ఈ చిన్నారి కథలు అద్భుతం..!

హాయ్‌ నేస్తాలూ..! హోంవర్క్‌ మొత్తం పూర్తయ్యాక ఏం చేస్తారు? మీకు ఏ పని చేయడం ఇష్టం అని ఎవరైనా అడిగితే..

Updated : 28 Nov 2023 04:56 IST

హాయ్‌ నేస్తాలూ..! హోంవర్క్‌ మొత్తం పూర్తయ్యాక ఏం చేస్తారు? మీకు ఏ పని చేయడం ఇష్టం అని ఎవరైనా అడిగితే.. ఆడుకోవడం అని టక్కున చెప్పేస్తాం.. అంతే కదా! కానీ ఓ చిన్నారి మాత్రం పుస్తకాలు రాయడమే తన హాబీ అని చెబుతోంది. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా కథలు రాస్తానంటోంది. మరి తనెవరో.. ఆ వివరాలేంటో తెలుసుకుందామా..!

త్తర్‌ప్రదేశ్‌కు చెందిన అభిజీత గుప్తాకు పది సంవత్సరాలు. ప్రస్తుతం అయిదో తరగతి చదువుతోంది. సాధారణంగా ఎక్కువ మంది పిల్లలు హోంవర్క్‌ ఎప్పుడు అవుతుందా? ఎప్పుడెళ్లి ఆడుకుందామా.. అని చూస్తుంటారు. ఇంకొందరైతే ఆటలకే ఎక్కువ సమయం కేటాయిస్తారు. కానీ ఈ చిన్నారి మాత్రం స్కూల్‌ నుంచి వచ్చి.. హోంవర్క్‌ పూర్తి చేశాక, కథలు రాయడానికి మొగ్గు చూపుతుందట. ఏదో ఖాళీ సమయాల్లో రాస్తుంది కదా.. పెద్దగా ఆసక్తిగా ఉండవని అనుకోకండి పిల్లలూ.. తను రాసిన కథలకు అవార్డులు కూడా వచ్చాయి.

ఈ కథలు ఇష్టం..!

మన అభిజీత ఇప్పటి వరకు మూడు పుస్తకాలు రాయడం పూర్తి చేసింది. ప్రస్తుతం నాలుగోది రాస్తోందట. ‘హ్యాపినెస్‌ ఆల్‌ ఎరౌండ్‌’, ‘వియ్‌ విల్‌ షోర్లీ సస్టైన్‌’, ‘టు బిగిన్‌ విత్‌ లిటిల్‌ థింగ్స్‌’ ఆమె రాసిన పుస్తకాల పేర్లు. చాలా తక్కువ సమయంలో దాదాపు 10 వేల కాపీలు అమ్ముడయ్యాయట. సహజంగా ఇంట్లో జరిగే చిన్నచిన్న సన్నివేశాలు, కరోనా సమయంలో జనాల జీవన విధానం వంటి అంశాల మీద ఇప్పటి వరకు కథలు, కవితలు రాసింది. ఇంకో విషయం ఏంటంటే.. హార్రర్‌ కథలు రాయడమంటే అభిజీతకు చాలా ఇష్టమట. తన ప్రతిభతో ‘ఏషియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’, ‘గ్లోబల్‌ చైల్డ్‌ ప్రాడిజీ’ నుంచి ‘గ్రాండ్‌ మాస్టర్‌ ఆఫ్‌ రైటింగ్‌’ అనే అవార్డును కూడా అందుకుంది. ఇంకా ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లోనూ స్థానం దక్కించుకుంది. ‘భవిష్యత్తులో డాక్టర్‌ అవ్వాలనేదే అభిజీత ప్రధాన లక్ష్యం. అందుకే చదువును అస్సలు నిర్లక్ష్యం చేయదు. క్లాస్‌లో కూడా ఎప్పుడూ ముందే ఉంటుంది. స్కూల్‌ నుంచి వచ్చాక హోంవర్క్‌ రాసి, అప్పుడు కథల మీద దృష్టి పెడుతుంది’ అని వాళ్లమ్మ అనుప్రియ చెబుతున్నారు. మరో విషయం ఏంటంటే.. ఇటీవల ఓ సంస్థ నిర్వహించిన అన్‌స్టాపబుల్‌ 21 కార్యక్రమంలో స్థానం దక్కించుకుంది. అభిజీత మరిన్ని కథలు రాస్తూ, తను అనుకున్నట్లుగా డాక్టర్‌ అవ్వాలని మనమూ ‘ఆల్‌ ది బెస్ట్‌’ చెప్పేద్దామా..!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని