ఆటే కాదు.. ఆర్ట్‌ కూడా..!

హాయ్‌ ఫ్రెండ్స్‌..! అమ్మానాన్నలతో బయటికి వెళ్లినప్పుడు ఎప్పుడో ఒకసారి రూబిక్‌ క్యూబ్‌ కొనిపెట్టమని అడిగే ఉంటారు కదా! ఇంతకీ దాంతో ఏం చేశారు? ‘ఇదేం ప్రశ్న, రూబిక్‌ క్యూబ్‌తో ఏం చేస్తాం.. ఆడుకుంటాం’ అంటారా? అది నిజమే.

Updated : 16 Dec 2023 05:04 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌..! అమ్మానాన్నలతో బయటికి వెళ్లినప్పుడు ఎప్పుడో ఒకసారి రూబిక్‌ క్యూబ్‌ కొనిపెట్టమని అడిగే ఉంటారు కదా! ఇంతకీ దాంతో ఏం చేశారు? ‘ఇదేం ప్రశ్న, రూబిక్‌ క్యూబ్‌తో ఏం చేస్తాం.. ఆడుకుంటాం’ అంటారా? అది నిజమే. కానీ.. ఓ నేస్తం వాటితో మనుషుల బొమ్మలను ఏర్పాటు చేస్తుంది. ఆశ్చర్యంగా ఉంది కదూ.. వెంటనే తనెవరో తెలుసుకోవాలనుందా? అయితే ఈ కథనం చదివేయండి మరి..!

బెంగళూరుకు చెందిన శ్రీహంసికకు తొమ్మిది సంవత్సరాలు. ప్రస్తుతం నాలుగో తరగతి చదువుతోంది. తను చిన్నప్పటి నుంచే రూబిక్‌ క్యూబ్స్‌ సాల్వ్‌ చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపించేదట. అలాగే వాళ్ల అమ్మమ్మ దగ్గర సంస్కృత శ్లోకాలు కూడా చక్కగా నేర్చుకునేదట. సాధారణంగా అయితే మనం ఒక పని చేస్తూ, మరోదాని గురించి ఆలోచించినా దాన్ని సరిగ్గా పూర్తి చేయలేం. కానీ, హంసిక మాత్రం ఆపకుండా 18 శ్లోకాలు చెబుతూనే.. 15 రూబిక్‌ క్యూబ్స్‌ను ఏడు నిమిషాల్లో సాల్వ్‌ చేసింది తెలుసా! అలా తన ప్రతిభతో ‘కలామ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’, ‘ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లలో స్థానం దక్కించుకుంది.

ఆసక్తితోనే..

మన హంసికకు వాళ్లమ్మ ఒకసారి రూబిక్‌ క్యూబ్‌ కొనిపెట్టారట. రంగురంగులుగా ఉండటంతో దాంతో ఆడుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపేదట. అలా కొంచెం పెద్దయ్యాక రకరకాల క్యూబ్స్‌ను ఎలా సాల్వ్‌ చేయాలో ఇంటర్నెట్‌లో వెతికేది. ఇప్పుడు దాదాపు పది రకాల క్యూబ్స్‌ అయినా అలవోకగా సాల్వ్‌ చేసేస్తుంది. ఇంకో విషయం ఏంటంటే వాటితో మొసైక్‌ పోర్ట్రయిట్‌ చేయగలదు. ఇటీవల 300 రూబిక్‌ క్యూబ్స్‌తో మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఇస్రో ఛైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ ఫొటోలను వేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ‘ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’ నుంచి ‘యంగెస్ట్‌ టు మేక్‌ మొసైక్‌ ఆర్ట్‌ పోట్రిస్ట్‌’ విభాగంలో అవార్డు సొంతం చేసుకుంది. ఇలాగే తను మరిన్ని విజయాలు సాధించాలని మనమూ ‘ఆల్‌ ది బెస్ట్‌’ చెప్పేద్దామా..!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని