ఓ చిన్ని గేమ్‌ డెవలపర్‌..!

హాయ్‌ నేస్తాలూ..! మీలో ఎంతమందికి వీడియో గేమ్స్‌ ఆడటమంటే ఇష్టం అంటే.. ‘అలా అడుగుతారేంటి? మేము ఖాళీగా ఉంటే చాలు ఇంట్లో వాళ్ల ఫోన్‌ తీసుకొని గేమ్స్‌ ఆడుకుంటాం..!

Updated : 13 Jan 2024 05:10 IST

హాయ్‌ నేస్తాలూ..! మీలో ఎంతమందికి వీడియో గేమ్స్‌ ఆడటమంటే ఇష్టం అంటే.. ‘అలా అడుగుతారేంటి? మేము ఖాళీగా ఉంటే చాలు ఇంట్లో వాళ్ల ఫోన్‌ తీసుకొని గేమ్స్‌ ఆడుకుంటాం..! ఒక గేమ్‌ బోర్‌ కొట్టగానే.. ఎంచక్కా ఇంకోటి డౌన్‌లోడ్‌ చేసుకుని మరీ.. ఆడుకుంటాం’ అంటారు అంతే కదా..! కానీ మీలాంటి ఓ చిన్నారి ఆ గేమ్స్‌ని డెవలప్‌ చేస్తూ.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మరి తనెవరో? ఆ వివరాలేంటో తెలుసుకుందామా..!

కెనడాలోని బిమ్స్‌విల్లేకు చెందిన సిమర్‌ ఖురానాకు ప్రస్తుతం ఏడు సంవత్సరాలు. ఈ చిన్నారి ఏ విషయాన్నైనా చాలా బాగా గుర్తుపెట్టుకుంటుందట. తనకు కూడా మనలాగే వీడియో గేమ్స్‌ ఆడటమంటే చాలా ఇష్టం. అలా ఆడుతూ ఆడుతూ.. ఆమె సొంతంగా వీడియో గేమ్‌ రూపొందించాలని నిర్ణయించుకుంది. ‘సిమర్‌ యూట్యూబ్‌లో చూసి తనంతట తానే గణితం నేర్చుకుంది. ఎల్‌కేజీలో ఉన్నప్పుడే మూడో తరగతికి సంబంధించిన లెక్కలు అలవోకగా చేసేది. ఇంకా.. పేపర్లతో రకరకాల డిజైన్లు, గేమ్స్‌ చేస్తుండేది’ అని వాళ్ల నాన్న పారస్‌ చెబుతున్నారు.

ఇలా ఆలోచన..

వీడియో గేమ్‌ డెవలప్‌ చేయాలంటే.. కంప్యూటర్‌ భాష రావాలి కదా..! అందుకే కోడింగ్‌ కూడా నేర్చుకుంది మన సిమర్‌. వారంలో మూడు రోజులు తను కోడింగ్‌ తరగతులు వినేదట. ఇంతకీ తనకు వీడియో గేమ్స్‌ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చి ఉంటుందనే సందేహం మీకూ ఉంది కదూ.. ఒకసారి డాక్టర్‌ దగ్గరకు వెళ్లినప్పుడు.. జంక్‌ఫుడ్‌ ఆరోగ్యానికి మంచిది కాదని, మంచి ఆహారాన్నే తీసుకోవాలని ఆయన చెప్పారట. అప్పుడే తనకు దీనికి సంబంధించిన గేమ్‌ని డెవలప్‌ చేయాలనే ఆలోచన కలిగిందట. అలా తను పిల్లలు ఏ ఆహారాన్ని తీసుకోవాలి, ఏది తీసుకోకూడదు అనే అంశంతో గేమ్‌ని తయారు చేసిందటన్నమాట. తన ప్రతిభతో ప్రపంచంలోనే ‘యంగెస్ట్‌ వీడియోగేమ్‌ డెవలపర్‌’గా నిలిచింది. ‘గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’లోనూ స్థానం దక్కించుకుంది. స్కూల్‌ నుంచి వచ్చాక కోడింగ్‌ నేర్చుకుంటూనే.. జిమ్నాస్టిక్స్‌, కరాటే తరగతులకు వెళ్తుందట. మన సిమర్‌ భవిష్యత్తులో గేమ్‌ డెవలపర్‌గా మరిన్ని రికార్డులు సాధించాలని మనమూ ‘ఆల్‌ ది బెస్ట్‌’ చెప్పేద్దామా..!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని