అవన్నీ ఎందుకో తెలిస్తే బాగుండు!

అవన్నీ నున్నని రాతి గుండ్లు. ప్రకృతి సృష్టి అని స్పష్టంగా తెలియదు. మనుషులు మలిచారన్న ఆధారాలూ లేవు. కేవలం ఊహాగానాలు తప్ప. మరి ఇంతకీ అవి ఏంటి? వాటి పేరేంటి? ఇలాంటి కొన్ని వివరాలు తెలుసుకుందాం సరేనా! అయితే ఇంకెందుకాలస్యం ఈ కథనం చదివేయండి మరి.

Updated : 05 Jan 2024 04:48 IST

అవన్నీ నున్నని రాతి గుండ్లు. ప్రకృతి సృష్టి అని స్పష్టంగా తెలియదు. మనుషులు మలిచారన్న ఆధారాలూ లేవు. కేవలం ఊహాగానాలు తప్ప. మరి ఇంతకీ అవి ఏంటి? వాటి పేరేంటి? ఇలాంటి కొన్ని వివరాలు తెలుసుకుందాం సరేనా! అయితే ఇంకెందుకాలస్యం ఈ కథనం చదివేయండి మరి.

ఈ వింత గుండ్లు కోస్టారికాలో కొలువుతీరి ఉన్నాయి. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 300 వరకు ఇలాంటి గుండ్లు ఉన్నాయి. వీటిని బోలాస్‌ డి పిడ్రా అని పిలుస్తారు. కోస్టారికా రాతి గోళాలు అని కూడా పేరు. వీటిలో కొన్ని డిక్విస్‌ డెల్టాలో ఉన్నాయి. మరికొన్ని ఓ చిన్న ద్వీపంలో దొరికాయి.

 టన్నులకు టన్నులే!

 ఈ రాతి గుండ్లు కొన్ని సెంటీమీటర్ల నుంచి 6.6 అడుగుల కంటే ఎక్కువ వ్యాసార్థంతోనూ ఉన్నాయి. బరువేమో అత్యధికంగా 15 టన్నుల వరకు ఉన్నాయి. ఇందులో కొన్ని బసాల్ట్‌ శిలలతో తయారైనవి. మరి కొన్ని సున్నపు, ఇసుక రాయితో తయారయ్యాయి.

మానవ నిర్మితాలా?!

కోస్టారికా రాతి గుండ్లు ప్రకృతి వల్ల ఏర్పడ్డాయా? లేక మానవ సృష్టా? అనే విషయం కచ్చితంగా తెలియదు. కానీ.. చాలా మంది పురావస్తు శాస్త్రవేత్తలు మాత్రం ఇవన్నీ మానవనిర్మితాలు అని భావిస్తున్నారు. క్రీస్తుపూర్వం 800 నుంచి 1500 సంవత్సరాల మధ్య వీటిని చెక్కి ఉంటారని నమ్ముతున్నారు. ఈ బండరాళ్లను ఇతర రాళ్లతో కొట్టి, ఆపై ఇసుకతో పాలిష్‌ చేయడం ద్వారా తయారు చేసి ఉండొచ్చని పరిశోధకులు ఓ అంచనాకు వచ్చారు.

1930లో మొదటిసారిగా..

ఈ రాతి గుండ్ల గురించి బాహ్యప్రపంచానికి మొదటిసారిగా 1930లోనే తెలిసింది. యునైటెడ్‌ అనే అమెరికన్‌ ఫ్రూట్‌ కంపెనీ అరటి తోటలు వేయడం కోసం అటవీ భూములను చదును చేస్తుండగా ఈ రాతి గుండ్లు కనిపించాయి. వాటిలో నిధులున్నాయన్న భ్రమతో చాలావాటిని కార్మికులు నాశనం చేశారు. ప్రభుత్వ అధికారుల జోక్యంతో మిగిలిన వాటిని సంరక్షించారు. ప్రస్తుతం వీటిని జాతీయసంపదగా గుర్తిస్తున్నారు. చాలా వరకు మ్యూజియాల్లో భద్రపరిచారు.

తప్పని గందర ‘గోళం’!

అసలు ఈ గోళాలను ఎందుకు ఉపయోగించారు అనేది ఇప్పటికీ పెద్ద మిస్టరీగానే ఉంది. కొందరేమో అలంకరణ కోసం వాడారు అని అభిప్రాయపడుతున్నారు. మరి కొందరేమో సౌరకుటుంబం మీద అంచనా కోసం తయారు చేశారు అని నమ్ముతారు. అయితే వీటిని కూలీలు కనుగొన్నప్పుడు... అసలైన స్థానాల నుంచి కదపడం వల్ల వీటి ఉపయోగం ఏంటో పరిశోధకులు నేటికీ కచ్చితంగా చెప్పలేకపోతున్నారు. అందుకే ఈ గోళాల సంగతి ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. నేస్తాలూ.. మొత్తానికి ఇవీ బోలాస్‌ డి పిడ్రా విశేషాలు. భలే ఉన్నాయి కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని