ఔరా.. చక్రాల చిచ్చరపిడుగు!

హాయ్‌ నేస్తాలూ..! మనం ఖాళీ సమయాల్లో ఇంట్లో కూర్చొని వీడియో గేమ్స్‌ ఆడటానికి, కార్టూన్స్‌ చూడటానికే ఎక్కువ ఆసక్తి చూపుతాం.

Updated : 12 Dec 2023 05:48 IST

హాయ్‌ నేస్తాలూ..! మనం ఖాళీ సమయాల్లో ఇంట్లో కూర్చొని వీడియో గేమ్స్‌ ఆడటానికి, కార్టూన్స్‌ చూడటానికే ఎక్కువ ఆసక్తి చూపుతాం. బయటికి వెళ్లి ఏవైనా ఆటలు ఆడాలంటే కాస్త బద్ధకంగా ఉంటాం. కానీ ఓ చిచ్చరపిడుగు మాత్రం లింబో స్కేటింగ్‌ చేస్తూ.. రికార్డుల మీద రికార్డులు సాధిస్తోంది. మరి తనెవరో, ఆ వివరాలేంటో తెలుసుకుందామా..!

హ్మదాబాద్‌కు చెందిన తక్ష్వి హర్నిల్‌ వాఘణికి అయిదు సంవత్సరాలు. ప్రస్తుతం తను యూకేజీ చదువుతోంది. తనకు చిన్నప్పటి నుంచే లింబో స్కేటింగ్‌ చేయడం అంటే చాలా ఇష్టమట. ఆమె ఆసక్తిని గమనించిన తక్ష్వి వాళ్ల అమ్మానాన్నలు కూడా శిక్షణ ఇప్పించారు. రోజూ ఉదయాన్నే లేచి, కాసేపు సాధన చేసి అప్పుడు తయారై, స్కూల్‌కు వెళ్తుందట. మళ్లీ స్కూల్‌ నుంచి రాగానే.. హోంవర్క్‌ అంతా పూర్తి చేసుకొని స్కేటింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తుందట. ఇప్పటి వరకు తను చాలా పోటీల్లో కూడా పాల్గొందట.

లింబో స్కేటింగ్‌ అంటే..

స్కేటింగ్‌ అంటే తెలుసు కానీ.. ఈ లింబో స్కేటింగ్‌ అంటే.. వినడానికి కాస్త కొత్తగా ఉందేంటి అనుకుంటున్నారా..? ఆ విషయాన్నే ఇప్పుడు తెలుసుకుందాం. ‘నిర్ణీత దూరంలో కొన్ని బార్స్‌ను(కడ్డీలను) ఉంచుతారు. వాటికి శరీరం తగలకుండా వాటి కింద నుంచి రావాలి. అలా మొదటి నుంచి చివరి వరకు చేరుకోవాలి’ దీన్నే లింబో స్కేటింగ్‌ అంటారు. మన తక్ష్వి ఈ ‘లోఎస్ట్‌ లింబో స్కేటింగ్‌’లో తన ప్రతిభను చూపి ‘ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’, ‘ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో స్థానం దక్కించుకుంది. 50 మీటర్ల దూరాన్ని కేవలం 15.17 సెకన్లలో చేరుకుంది. ఇక్కడ ఏర్పాటు చేసిన 11 బార్స్‌ ఎత్తు 18.2 సెంటీ మీటర్లు. భవిష్యత్తులో మరిన్ని రికార్డులు సాధించాలనేది తన లక్ష్యమని చెబుతున్న ఈ చక్రాల చిచ్చరపిడుగుకు మనమూ ‘ఆల్‌ ది బెస్ట్‌’ చెప్పేద్దామా మరి!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని