పలకరింపే... బంధానికి పునాది!

అదొక అందమైన పూల తోట. ఆ తోటలో ముద్దబంతి, గులాబీ, మల్లె, చామంతి, సన్నజాజి లాంటి పూల మొక్కలు ఎన్నో ఉన్నాయి. ప్రతి రోజూ పూసే పూలు, తమ పరిమళాలతో ఆ తోటను అందంగా, శోభాయమానంగా చేస్తున్నాయి. రోజూలాగే ఆరోజు కూడా మొక్కలన్నీ పువ్వులతో అందంగా పరిమళించాయి.

Published : 11 Mar 2023 00:37 IST

దొక అందమైన పూల తోట. ఆ తోటలో ముద్దబంతి, గులాబీ, మల్లె, చామంతి, సన్నజాజి లాంటి పూల మొక్కలు ఎన్నో ఉన్నాయి. ప్రతి రోజూ పూసే పూలు, తమ పరిమళాలతో ఆ తోటను అందంగా, శోభాయమానంగా చేస్తున్నాయి. రోజూలాగే ఆరోజు కూడా మొక్కలన్నీ పువ్వులతో అందంగా పరిమళించాయి. అయితే గులాబీ మొక్కకు మాత్రం ఒక్క పువ్వు కూడా పూయలేదు. తోటలోని మొక్కలన్నీ సంతోషంగా ఉంటే, గులాబీ మాత్రం విచారంగా ఉండటాన్ని పక్కనే ఉన్న ముద్దబంతి మొక్క గమనించింది. ‘మిత్రమా.. ఎందుకు దిగులు పడుతున్నావు?’ అని అడిగింది. ‘ఈ రోజు నాకు ఒక్క పువ్వు కూడా పూయలేదు.. అందుకే ఈ దిగులు’ అంటూ బాధగా బదులిచ్చింది గులాబీ. ‘అది నీ తప్పు కాదు కదా..’ అని ఓదార్పుగా అంది ముద్దబంతి. ‘కాకపోవచ్చు.. కానీ ప్రతి రోజూ మనతో ముచ్చటగా మాట్లాడేందుకు తుమ్మెదలు వస్తుంటాయి. ఈరోజు ఒక్క పువ్వు కూడా పూయని నన్ను చులకనగా చూస్తాయి. అసలు నా వైపునకే రావు. ఒక్క మాట కూడా మాట్లాడవు. రోజూ వచ్చి పలకరించే అతిథులు, పరిచయం లేనట్టుగా.. పట్టించుకోకుండా వెళ్లిపోతాయని బాధగా ఉంది మిత్రమా’ విచారంగా అంది గులాబీ.

గులాబీ మొక్క చెప్పిన మాటలు విని ముద్దబంతి మొక్క చిన్నగా నవ్వింది. ‘నా బాధ నీకు నవ్వులాటగా ఉందా?’ అంటూ కొంచెం కోపంగా అడిగింది గులాబీ. ‘కోపం వద్దు మిత్రమా. నీ ఆలోచన నాకు నవ్వు తెప్పించింది. ఒక్కటి గుర్తు పెట్టుకో.. మన మంచి ఆలోచనలే మనకు మిత్రులు. చెడు ఆలోచనలు శత్రువులు. అనవసరంగా దిగులు పడకు.. తుమ్మెదలు నీతో కూడా మాట్లాడతాయి.. చూస్తూ ఉండు’ అని భరోసాగా అంది ముద్దబంతి. ‘నాకు ఆ నమ్మకం లేదు’ నిట్టూరుస్తూ అంది గులాబీ. అంతలోనే తుమ్మెదలన్నీ ఆ తోటలోకి ఎగురుకుంటూ వచ్చాయి. పువ్వులతో పరిమళించిన మొక్కలను చూసి పలకరించసాగాయి. ‘మిత్రులారా.. మీరంతా ప్రకృతి అందాన్ని పెంచుతున్నారు. మాకు ఆహారాన్ని ఇస్తున్నారు. మీ రుణం తీర్చుకోలేనిది’ అంటూ తుమ్మెదలు తోటలోని మొక్కలపై వాలుతూ మాట్లాడుతున్నాయి.

గులాబీ ఊహించినట్లు.. ఏ తుమ్మెదా తన వైపు రాకపోయేసరికి, ‘నేను చెప్పాను కదా..’ అని దిగులుగా ముద్దబంతితో అంటుండగానే.. ఒక తుమ్మెద వచ్చి ఆ గులాబీ మొక్కపైన వాలింది. ‘మిత్రమా.. ఎలా ఉన్నావు?’ అంటూ ఆప్యాయంగా పలకరించింది. అది అలా అడగ్గానే.. గులాబీ ముందు ఆశ్చర్యపోయింది. ఆపై ఆనందిస్తూ తుమ్మెదతో.. ‘పువ్వులు లేకపోవడంతో నా దగ్గరకు రారనుకున్నాను. నన్ను అసలు పలకరించనని అనుకున్నాను. ఒక చక్కని పలకరింపు ఆనందాన్ని పంచుతుంది. అనుబంధాలను పెంచుతుంది. స్నేహాన్ని చిగురింపజేస్తుంది. మాట చిన్నదే కానీ దాని ఫలితం గొప్పది. ఆప్యాయంగా పలకరించిన నీకు హృదయపూర్వక కృతజ్ఞతలు’ అంది సంతోషంగా గులాబీ.

అప్పుడు ‘ధన్యవాదాలు మిత్రమా.. అయితే నువ్వు నాకు చెప్పిన కృతజ్ఞతలన్నీ.. నీ పక్కనున్న ముద్దబంతికే చెందుతాయి’ అందా తుమ్మెద. ‘ఎందుకు?’ అంటూ ఆశ్చర్యంగా అడిగింది గులాబీ మొక్క. ‘‘కొన్ని రోజుల క్రితం మా అలవాటులో భాగంగా ఈ తోటలోకి ఎగురుకుంటూ వచ్చాం. కానీ ఒక్క పువ్వు కూడా పూయలేదన్న కారణంతో ముద్దబంతిని పట్టించుకోకుండా, కనీసం పలకరించకుండా తిరిగి వెళ్లిపోబోయాం. ఇంతలో ముద్దబంతి మొక్క నన్ను పిలిచింది. నేను మాత్రం దాని కొమ్మల మీద వాలకుండానే.. ఎందుకు పిలిచావన్నట్టు అసహనంగా చూశాను. అప్పుడు అది.. ఆనందంగా ఉన్నప్పుడు పలకరించకపోయినా ఫర్వాలేదు. కానీ, బాధగా ఉన్నప్పుడు.. రోజూ వచ్చి మాట్లాడేవారు కూడా కనీసం పట్టించుకోకుండా,  ఏమీ తెలియనట్టుగా వెళ్లిపోవడం భావ్యం కాదు. అవసరం కోసం వచ్చి పలకరించడం స్నేహం అనిపించుకోదు. పరిచయం అయిన ప్రతి ఒక్కరినీ.. మళ్లీ ఎదురైనప్పుడు ఆప్యాయంగా పలకరించాలి. వారి సంతోషాన్ని పెంచాలి. బాధను పంచుకోవాలి. అప్పుడే స్నేహం చిగురిస్తుంది. బంధమై పరిమళిస్తుంది. రోజులన్నీ ఒకేలా ఉండవు. మా మొక్కలు ఒక్కో రోజు ఒక్క పువ్వు కూడా పూయలేకపోవచ్చు. ఇంకో రోజు ప్రతి కొమ్మకో పువ్వు ఉండొచ్చు. పుష్పాలున్నప్పుడు ఎలాగైనా వస్తారు కానీ, లేనప్పుడే పట్టించుకోవాలి. చక్కగా పలకరించాలి. మీ పలకరింపే.. రేపటి మా చిగురింపునకు కారణం కావాలి. ఇప్పుడు నేను బాధ పడినట్లుగా మరో మొక్క బాధ పడకూడదని ఇదంతా చెబుతున్నాను. మీ తుమ్మెదలకు ఇది నా మాటగా చెప్పు’’ అని ముద్దబంతి నాతో అంది.

ఆ మాటలతో మాలో మార్పు మొదలైంది. ఆ రోజే నేను ఏ పువ్వూ పూయని మొక్కనే మొదటగా పలకరించాలని నిర్ణయించుకున్నాను. అందుకే ఈరోజు ఏ పుష్పం పూయని నీ దగ్గరకు వచ్చా.. పలకరించా.. స్నేహాన్ని కొనసాగిస్తున్నాను. ఇక వెళ్లివస్తా మిత్రమా’ అంటూ తుమ్మెద తుర్రుమంది. తుమ్మెద మాటలతో ముద్దబంతి వైపు సంతోషంగా చూసింది గులాబీ. మనసారా ధన్యవాదాలు తెలియజేసింది.

 కె.వి.లక్ష్మణరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు