బుడి బుడి అడుగుల బుడత... యోగాలో ఘనత!

హాయ్‌ నేస్తాలూ..! మీరు యోగా చేస్తారా? అని ఎవరైనా అడిగితే.. అమ్మో యోగా చేయడమా.. మా వల్ల కాదు అనేస్తాం. ఇంకొందరేమో.. హా! చేస్తాం అంటారు కానీ ఒకటీ రెండు వారాలకు మించి దాన్ని కొనసాగించరు..

Updated : 23 Jan 2024 06:20 IST

హాయ్‌ నేస్తాలూ..! మీరు యోగా చేస్తారా? అని ఎవరైనా అడిగితే.. అమ్మో యోగా చేయడమా.. మా వల్ల కాదు అనేస్తాం. ఇంకొందరేమో.. హా! చేస్తాం అంటారు కానీ ఒకటీ రెండు వారాలకు మించి దాన్ని కొనసాగించరు.. అంతే కదా! ఇప్పుడు ఈ యోగా విషయం ఎందుకబ్బా అనుకుంటున్నారా.. యోగా అనే పదానికి అర్థం కూడా తెలియని వయసులో.. ఓ బుడతడు చిన్నిచిన్ని యోగాసనాలు వేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. మరి తనెవరో ఆ వివరాలేంటో తెలుసుకుందామా..!

ర్ణాటకలోని కొప్పల్‌కు చెందిన రితిక్‌ రాజ్‌కు మూడు సంవత్సరాలు. ఇప్పుడిప్పుడే ప్లే స్కూల్‌కి వెళ్తున్నాడు. ‘అంత చిన్న పిల్లోడు.. సరిగ్గా మాటలు కూడా రావు. ఎవరైనా తినిపిస్తే గానీ తినలేడు. తనేం యోగా చేస్తాడు. అనుకుంటే పొరబడినట్లే నేస్తాలూ..! ఎందుకంటే తను నిజంగానే యోగా చేస్తున్నాడు. కేవలం నాలుగు నిమిషాల 31 సెకన్లలోనే 52 యోగాసనాలు వేశాడు.

ఉత్సాహంగా..

ఉదయం ఒక పది నిమిషాల ముందు నిద్ర లేచి స్కూల్‌కి వెళ్లడానికే బద్ధకిస్తారు చాలామంది పిల్లలు. కానీ ఈ బుడతడు మాత్రం ఉదయం 6 గంటలకే నిద్ర లేచి.. యోగా చేయడం ప్రారంభిస్తాడట. తన ప్రతిభను గుర్తించిన ‘ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’ వారు ‘వన్స్‌ ఇన్‌ ఏ మిలియన్‌’ విభాగంలో చోటు కల్పించారు. ఇంకా.. ‘కర్ణాటక ఎచీవర్స్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’ అవార్డును కూడా అందుకున్నాడు. ఇంకో విషయం ఏంటంటే.. తన జ్ఞాపకశక్తితో సంవత్సరం వయసు ఉన్నప్పుడే.. రకరకాల పండ్లు, జంతువులు, 60 రకాల వస్తువులు, 8మంది జాతీయ నాయకులను గుర్తించి ‘ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో చోటు దక్కించుకున్నాడు. ఎంతైనా ఈ చిన్నారి గ్రేట్‌ కదూ.. మరి మనమూ యోగా చేయడం అలవాటు చేసుకుందామా..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని