ఈ చిన్నారి.. ట్రెక్కింగ్‌లో నేర్పరి!

హాయ్‌ నేస్తాలూ..! ఎక్కడికైనా వెళ్లినప్పుడు నడవాలన్నా, మెట్లెక్కాలన్నా కొంత వరకైతే పర్లేదు కానీ, ఎక్కువ దూరమైతే.. ‘అమ్మో నా వల్ల కాదు’ అనేస్తాం. కానీ నడవడానికి అసలు ప్రాధాన్యతే ఇవ్వం.

Published : 07 Dec 2023 00:28 IST

హాయ్‌ నేస్తాలూ..! ఎక్కడికైనా వెళ్లినప్పుడు నడవాలన్నా, మెట్లెక్కాలన్నా కొంత వరకైతే పర్లేదు కానీ, ఎక్కువ దూరమైతే.. ‘అమ్మో నా వల్ల కాదు’ అనేస్తాం. కానీ నడవడానికి అసలు ప్రాధాన్యతే ఇవ్వం. అంతే కదా..! కానీ ఓ చిన్నారి మాత్రం అలవోకగా పర్వతాలనే ఎక్కేస్తూ, రికార్డులు సాధిస్తోంది. మరి తనెవరో ఆ వివరాలేంటో తెలుసుకుందామా..!

హారాష్ట్రలోని థానేకు చెందిన గ్రిహిత సచిన్‌ విచారేకు తొమ్మిది సంవత్సరాలు. ప్రస్తుతం తను అయిదో తరగతి చదువుతోంది. ఏంటి ఇంత చిన్న అమ్మాయి అంటున్నారు.. ఆమె పర్వతాలు ఎక్కడమేంటని ఆశ్చర్యపోతున్నారా..! కానీ అది నిజమే నేస్తాలూ. తను రెండో తరగతిలో ఉన్నప్పటి నుంచే ట్రెక్కింగ్‌ నేర్చుకోవడం ప్రారంభించిందట. స్కూల్‌కి వెళ్లొచ్చి హోంవర్క్‌ చేసుకోవడమే ఇబ్బందిగా అనుకుంటారు కొంతమంది పిల్లలు. కానీ మన గ్రిహిత మాత్రం.. అటు చదువులో ముందుంటూనే, తనకు నచ్చిన ట్రెక్కింగ్‌ నేర్చుకుంది.

 తక్కువ సమయంలో..

గ్రిహిత గత రెండేళ్లలో దాదాపు 55సార్లు ట్రెక్కింగ్‌ చేసిందని వాళ్ల నాన్న చెబుతున్నారు. తనకు శిక్షణ ఇచ్చే గురువుల సమక్షంలో ఈ ఏడాది ఆగస్టు 12న కిలిమంజారో పర్వతం ఎక్కడం ప్రారంభించి, 15వ తేది సాయంత్రానికల్లా 5895 మీటర్ల ఎత్తుకు చేరుకుంది. 62 గంటల్లో తన లక్ష్యాన్ని చేరుకోగా, అందులో 20 గంటలపాటు నడిచిందట. ఇంకో విషయం ఏంటంటే.. అతి తక్కువ సమయంలో కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన అమ్మాయిగా రికార్డు సృష్టించింది.

ఎవరెస్టూ ఎక్కేసింది..!

ఈ చిన్నారి ఎవరెస్టు పర్వతాన్ని 5364 మీటర్ల వరకు ఎక్కేసిందట. మహారాష్ట్రలోనే దాన్ని అతిచిన్న వయసులో అధిరోహించిన రెండో అమ్మాయిగా, భారతదేశంలో మూడో అమ్మాయిగా స్థానం దక్కించుకుంది. తన ప్రతిభను ‘ఏషియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’, ‘ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’ గుర్తించాయి. ఇంకా తను రాణీ లక్ష్మీబాయ్‌ పురస్కారాన్ని కూడా అందుకుంది. చిన్న వయసులోనే ఇంతటి ఘనత సాధించిన మన గ్రిహిత చాలా గ్రేట్‌ కదా పిల్లలూ..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని