాణ, ఆస్తి నష్టాన్ని కళ్లారా చూశారు. అప్పటి నుంచి శాన్యా వాళ్లమ్మ స్టవ్‌, కరెంట్‌ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండసాగింది. ఆ క్షణంలోనే.. అసలు ప్రమాదాలు జరగకుండా ఉంటే ఇంత నష్టం, హడావిడి ఉండదు కదా అనుకుంది శాన్యా.

ప్రోగ్రామింగ్‌ రావడంతో..

ఆ తర్వాత ఒకరోజు ఇంట్లో కూర్చొని టీవీ చూస్తుండగా.. అక్కడే ఉన్న థర్మల్‌ కెమెరాపైన తన దృష్టి పడింది. చలికాలంలో ఇంట్లో ఉష్ణోగ్రతలు తగ్గినప్పుడు హెచ్చరించే ఆ కెమెరానే.. అగ్ని ప్రమాదాలను కూడా పసిగడితే బాగుండునని అనిపించింది. అనుకున్నదే ఆలస్యం.. తన ఆలోచనను తల్లిదండ్రులతో పంచుకుంది. వారూ సరేనని తనను ప్రోత్సహించారు. వెంటనే ఓ కెమెరా తీసుకొచ్చి, తన కంప్యూటర్‌కు అనుసంధానం చేసింది. మనుషుల కదలికలు, వారి శరీర ఉష్ణోగ్రతలను నమోదు చేయడంతోపాటు అగ్ని ప్రమాద కారకాలను గుర్తించేలా ప్రోగ్రామింగ్‌ చేసింది. తనకు అంతముందే కోడింగ్‌ తెలిసుండటం ఇలా కలిసొచ్చిందన్నమాట. ఒకవేళ ఇంట్లో ఏదైనా వేడిని పసిగట్టి, పది నిమిషాల వరకూ మనుషుల కదలికలు లేకపోతే వెంటనే సంబంధిత యజమానులకు మెసేజ్‌ వెళ్లేలా కోడింగ్‌ రాసేసింది.

అవార్డు, నగదు బహుమతి..

శాన్యా తయారు చేసిన నమూనా పరికరాన్ని తమ ఇంట్లోని గ్యాస్‌ స్టవ్‌ వెనక అమర్చి, దాని పనితీరును పరిశీలించింది. దాదాపు 98 శాతం కచ్చితత్వంతో అది పనిచేయసాగింది. ఈ ప్రయోగాన్నే అమెరికాలో ఏటా ‘సొసైటీ ఫర్‌ సైన్స్‌’ నిర్వహించే సైంటిఫిక్‌ పోటీల్లోనూ ప్రదర్శించింది. ఉత్తమ ఆవిష్కణగా నిలవడంతోపాటు రూ.20 లక్షల ప్రైజ్‌ మనీ కూడా గెలుచుకుంది. ఖాళీ సమయాల్లో ఈత కొట్టడం, వాటర్‌ పోలో, టేబుల్‌ టెన్నిస్‌ ఆడుతుంటుందట. అంతేకాదు.. భవిష్యత్తులో బయోమెడికల్‌ ఇంజినీర్‌ కావాలనుకుంటున్న ఈ నేస్తం.. తన నైపుణ్యాలను చిన్నపిల్లలకు పాఠాలుగా చెబుతోంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని