ఈ కవలలు.. చదరంగంలో చిరుతలు..!

వారిద్దరూ కవలలు. చదరంగం అంటే వాళ్లకు చాలా ఇష్టం. తమ చిట్టి చిట్టి చేతులతో గట్టి ఎత్తులు వేస్తున్నారు. చిరుతల్లా పావులు కదుపుతూ.. ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.

Updated : 17 Dec 2023 06:19 IST

వారిద్దరూ కవలలు. చదరంగం అంటే వాళ్లకు చాలా ఇష్టం. తమ చిట్టి చిట్టి చేతులతో గట్టి ఎత్తులు వేస్తున్నారు. చిరుతల్లా పావులు కదుపుతూ.. ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఏకంగా అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తూ... అందరితో ‘శభాష్‌’ అనిపించుకుంటున్నారు. తమ తోటివారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. మరి ఆ చిచ్చరపిడుగుల గురించి తెలుసుకుందామా!

హైదరాబాద్‌కు చెందిన వ్యాపార వేత్త వరుణ్‌ అగర్వాల్‌, పనాషా దంపతుల సంతానం అమయ, అనయ్‌. కవలలైన వీళ్లకు ప్రస్తుతం ఎనిమిది సంవత్సరాలు. మూడో తరగతి చదువుతున్నారు. ఏడేళ్ల వయసులో చెస్‌ ఆడటం ప్రారంభించారు. చెస్‌ స్కూల్‌లో 18 నెలలుగా శిక్షణ తీసుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా పోటీల్లో పాల్గొంటూ, పతకాలు తమ సొంతం చేసుకుంటున్నారు.

సత్తా చాటారు...

అందరి పిల్లల్లానే వీరిద్దరూ ఎక్కువ సమయం గొడవ పడుతూనే ఉండేవారు. వీరిని దారిలో పెట్టేందుకు తల్లి చెస్‌లో శిక్షణ ఇప్పించారు. వారంలో ఒక గంట చెస్‌ ఆన్‌లైన్‌ క్లాస్‌నూ ఏర్పాటు చేయించారు. కొన్ని రోజులు మాత్రమే తరగతులు విన్న వీరిద్దరూ అకాడమీ టోర్నమెంట్‌లో సత్తా చాటారు. అనయ్‌ ప్రథమ, అమయ ద్వితీయ స్థానాల్లో నిలిచారు. తల్లిదండ్రులతో పాటు కోచ్‌ కూడా ఆశ్చర్యపోయేలా చేశారు.

విదేశాల్లో...

వీరిలోని ప్రతిభ, ఆటపై ఉన్న మక్కువను గుర్తించిన కోచ్‌ అంతర్జాతీయ స్థాయి పోటీలకు సిద్ధం చేశారు. ఈజిప్ట్‌, సెర్బియాలోని బెల్‌గ్రేడ్‌లో జరిగిన చెస్‌ టోర్నీల్లో పాల్గొని విజేతలుగా నిలిచారు. యూకేలోని బావెంట్రీలో 30 దేశాల వారు పాల్గొన్న టోర్నీలో అమయ ప్రథమ బహుమతి అందుకుంది.

ఎత్తుకు పై ఎత్తులు వేసి...  

అమయ ప్రపంచవ్యాప్తంగా 60 మంది ఆటగాళ్లతో పోటీపడి అండర్‌- 8 విభాగంలో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. మలేషియా, చైనా, కెనడా, కిర్గిజిస్తాన్‌, మంగోలియా, శ్రీలంక ఆటగాళ్ల ఎత్తులకు పై ఎత్తులు వేసి వాళ్లను ఓడించింది. రష్యా, మంగోలియాతో డ్రా చేసుకుంది. అనయ్‌ అండర్‌- 8 విభాగంలో 90 మందితో పోటీపడ్డాడు. ఉజ్బెకిస్తాన్‌, మెక్సికో, కిర్గిజిస్తాన్‌, మంగోలియాపై విజయం సాధించాడు. రష్యా, స్లోవేకియా, శ్రీలంక, ఆస్ట్రేలియాతో ఆటను డ్రాగా ముగించాడు.

చదువుల్లోనూ చురుకే..

అనయ్‌, అమయ కేవలం చదరంగంలోనే కాదు, చదువుల్లోనూ రాణిస్తూ, ముందంజలో ఉన్నారు. అథ్లెటిక్స్‌లోనూ ప్రవేశం ఉంది. పియానోపై కూడా వీరికి పట్టుంది. అమ్మానాన్న ప్రోత్సాహంతోనే ఇవన్నీ సాధ్యమవుతున్నాయి. ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యం వారు కూడా సహకరిస్తున్నారు. ఈ ఇద్దరు చిచ్చరపిడుగులు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని మనమూ మనసారా కోరుకుందామా మరి.

సాయి కొర్ను, ఈనాడు పాత్రికేయ పాఠశాల


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని