సెల్లార్లు పదిలంగా.. నిర్మాణాలు పక్కాగా

బహుళ అంతస్తుల భవనమైతే సెల్లారు తవ్వాల్సిందేనా? వాహనాల పార్కింగ్‌ కోసం వినియోగిస్తున్న సెల్లార్లు ఇటీవల భారీ వర్షాలు, వరదలతో నిండా మునిగాయి. కొత్తగా గతంలో ఎప్పుడూ లేనివిధంగా అత్యధిక అపార్ట్‌మెంట్లు, వాణిజ్య భవనాల్లోని సెల్లార్లలో ఊట వస్తోంది. రోజుల    తరబడి లిఫ్ట్‌లు షట్‌డౌన్‌లో ఉన్నాయి. సెల్లారులోనే విద్యుత్తు ప్యానెల్‌ బోర్డులు ఉండటంతో కొన్ని ప్రాంతాల్లో వారం రోజులు కరెంట్‌ నిలిపేశారు.

Updated : 24 Oct 2020 06:01 IST

పటిష్ఠతపై విస్తృత చర్చ
నిర్మాణ రంగ ప్రతినిధుల సూచనలు
ఈనాడు, హైదరాబాద్‌

బహుళ అంతస్తుల భవనమైతే సెల్లారు తవ్వాల్సిందేనా? వాహనాల పార్కింగ్‌ కోసం వినియోగిస్తున్న సెల్లార్లు ఇటీవల భారీ వర్షాలు, వరదలతో నిండా మునిగాయి. కొత్తగా గతంలో ఎప్పుడూ లేనివిధంగా అత్యధిక అపార్ట్‌మెంట్లు, వాణిజ్య భవనాల్లోని సెల్లార్లలో ఊట వస్తోంది. రోజుల తరబడి లిఫ్ట్‌లు షట్‌డౌన్‌లో ఉన్నాయి. సెల్లారులోనే విద్యుత్తు ప్యానెల్‌ బోర్డులు ఉండటంతో కొన్ని ప్రాంతాల్లో వారం రోజులు కరెంట్‌ నిలిపేశారు. తాజాగా కురిసిన భారీ వర్షాలు నిర్మాణ పరంగా ఎన్నో సందేహాలను లేవనెత్తాయి. ప్రభుత్వం సైతం సెల్లార్ల తవ్వకం అనుమతులపై పునరాలోచిస్తోంది. వీటిపై నిర్మాణరంగ సంఘాలు ప్రత్యేకంగా కమిటీలను నియమించుకుని సమీక్షిస్తున్నాయి. గతంలోనూ ప్రభుత్వానికి చేసిన సూచనలను గుర్తు చేశాయి.


నిబంధనల మార్పులతో..

భవన నిర్మాణాలు చేపట్టేందుకు మూడు అంతస్తుల లోపల వరకు సెల్లార్లు తవ్వుతున్నారు. 30 అడుగుల లోతు వరకు వెళుతున్నారు. బావి అంత లోతు.. నెలల తరబడి వీటి తవ్వకాల పనులు జరుగుతున్నాయి. ఎక్కువ లోతు తవ్వడంతో పక్క భవనాలకు ముప్పు ఏర్పడుతోంది. అంతకుముందు ఇలా ఉండేది కాదు. సెట్‌బ్యాక్‌ నిబంధనల్లో వచ్చిన మార్పులతో ఎక్కువ మంది బిల్డర్లు రెండో సెల్లారుకు వెళుతున్నారు. ఈసారి వచ్చిన అధిక వర్షాలకు వాటిలోని వరద నీరు చేరింది.
* అంతస్తులను బట్టి భవనం చుట్టుపక్కల ఖాళీ స్థలం (సెట్‌బ్యాక్‌) వదలాల్సి ఉంటుంది. మొదట్లో స్టిల్ట్‌, గ్రౌండ్‌ ఫ్లోర్‌ పార్కింగ్‌కు వదిలినా వీటిని అంతస్తులుగా పరిణించి ఆ మేరకు ఖాళీ స్థలం వదలాలి అనే నిబంధన ఉండేది. ప్రభుత్వంతో మాట్లాడి ఈ నిబంధనల్లో మార్పుతీసుకొచ్చాం. అప్పటి నుంచి పార్కింగ్‌కు వదిలిన అంతస్తులను సెట్‌బ్యాక్‌ నుంచి మినహాయించడంతో కొంత ఫలితం ఇచ్చింది. సెల్లార్లకు వెళ్లకుండానే కొందరు బిల్డర్లు నిర్మాణం చేపట్టారు.
* నేషనల్‌ బిల్డింగ్‌ కోడ్‌(ఎన్‌బీసీ) ప్రకారం 18 మీటర్లు దాటితే అగ్నిమాపక అనుమతులు తప్పనిసరి అని ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దీన్ని నిబంధనల్లో చేర్చారు. రాష్ట్రాల పునర్విభజన చట్టం ప్రకారం స్థానిక అవసరాలకు అనుగుణంగా భవన నిర్మాణాల నిబంధనలు అమలు చేసుకునే అవకాశం ఉంది. ఎన్‌బీఎస్‌ అనేది చట్టం కాదు నిబంధనలు కాబట్టి అసెంబ్లీలో చట్టసవరణ ద్వారా సడలింపు తీసుకురావొచ్చు. ఆకాశహార్మ్యాల భవనాలు ఎక్కువ విస్తీర్ణంలో చేపడతారు కాబట్టి సెట్‌బ్యాక్‌కు ఇబ్బంది లేదు. అగ్నిమాపక నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తారు. ఎటొచ్చి ఐదు అంతస్తుల భవనాల వరకు ఈ మినహాయింపు ఇవ్వాలి.
* సెల్లార్లకు వెళ్లేందుకు మరో కారణం కూడా ఉంది. ఇదివరకు ర్యాంపులను సైతం సెట్‌బ్యాక్‌గా పరిగణించేవారు. ఆ తర్వాత ర్యాంపులు లేకుండానే ఖాళీస్థలాన్ని గణించడం మొదలు కావడంతో పార్కింగ్‌కు స్థలం సరిపోవడం లేదు. 40 నుంచి 50 శాతం విస్తీర్ణం వీటికే పోతుంది. దీంతో పార్కింగ్‌కు రెండో సెల్లారుకు వెళుతున్నారు. వీటిలోనూ మినహాయింపులతో ఎక్కువ సెల్లార్ల అవసరం ఉండదు. పైగా రహదారి వరద లోపలకు రాకుండా ప్రారంభంలో ఎత్తు పెంచి తర్వాత ర్యాంపు నిర్మాణం చేపడతారు. ఒకవైపు సెట్‌బ్యాక్‌ నుంచి మినహాయింపులు ఇవ్వొచ్చు.

- సి.శేఖర్‌రెడ్డి, అధ్యక్షుడు, సీఐఐ-గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌, హైదరాబాద్‌


అక్రమ కట్టడాలను నిరోధించాలి

తెలిసో, తెలియకో చెరువుల పరివాహక ప్రాంతాల్లో స్థలాలు కొని అక్కడ నిర్మాణాలు చేపడుతున్నారు. ఇలాంటి వాటిని కట్టేటప్పుడే కూల్చేయాలి. నిరంభ్యంతర పత్రం తీసుకునేందుకు వస్తారు కదా అప్పుడు చూద్దాం అని అధికారులు పట్టించుకోవడంలేదు. కట్టిన తర్వాత కూల్చేసే పరిస్థితి ఉండదు. వీటిలో కొన్నవారు నష్టపోతున్నారు. వీటి రిజిస్ట్రేషన్లు ఆపేస్తామంటున్నారు.. కూల్చేస్తామంటున్నారు. కట్టిన వ్యాపారులు, బిల్డర్‌తో సహా కడుతుంటే నియంత్రించని అధికారుల వరకు బాధ్యుల్ని చేయాలి. అప్పుడే ఈ అక్రమ కట్టడాలు ఆగుతాయి.
* లోతట్టు ప్రాంతాల్లో సెల్లార్లకు అనుమతి ఇవ్వకూడదు. ఆయా ప్రాంతాలను ముందే గుర్తించాలి. పార్కింగ్‌ కోసం గ్రౌండ్‌ఫ్లోర్‌, ఒకటో అంతస్తులో ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలి. ఇప్పుడు అనుమతి ఇస్తున్నా.. ఎత్తు నిబంధన అడ్డంకిగా ఉంది. నిర్ధారిత ఎత్తుదాటితే అగ్నిమాపక అనుమతి తీసుకోవాలి. ఇలాంటి నిబంధనల్లో సడలింపపులు ఇవ్వాలి.
* విదేశాల్లో మొదటి రెండు మూడు అంతస్తులు పార్కింగ్‌ ఉంటుంది. ఆపైన నివాసాలు ఉంటాయి. మన దగ్గర ఇందుకు అడ్డు ఉన్న నిబంధనల్లో మార్పులు చేయాలి.

-ప్రభాకర్‌రావు, అధ్యక్షుడు, తెలంగాణ బిల్డర్స్‌ ఫెడరేషన్‌


అన్నివైపుల మౌలిక వసతుల కల్పనే పరిష్కారం

ఇటీవలి వరదల అనంతరం భవన నిర్మాణ నిబంధనల్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉందా అనేదానిపై సమీక్ష సమావేశం పెట్టుకున్నాం. సెల్లార్లు లేకుండా నిర్మాణాలు ఎలా? ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కొత్తగా కట్టేవాటితో పాటూ ఇప్పటికే పూర్తైనవాటిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రాథమికంగా చర్చించుకున్నాం. అంశాలవారీగా అధ్యయనానికి ప్రత్యేకంగా కమిటీలు కూడా ఏర్పాటు చేశాం.
* మున్ముందు వరదలతో ఇబ్బంది పడకూడదంటే ప్రభుత్వం అన్నివైపులా మౌలిక వసతుల కల్పనపై దృష్టిపెట్టాలి. పెట్టుబడులు వస్తున్న ఐటీ కారిడార్‌తో పాటూ ఇతర ప్రాంతాల్లోనూ సౌకర్యాలు కల్పించాలి. వరద ప్రాంతాల్లో వ్యక్తిగతంగా జరిగిన నష్టాన్ని పక్కకుపెడితే... ఆయా ప్రాంతాల్లో కొత్తగా మౌలిక వసతులు అభివృద్ధికి ఇదో అవకాశంగా భావిస్తున్నాను.
* సెల్లార్ల విషయానికి వస్తే.. సాధారణ బహుళ అంతస్తుల భవనాల్లో పార్కింగ్‌, సెట్‌బ్యాక్‌ దృష్టిలో పెట్టుకుని వీటిని నిర్మిస్తున్నారు. సెల్లార్లు వద్దంటే పార్కింగ్‌ కోసం స్టిల్ట్‌, మొదటి అంతస్తు వదిలి ఆపై ఐదు అంతస్తులు నిర్మిస్తే 18 మీటర్లు దాటితే అగ్నిమాపక అనుమతులు తీసుకోవాలి. దీంతో చదరపు అడుగు ధర ఐదు వందల రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంది. ధరలు పెరిగితే అందరికి ఇళ్లు అందుబాటులో ఉండవు. సెల్లారు వద్దంటే నిబంధనల్లో మార్పులు చేయాలి.  
* కొన్ని భవనాల్లో సెల్లార్లు రెండు మూడు అంతస్తుల లోపల వరకు ఉన్నా ఎంత నీరు వచ్చినా ప్రత్యేకంగా నిర్మించిన సంపులోకి చేరేలా ఏర్పాట్లు చేసుకున్నారు. బంజారాహిల్స్‌లోని జీవీకే వన్‌ మాల్‌లో ఆరు లక్షలలీటర్ల నీరు పట్టే సంపు సెల్లార్‌లో ఉంది. వర్షం కురిసినప్పుడు లోపలికి వచ్చే నీరు ఇందులోకి  చేరుతుంది. ఈ నీటిని తిరిగి వేర్వేరు అవసరాలకు ఉపయోగించుకునేలా ఏర్పాట్లు చేసుకున్నారు. నీట మునగకుండా ఇలాంటి చర్యలు చేపట్టవచ్చు.
* చిన్న బిల్డర్లు కట్టే సాధారణ బహుళ అంతస్తుల భవనాల్లోని సెల్లార్లలో నీరు నిల్వ చేసేందుకు రెండు స్తంభాల మధ్య పెద్ద సంపులకు అవకాశం ఉండకపోవచ్చు. వర్షపు నీరు లోపలికి చేరకుండా నిర్మాణ డిజైన్‌ ఉండాలి. ఈ విషయంలో 30 శాతం బాధ్యత బిల్డర్‌ది అయితే 70 శాతం ప్రభుత్వానిది. భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను స్లోపు ఆధారంగా నిర్మించాలి. దీనికి సంబంధించి సిటీకి మాస్టర్‌ప్లాన్‌ ప్రత్యేకంగా ఉండాలి. వరద నీరు  వెళ్లేందుకు మరో వ్యవస్థ ఉండాలి. ప్రస్తుతం వరద, డ్రైనేజీ రెండు ఒకచోట చేరడంతో తట్టుకోలేపోతున్నాయి. వరదకు సంబంధించి అన్ని ప్రాంతాల నుంచి మూసీలోకి చేరేలా చర్యలు చేపట్టాలి. అంతర్జాతీయ నగరంగా ఎదుగుతోన్న హైదరాబాద్‌ భవిష్యత్తులో మరింతగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం  ఆ మేరకు చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నాం.

- వి.రాజశేఖర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి, క్రెడాయ్‌ హైదరాబాద్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని