శెభాష్‌ అయాన్‌..!

హాయ్‌ నేస్తాలూ.. ఖాళీ సమయం దొరికితే మనం స్నేహితులతో కలిసి ఆడుకోవడానికే ఎక్కువ ఆసక్తి చూపుతాం.

Updated : 18 Nov 2023 03:42 IST

హాయ్‌ నేస్తాలూ.. ఖాళీ సమయం దొరికితే మనం స్నేహితులతో కలిసి ఆడుకోవడానికే ఎక్కువ ఆసక్తి చూపుతాం. పెద్దవాళ్లు బయటకు పంపించకపోతే ఇంట్లోనే స్మార్ట్‌ఫోన్‌లో గేమ్స్‌ ఆడటమో, టీవీలో కార్టూన్స్‌ చూడటమో చేస్తుంటాం. కానీ, ఓ బుడతడు మాత్రం పియానో వాయించడం నేర్చుకున్నాడు. తన ప్రతిభతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. మరి తనెవరో.. ఆ వివరాలేంటో తెలుసుకుందామా..!

ముంబయికి చెందిన అయాన్‌ దేశ్‌పాండేకు తొమ్మిది సంవత్సరాలు. ప్రస్తుతం నాలుగో తరగతి చదువుతున్నాడు. సాధారణంగా పిల్లలు స్కూల్‌కి వెళ్లనని మారాం చేస్తుంటారు. వాళ్లు బడికి వెళ్లి వస్తే చాలని అనుకునే తల్లిదండ్రులే ఎక్కువగా ఉంటారు. చదువు కాకుండా వారికి ఇతర ఆసక్తులు ఏమున్నాయో చాలామంది పట్టించుకోరు. కానీ, అయాన్‌ మాత్రం తనకు పియానో అంటే ఇష్టం ఉందనీ, నేర్చుకుంటాననీ తల్లిదండ్రులకు చెప్పాడు. వారూ సరేననడంతో అయిదేళ్ల వయసు నుంచే పియానో నేర్చుకోవడం ప్రారంభించాడు. ఫోన్‌లో పియానో ప్లే చేయడానికి సంబంధించిన వీడియోలను చూసేవాడు. కొన్ని ఆప్‌ల సాయంతో మెలకువలూ తెలుసుకున్నాడు. ఆ తర్వాత ఓ మ్యూజిక్‌ స్కూల్‌లో చేరాడు.  

తక్కువ సమయంలోనే..

మ్యూజిక్‌ స్కూల్‌లో చేరగానే వెస్టర్న్‌ మ్యూజిక్‌ నేర్చుకోవడం ప్రారంభించాడు. అంతకు ముందు నుంచే తనకు పియానో వాయించడం తెలిసి ఉండటంతో, సొంతంగానే రకరకాల ట్యూన్లు వినిపించేవాడట. క్లాసులో చెప్పిందేదైనా నేర్చుకునేందుకు మిగతా వారికి వారం రోజులు పడితే, అయాన్‌ మాత్రం ఒక్క రోజులోనే అర్థం చేసుకునేవాడట. తన ప్రతిభతో ఆరు నెలల్లోనే ప్రదర్శలు ఇచ్చే స్థాయికి చేరాడు. ఇటీవల ఆస్ట్రియా రాజధాని వియన్నాలో జరిగిన ‘గోల్డెన్‌ కీ మ్యూజికల్‌ ఫెస్ట్‌’లో పాల్గొని 1990కి చెందిన పాటలను కూడా అలవోకగా ప్లే చేసి అందరి ప్రశంసలు అందుకున్నాడు. ఇంకో విషయం ఏంటంటే.. అందులో పాల్గొన్న 25 మందిలో మన అయానే అతిచిన్న వయస్కుడట.

చదువులోనూ ముందే..

‘ఒకవైపు పియానో నేర్చుకుంటూ, మరోవైపు ప్రదర్శనలు ఇస్తూ.. ఇక స్కూల్‌కి ఏం వెళ్తాడు?’ అనే అనుమానం మీకు వచ్చే ఉంటుంది. అది నిజమే.. అందుకే, వాళ్ల తల్లిదండ్రులు అయాన్‌కి హోంస్కూల్‌ని ఏర్పాటు చేశారు. అన్ని పరీక్షల్లో మార్కులూ బాగానే వస్తాయట. అందరూ భయపడే.. మ్యాథ్స్‌, హిస్టరీ సబ్టెక్టులంటే ఈ బుడతడికి చాలా ఇష్టమట. తాజాగా ఓ సంస్థ ప్రకటించిన ‘అన్‌స్టాపబుల్‌21’ జాబితాలో అయాన్‌కు చోటు దక్కడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శనలు ఇవ్వడమే తన లక్ష్యమని చెబుతున్న ఈ నేస్తానికి మనమూ ఆల్‌ ది బెస్ట్‌ చెప్పేద్దామా!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని