తాబేలు కోరిక!

అనగనగా ఒక అడవి. ఆ అడవిలో కోతి, తాబేలు స్నేహంగా ఉండేవి. కోతి చాలా మంచిది. ఏ జీవి ఆపదలో ఉన్నా, వెంటనే వెళ్లి సహాయం చేసేది. తన ఇంటికి వచ్చిన అతిథులకు కచ్చితంగా భోజనం పెట్టే పంపేది.

Published : 20 Mar 2023 01:02 IST

నగనగా ఒక అడవి. ఆ అడవిలో కోతి, తాబేలు స్నేహంగా ఉండేవి. కోతి చాలా మంచిది. ఏ జీవి ఆపదలో ఉన్నా, వెంటనే వెళ్లి సహాయం చేసేది. తన ఇంటికి వచ్చిన అతిథులకు కచ్చితంగా భోజనం పెట్టే పంపేది. కానీ, తాను చేసిన సహాయాన్ని మాత్రం ఎవరికీ చెప్పేది కాదు. ఒకరోజు తాబేలు, కోతి సరదాగా మాట్లాడుకుంటుండగా.. మర్రిచెట్టు పైనున్న కాకి గూటిలోంచి ఏదో మూలుగుతున్న శబ్దం వినిపించింది. గాయపడిన కోకిల ఒకటి, ముందురోజు నుంచి ఆ గూటిలోనే ఉండిపోయింది. దాని రెక్కలకు గాయం కావడంతో ఆహారం కోసం కూడా బయటికి వెళ్లలేకపోయింది. ఆ విషయం తెలుసుకున్న కోతి.. వెంటనే జామ చెట్టు దగ్గరికి వెళ్లింది. రెండు బాగా పండిన పండ్లను కోసుకెళ్లి కోకిలమ్మకు అందించింది. ఆకు పసరు రాసి గాయానికి కట్టుకట్టింది. కోకిల చాలా సంతోషించి.. కోతికి నమస్కరించింది.

మరుసటి రోజు తాబేలు ఆయాస పడుతూ వచ్చి.. ‘మిత్రమా..! నేను నివసించే కొలను అవతలి ఒడ్డున మొసలి రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. ఆహారానికి కూడా బయటకు రావడం లేదు’ అంది. కోతి వెంటనే కొన్ని పండ్లు కోసి, బుట్టలో సర్దింది. ‘మిత్రమా.. ఈ పండ్లు తీసుకెళ్లి మొసలికి ఇచ్చి వద్దాం పద’ అని తాబేలుతో అంది. దాని వీపు మీద కూర్చొని అవతల ఒడ్డుకి ప్రయాణించి, మొసలికి నేరేడు పండ్లు తినిపించింది కోతి. అవి తిన్నాక.. మొసలి కాస్త ఓపిక తెచ్చుకుంది. అది కోతికి కృతజ్ఞతలు చెప్పింది. ‘మిత్రమా.. నువ్వు చాలా మంచిదానివి. ఇతరులు ఏ కష్టంలో ఉన్నా ఆదుకుంటావని తాబేలు ఎప్పుడూ చెబుతుంటుంది. ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాను’ అంటూ దండం పెట్టింది మొసలి.

తన మిత్రుడు కోతి చేసే మంచి పనుల గురించి మృగరాజు సింహానికి చెప్పి, కానుకలు ఇప్పించాలనుకుంది తాబేలు. ఒకరోజు మృగరాజు నీళ్లు తాగేందుకు చెరువు వద్దకు వచ్చింది. దాని కాలికి ముల్లు గుచ్చుకొని బాధపడసాగింది. అదే సరైన సమయమని భావించిన తాబేలు.. ‘మృగరాజా! నా మిత్రుడు కోతి ఏమీ ఆశించకుండా ఇతరులకు ఎంతో కాలంగా సహాయం చేస్తుంది. కానీ, తాను చేసిన సహాయాన్ని ఎవరికీ చెప్పదు. బయటకు తెలియనివ్వదు. ఇతరుల నుంచి కూడా ఏమీ ఆశించదు. కోతి సేవలను మీరు గుర్తించి, అభినందిస్తే చూడాలని మిత్రుడిగా నా కోరిక’ అంది తాబేలు. ‘ఓహో.. అలాగా.. అయితే నా కాలికి ముల్లు గుచ్చుకుందని చెప్పు’ అంది సింహం. తాబేలు వెంటనే కోతిని కలిసి విషయం చెప్పింది. కోతి వెంటనే ఎండిన ఒక ముల్లు తీసుకొని, తాబేలుతో కలిసి చెరువుకు చేరుకుంది.

నొప్పితో విలవిల్లాడుతూ అక్కడే ఉన్న మృగరాజుకి నమస్కరించింది. సింహం కాలికి గుచ్చుకున్న ముల్లును మరో ముల్లుతో బయటకు తీసింది. మృగరాజు, కోతిని అభినందిస్తూ.. ‘మిత్రమా.. ముల్లును ముల్లుతోనే తీయాలనే సూత్రాన్ని బాగా ఉపయోగించావు. ధైర్యంగా వచ్చి నా కాలికి గుచ్చుకున్న ముల్లును తీశావు’ అంది. ‘ధన్యవాదాలు మృగరాజా’ అంది కోతి. ‘మిత్రమా.. మీరిద్దరూ రేపు మా గుహకు వచ్చి కనిపించండి’ అంది సింహం. మర్నాడు కోతి, తాబేలు గుహకు చేరుకున్నాయి. మృగరాజు గుహ ఎంతో అందంగా ఉంటుందని వినడమే కానీ ఏనాడూ చూసే అవకాశం రాలేదు. సింహం తన గుహను మొత్తం దగ్గరుండి వాటికి చూపించింది. చక్కటి ఆతిథ్యంతో కడుపు నిండా తిండి పెట్టింది. ‘మిత్రమా.. నువ్వు ఇతరులకు చేస్తున్న సేవల గురించి నీ మిత్రుడు తాబేలు చెప్పగా విన్నాను. నిన్న నా విషయంలో కూడా ఎంతో వేగంగా స్పందించావు. నువ్వు అంత మంచి చేసినా, ప్రచారం చేసుకోవని విన్నాను. నిజమేనా?’ అని అడిగింది సింహం.

కోతి, తనమిత్రుడు తాబేలు వైపు చూసి.. మృగరాజుతో, ‘అవును ప్రభూ!’ అంది. ‘నిజానికి నీలాంటి వారిని గుర్తించినప్పుడు.. ఒక వేదిక మీద వేడుక నిర్వహిస్తుంటాం. అన్ని జీవుల ముందు సన్మానిస్తాం. అటువంటి కార్యక్రమాలతో వారు మరింత బాధ్యతగా సేవచేస్తారనీ, అది చూసి మరో నలుగురు స్ఫూర్తి పొందుతారని నా ఉద్దేశం’ అంది సింహం. ‘ప్రభూ.. కష్టాల్లో ఉన్నవారికి సాయం చేయడం మాత్రమే నాకు తెలుసు.. నేను ఎవరికి సహాయం చేసినా, చెప్పుకొనే అలవాటు లేదు. ఎందుకంటే అతి నాకు సంతోషం కలిగించినా, సాయం పొందిన వారికి అవమానంగా అనిపించవచ్చు’ అంది కోతి. ఆ మాటతో తన మిత్రుడు చేసే సహాయాన్ని ఇతరులకు ఎందుకు తెలియనివ్వడో అర్థం చేసుకుంది తాబేలు. సింహం కూడా కోతి ఆలోచనను మెచ్చుకుంది.

‘గాలి కంటికి కనిపించకుండా ప్రాణాలను కాపాడుతుంది. నేను చేసే సహాయం కూడా అలాగే ఎవరికీ కనబడకున్నా.. ఇతరుల కష్టాలను తీరుస్తుంది. అది నాకు ఆనందాన్నిస్తుంది. మనసుకు సంతృప్తినిస్తుంది’ అంది కోతి. మృగరాజు ఎంతో సంతోషించి.. ‘మిత్రమా.. నీ సహాయ గుణాన్ని ఇలాగే కొనసాగించు. ఎటువంటి సహకారం కావాలన్నా రాజుగా నేను అందిస్తాను’ అంటూ అభయం ఇచ్చింది. ఆ మాటలు కోతిలో ఉత్సాహాన్ని, ధైర్యాన్ని నింపాయి. తన మిత్రుడి పరోపకార గుణాన్ని మృగరాజు గుర్తించడంతో.. తన కోరిక కూడా తీరిందని తాబేలు పొంగిపోయింది.

పైడిమర్రి రామకృష్ణ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు