అక్కడ అలా... ఇక్కడ ఇలా..!

మంకీ, పింకీ అనే రెండు కోతులు మంచి స్నేహితులు. ఒక రోజు అవి అడవి నుంచి సమీప గ్రామానికి వెళ్లాయి. అక్కడ వాటికి మైదానంలో ఆడుకుంటున్న పిల్లలు కనపడ్డారు.

Updated : 28 Mar 2023 03:42 IST

మంకీ, పింకీ అనే రెండు కోతులు మంచి స్నేహితులు. ఒక రోజు అవి అడవి నుంచి సమీప గ్రామానికి వెళ్లాయి. అక్కడ వాటికి మైదానంలో ఆడుకుంటున్న పిల్లలు కనపడ్డారు. ఆటల అనంతరం పిల్లలంతా దగ్గరలోని దుకాణంలో తినుబండారాలు కొనుక్కున్నారు. ఆ తర్వాత వారంతా ఒకచోట కూర్చొని వాటిని తినసాగారు. మంకీ, పింకీ చెట్టు పైనుంచి ఆసక్తిగా వారినే గమనించసాగాయి.

కోతులను చూసిన పిల్లలు కొన్ని పదార్థాలను పక్కనే ఉన్న రాయిపై పెట్టారు. మంకీ, పింకీ పరుగున వెళ్లి వాటి రుచి చూశాయి. అవి వాటికి ఎంతో నచ్చాయి. అంత రుచికరమైన పదార్థాలను అవి జీవితంలో చూడలేదు, తినలేదు. కొన్ని తినుబండారాలు ఉప్పఉప్పగా.. మరికొన్ని కారంకారంగా ఉన్నాయి. ఇంకొన్ని తింటుంటే కరకరలాడుతున్నాయి. తియ్యనివీ ఉన్నాయి. పుల్ల ఐస్‌ నోటికి చల్లగా తగిలింది. మంకీ, పింకీలకు అవన్నీ బాగా నచ్చాయి.

అడవిలో పండ్లు, దుంపలు తప్ప మరే రుచీ వాటికి తెలియదు. మొదటిసారిగా పిల్లలు ఇచ్చిన పదార్థాలు వాటికి బాగా నచ్చాయి. వాటి పేర్లేంటని మంకీ, పింకీలు అడగటంతో.. చిప్స్‌, ఐస్‌ క్రీం, కేక్‌ అని చెప్పారా పిల్లలు. అడవిలో తమ స్నేహితులకు కూడా కొన్ని కావాలని అడగ్గా వారంతా సంతోషంగా ఇచ్చారు. పిల్లల దగ్గర సెలవు తీసుకొని, అవి అడవికి బయలుదేరాయి. అడవికి వెళ్లిన మంకీ, పింకీ స్నేహితులకు కబురు చేశాయి. మిగతా కోతులు రాగానే తాము తెచ్చిన తినుబండారాలను ఇచ్చాయి. అవి కూడా రుచి చూసి బాగున్నాయని సంతోషం వ్యక్తం చేశాయి.

‘ఈ పదార్థాలు బాగున్నాయి.. ఎక్కడ నుంచి తెచ్చారు’ అని కోతులు ప్రశ్నించాయి. పక్క గ్రామం పిల్లలు ఇచ్చారని మంకీ, పింకీ చెప్పాయి. ‘మనకు అడవిలో పండ్లు, దుంపలు తినీ తినీ విసుగు పుట్టింది. మనం కూడా గ్రామానికి వెళ్లి వాటిని తెచ్చుకుందాం’ అని మిగతా కోతులు అన్నాయి. ఇంతలో ఒక కోతి.. ‘అక్కడ మనకు తినుబండారాలు ఎవరిస్తారు?’ అని ప్రశ్నించింది. ‘తినుబండారాలు కావాలంటే డబ్బులు కావాలి. అవి ఉంటేనే దుకాణం యజమాని ఇస్తాడు. మన దగ్గర లేవుగా’ అంది మరో కోతి.

‘మనకు తినుబండారాలు ఉచితంగా ఎవరిస్తారు?’ అని ప్రశ్నించింది మరో కోతి. మంకీ, పింకీ కూడా ఆలోచనలో పడ్డాయి. ఇంతలో ఒక కోతి.. ‘అడవిలో దొరికే పండ్లు, దుంపలు, తేనె పిల్లలకు ఇచ్చి వారి వద్ద తినుబండారాలు అడుగుదాం’ అంది. ఈ ఆలోచన కోతులన్నింటికీ నచ్చింది. వెంటనే ఒక నిర్ణయానికి వచ్చాయి.
క్షణం కూడా వృథా చేయకుండా పండ్లు, దుంపలు, తేనె సేకరణ కోసం పరుగులు తీశాయి. కొన్ని కోతులు దుంపలు, పండ్లు సేకరించాయి. మరికొన్ని పెద్దపెద్ద ఆకులను పొట్లాల్లా చుట్టి తేనెను పట్టాయి. ఇంకేముంది.. కోతులన్నీ వాటిని తీసుకొని గ్రామం బాట పట్టాయి. అనంతరం మైదానానికి చేరుకున్నాయి. కోతుల రాకతో మైదానంలో సందడి నెలకొంది. పిల్లలు ఆటలు మానేసి కోతులను చూసేందుకు ఉత్సాహం చూపారు. మంకీ, పింకీ తమకు తినుబండారాలు ఇచ్చిన పిల్లలను గుర్తించాయి. వారిని దగ్గరకు రమ్మన్నాయి. పెద్ద సంఖ్యలో వచ్చిన కోతులను చూసిన పిల్లలు మొదట భయపడ్డారు.

మంకీ, పింకీ ధైర్యం చెప్పటంతో పిల్లలు దగ్గరకు వచ్చారు. కోతుల చేతుల్లో పండ్లు, దుంపలు చూశారు. ఎవరి కోసం తెచ్చారని ప్రశ్నించారు. మీ కోసమేనని చెప్పటంతో పిల్లలంతా కేరింతలు కొట్టారు. కోతులు తాము తెచ్చిన వాటిని పిల్లలకు అందించాయి. వారు పండ్లు, దుంపలు రుచి చూసి బాగున్నాయని చెప్పారు. తేనె రుచి చూసిన పిల్లలు లొట్టలు వేశారు. ‘పండ్లు, దుంపలు, తేనె రుచి బాగుంది. ఎప్పుడూ ఇలాంటి రుచికరమైన వాటిని తినలేదు’ అని కోతులతో చెప్పారు. మీకు నచ్చితే ప్రతిరోజూ తెస్తామని చెప్పాయి. పిల్లలంతా కావాలంటూ పెద్దగా అరిచారు. అయితే ఓ షరతు అని కోతులు అన్నాయి.  

ఏంటో చెప్పమన్నారు పిల్లలు. కేకులు, పుల్ల ఐస్‌, చిప్స్‌ కావాలని అడిగాయి. పిల్లలు తమ దగ్గరున్న చిల్లర డబ్బులతో దుకాణంలో కొని కోతులకు ఇచ్చారు. అవి తింటూ కోతులన్నీ గాల్లో తేలుతున్నట్లు ఊహించుకోసాగాయి. ఇలా ప్రతిరోజు కోతులు పండ్లు, దుంపలు, తేనె తెచ్చి పిల్లలకు ఇచ్చేవి. పిల్లలు కూడా దుకాణంలో కొనుగోలు చేసిన వాటిని కోతులకు ఇచ్చేవారు. ఆ తర్వాత పిల్లలు ఇళ్లకు, కోతులు అడవికి వెళ్లేవి.

ఇలా కొద్ది రోజులు గడిచాయి. ఒకరోజు అడవిలోని కోతులకు అనారోగ్యం కలిగింది. కడుపులో మంట, అజీర్తి, గొంతు నొప్పి, జలుబుతో బాధపడ్డాయి. చివరకు పసరు మందు ఇచ్చే ఎలుగుబంటిని ఆశ్రయించాయి. కోతులకు అనారోగ్యం ఎందుకు కలిగిందో దానికి అర్థం కాకపోవడంతో గట్టిగా ప్రశ్నించింది. పండ్లు, దుంపలు, తేనె పిల్లలకు ఇచ్చి, వారి వద్ద నుంచి తినుబండారాలు తీసుకుంటున్నట్లు వివరించాయి.

మసాలా కలిపిన చిరుతిండ్లు తినటమే కడుపుమంట, అజీర్తికి కారణమని ఎలుగుబంటి చెప్పింది. అలాగే ఐస్‌లు, కేకులు తినటం వల్ల గొంతునొప్పి, జలుబు చేసిందని వివరించింది. ఇకపై పిల్లలు ఇచ్చిన తినుబండారాలు తీసుకోవద్దని, అవి ఆరోగ్యానికి హాని చేస్తాయని హెచ్చరించింది.  

ఎలుగుబంటి మాటలతో కోతులు ఆలోచనలో పడ్డాయి. ఇకపై పిల్లలు ఇచ్చే తినుబండారాలు తీసుకోకూడదని ఓ నిర్ణయానికొచ్చాయి. ఎలుగుబంటి ఆకుపసరు తెచ్చి కోతులతో తాగించింది. కడుపునొప్పి, అజీర్తి, గొంతునొప్పి, జలుబు తగ్గటంతో ఊపిరి పీల్చుకున్నాయవి.

మంకీ, పింకీ ఎలుగుబంటితో మాట్లాడుతూ.. 

‘మా వల్లే మిగతా కోతులకు అనారోగ్యం కలిగింది. దీనికి పూర్తి బాధ్యత మాదే. అయితే... మాకో అనుమానం ఉంది. మాకు ఇచ్చిన తినుబండారాలను పిల్లలు రోజూ తింటున్నారు. మరి వారికేం కాదా!’ అని ప్రశ్నించాయి. దానికి ఎలుగుబంటి.. ‘మసాలా కలిపిన తినుబండారాలు ఎవరు తిన్నా అనారోగ్యమే.. పిల్లలు తెలియక తింటున్నారు.. తల్లిదండ్రులు తెలిసి కొని పెడుతున్నారు. చల్లటి పదార్థాలు కూడా హానికరమే. పిల్లలు మసాలా పదార్థాలకు దూరంగా ఉండేలా తల్లిదండ్రులు చూడాలి. ప్రకృతి ఇచ్చే పండ్లు, దుంపలు, తేనె, ఇతరత్రా తీసుకుంటే కలిగే లాభాలను కూడా తల్లిదండ్రులు పిల్లలకు వివరించాలి’ అంది.

మంకీ, పింకీ.. ‘ఆ పని మనమే చేస్తే ఎలాగుంటుంది?’ అన్నాయి. ఈ సూచన అందరికీ నచ్చింది. మర్నాడు కోతులన్నీ ఎలుగుబంటిని తీసుకుని పిల్లల దగ్గరకు వెళ్లాయి. ఎలుగుబంటి పిల్లలను ఉద్దేశించి మసాలా పదార్థాలు తినటం వల్ల కలిగే నష్టాలను వివరించింది. అలాగే అవి తిని కోతులు అనారోగ్యం బారిన పడిన విషయాన్నీ వివరించింది. పుల్ల ఐస్‌లు అపరిశుభ్ర నీటితో తయారు చేస్తారనీ, వాటిని తినటం మానుకోవాలని సూచించింది. పిల్లల్లో కూడా ఆలోచన కలిగింది. మరెప్పుడూ మసాలా పదార్థాలు, పుల్ల ఐస్‌ల జోలికి వెళ్లమని ఎలుగుబంటికి మాటిచ్చారు.

తమ్మవరపు వెంకట సాయి సుచిత్ర


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు