మార్షల్‌ ఆర్ట్స్‌తో.. పతకాల పంట..!

హాయ్‌ నేస్తాలూ..! ఏదైనా ఒక విభాగంలో ఒక రెండు మూడు పతకాలు సాధిస్తేనే.. వాళ్లని ఆకాశానికి ఎత్తేస్తాం! మన పొగడ్తలతో కృతజ్ఞతలు తెలియజేస్తాం.

Updated : 10 Feb 2024 05:03 IST

హాయ్‌ నేస్తాలూ..! ఏదైనా ఒక విభాగంలో ఒక రెండు మూడు పతకాలు సాధిస్తేనే.. వాళ్లని ఆకాశానికి ఎత్తేస్తాం! మన పొగడ్తలతో కృతజ్ఞతలు తెలియజేస్తాం. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే అమ్మాయి మాత్రం పదుల సంఖ్యలో పతకాలు సాధించి.. ప్రపంచ గుర్తింపు పొందింది. మరి తనెవరో ఆ వివరాలేంటో తెలుసుకుందామా..!

మ్ము-కశ్మీర్‌కు చెందిన షేక్‌ నజ్మ్‌ బిలాల్‌కు పదిహేను సంవత్సరాలు. ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతోంది. సాధారణంగా అయితే చాలా మంది పిల్లలు మార్షల్‌ ఆర్ట్స్‌ అనగానే ‘అమ్మో! మా వల్ల కాదు. ఇంకేదైనా నేర్చుకుంటాం’ అనేస్తారు. కానీ ఈ అమ్మాయి మాత్రం.. మార్షల్‌ ఆర్ట్స్‌లో తన ప్రతిభ చూపిస్తూ.. పతకాల మీద పతకాలు సాధిస్తోంది. ఇతర దేశాల్లో నిర్వహించిన పోటీల్లో కూడా పాల్గొని ఆమె సత్తా చాటుకుంది. అంతే కాకుండా ప్రస్తుతం సమాజంలో ఉన్న పరిస్థితులకు.. పిల్లలకు ఈ విద్య ఎంత అవసరమో కూడా చాలా చక్కగా వివరిస్తోంది. తను చిన్న వయసులో ఉన్నప్పటి నుంచే.. మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకోవడం ప్రారంభించిందట. దానికి సంబంధించి జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో కూడా పాల్గొంటోందట.  

పోటీల్లోనే కాకుండా..!

మన బిలాల్‌ తనకు వచ్చిన విద్యను పోటీల్లో పాల్గొనడానికి, పతకాలు సాధించడానికి మాత్రమే అంకితం చేయలేదు నేస్తాలూ..! రిఫరీగా కూడా పని చేస్తుంది. ఇంకో విషయం ఏంటంటే.. తను మన దేశంలోనే ‘యంగెస్ట్‌ రిఫరీ’గా అవార్డు దక్కించుకుంది. అంతర్జాతీయ స్థాయిలో 5, జాతీయ స్థాయిలో 9, జిల్లా స్థాయిలో 35 బంగారు పతకాలు సొంతం చేసుకుంది బిలాల్‌. మార్షల్‌ ఆర్ట్స్‌ విభాగంలో నిర్వహించిన మాస్టర్స్‌ కప్‌-2017లో విజేతలుగా నిలిచిన వాళ్లలో తనే అతి చిన్న వయస్కురాలట. ఇంతటి ప్రతిభ సాధించిన మన బిలాల్‌ను ‘ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’ వారు గుర్తించి ‘వన్స్‌ ఇన్‌ ఎ మిలియన్‌’ అవార్డును అందించారు. ఎంతైనా బిలాల్‌ చాలా గ్రేట్‌ కదూ..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని