పాటతో సాధించింది..!

హాయ్‌ నేస్తాలూ..! ఒక్కోసారి మనకు పాటలతోనే రోజు ప్రారంభమవుతుంది. ప్రతిరోజూ ఏదో ఒక విధంగా ఒక్కసారైనా పాటలు వింటూనే ఉంటాం అంతే కదా..! ఇంతకీ ఇప్పుడు ఈ పాటల గోలేంటి అనుకుంటున్నారా? ఈ మధ్య ఎక్కువగా పాప్‌ మ్యూజిక్‌ ప్రాచుర్యంలోకి వస్తోంది కదా..!

Updated : 13 Feb 2024 06:47 IST

హాయ్‌ నేస్తాలూ..! ఒక్కోసారి మనకు పాటలతోనే రోజు ప్రారంభమవుతుంది. ప్రతిరోజూ ఏదో ఒక విధంగా ఒక్కసారైనా పాటలు వింటూనే ఉంటాం అంతే కదా..! ఇంతకీ ఇప్పుడు ఈ పాటల గోలేంటి అనుకుంటున్నారా? ఈ మధ్య ఎక్కువగా పాప్‌ మ్యూజిక్‌ ప్రాచుర్యంలోకి వస్తోంది కదా..! అందులోనే ఓ చిన్నారి రికార్డు సృష్టిస్తోంది. మరి తనెవరో ఆ వివరాలేంటో తెలుసుకుందామా!

కేరళలోని తిరువనంతపురానికి చెందిన నిట్‌జా జోయిస్‌ జోయన్‌కు పన్నెండు సంవత్సరాలు. ప్రస్తుతం ఆరో తరగతి చదువుతోంది. సహజంగానే మనకు చదువుతో పాటు ఇతర అంశాల మీద కూడా ఆసక్తి ఉంటుంది. కానీ వాటి మీద సరిగ్గా శ్రద్ధ పెట్టలేం. మన జోయన్‌ మాత్రం అలా కాకుండా.. పాటల మీద తనకున్న ఇష్టంతో చిన్న వయసు నుంచే.. పాప్‌ మ్యూజిక్‌ నేర్చుకోవడం ప్రారంభించింది. ఇప్పుడు తన ప్రతిభతో రికార్డుల మీద రికార్డులు సాధించి.. అందరి మన్ననలు పొందుతోంది.

ఆసక్తితోనే..

ఏ పనైనా మనం చేస్తూ ఉంటే అలవాటు అవుతుంది అంటారు కదా..! అచ్చంగా అలానే.. మన జోయన్‌ కూడా పాటలు వింటూ.. పాడుతూ ఉండేదట. అలా కొద్దిరోజుల తర్వాత సంగీతం మీద ఇష్టంతో తరగతుల్లో చేరిందట. అతి తక్కువ కాలంలోనే ప్రదర్శనలు ఇస్తూ.. పోటీల్లో కూడా పాల్గొందట. ఇంగ్లిష్‌, కొరియన్‌, జపనీస్‌ భాషల్లో 37 పాప్‌ పాటలు కేవలం 2గంటల 11 నిమిషాల్లో పాడి రికార్డు సృష్టించింది. అతి తక్కువ సమయంలో ఎక్కువ పాప్‌ సాంగ్స్‌ పాడి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంకో విషయం ఏంటంటే.. ఎక్కువ పాప్‌ సాంగ్స్‌ పాడిన అతి చిన్నవయస్కురాలిగా పేరు కూడా దక్కించుకుంది. ప్రతిభ కనబర్చడానికి వయసుతో సంబంధం లేదని నిరూపించింది. ఆమె టాలెంట్‌ని గుర్తించిన.. ‘వరల్డ్‌ వైడ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’, ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’, ‘ఏషియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’ వారు వాటిలో స్థానం కూడా కల్పించారు. తను ఇలాగే మరిన్ని పాటలు పాడుతూ అందరినీ అలరించాలని మనమూ ‘ఆల్‌ ది బెస్ట్‌’ చెప్పేద్దామా..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని