కలప ఇళ్లు.. తిప్పుకోలేరు కళ్లు!

ఇంటిని అందంగా తీర్చిదిద్దేందుకు ఇంటీరియర్స్‌ను ఎక్కువగా కలపతో చేయిస్తున్నాం... గచ్చు కూడా కలప అయితే మరింత ఆకర్షణీయంగా, విలాసవంతంగా ఉంటుందని మురిసిపోతున్నాం.. అక్కడికే పరిమితం కాకుండా ఇప్పుడు మొత్తం ఇంటినే కలపతో కట్టేయవచ్చు అంటున్నారు నిర్మాణదారులు. సాధ్యమా

Published : 09 Oct 2021 02:57 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఇంటిని అందంగా తీర్చిదిద్దేందుకు ఇంటీరియర్స్‌ను ఎక్కువగా కలపతో చేయిస్తున్నాం... గచ్చు కూడా కలప అయితే మరింత ఆకర్షణీయంగా, విలాసవంతంగా ఉంటుందని మురిసిపోతున్నాం.. అక్కడికే పరిమితం కాకుండా ఇప్పుడు మొత్తం ఇంటినే కలపతో కట్టేయవచ్చు అంటున్నారు నిర్మాణదారులు. సాధ్యమా అనే సందేహాలు వద్దు. ఒకప్పుడు మన పూర్వీకులంతా కలపతో కట్టిన ఇళ్లలో ఏళ్ల తరబడి నివసించినవారే. జనాభాతోపాటు ఆవాసాలు పెరగడంతో కలప కొరత ఏర్పడింది. చెట్లను కొట్టడం నిషేధించారు. దీంతో క్రమంగా కాంక్రీట్‌ వైపు మళ్లాం. ఇప్పుడు మరో సమస్య వచ్చి పడింది. నిర్మాణానికి అవసరమైన ఇసుక, రాతి, నీటి కొరత ఎక్కువగా వేధిస్తోంది. దీనికి కలపే ప్రత్యామ్నాయం అంటున్నారు. కాకపోతే ప్రస్తుతం మనదగ్గర కావాల్సిన కలప అందుబాటులో లేదు. నైపుణ్యాలు తక్కువే. కెనడా వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకుని వీటితో ఇళ్లను కడుతున్నారు. కాంక్రీట్‌తో పోలిస్తే కలపతో కట్టే ఇంటి వ్యయం అధికం కావడంతో ఖరీదైన విల్లా ప్రాజెక్టుల్లో మాత్రమే వీటిని చేపడుతున్నారు. హైదరాబాద్‌లో ఇప్పటికే ఈ తరహా నిర్మాణాలు మొదలయ్యాయి. రాజకీయ, వ్యాపార ప్రముఖులు వుడెన్‌ విల్లాల వైపు ఆసక్తి చూపిస్తున్నారు.

ఇంటిపైన పెంట్‌హౌస్‌, ఫామ్‌హౌస్‌, రిసార్ట్‌ హౌస్‌లను కలపతో నిర్మించుకోవడం చాలాకాలంగా చూస్తున్నాం. ఇంటిని సైతం విదేశాల్లో మాదిరి పూర్తిగా కలపతో కట్టించుకోవాలనే ఆలోచన చాలామందిలో ఉన్నా.. వానలకు తట్టుకోగలవా? మంటలంటుకుంటే ఏంటి పరిస్థితి? మన దగ్గర కట్టేవాళ్లు ఉన్నారా అనే సందేహాలు ఇన్నాళ్లు వారిని ముందడుగు వేయనిచ్చేవి కావు. విదేశీ సంస్థల తోడ్పాటుతో స్థానిక సంస్థలే చెక్క ఇళ్ల నిర్మాణాలు చేపడుతూ ఒక్కో అనుమానాన్ని పటాపంచలు చేస్తూ వస్తున్నాయి.

వాతావరణాన్ని తట్టుకునేలా..

సాధారణంగా చెక్క తలుపులు, కిటికీలు చలికాలంలో వ్యాకోచిస్తుంటాయి. ఇంటి నిర్మాణంలో ఉపయోగించే కెనడియన్‌ వుడ్‌లో ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు, తగ్గినప్పుడు ఏ మేరకు ప్రభావితం అవుతాయో ముందే అంచనా వేసి ఆ మేరకు అంతర్గంగా సర్దుబాటు వ్యవస్థ ఉంటుందని వీటిని ఉపయోగిస్తున్నవారు చెబుతున్నారు. ఫైర్‌ రేటింగ్‌ కలప కావడంతో త్వరగా మంటలు అంటుకోవు అని చెబుతున్నారు. ఇంటికి ఉపయోగించే కలపకు 2 గంటల రేటింగ్‌ ఉందని... అంతసేపు మంటలను అదుపు చేయగలవని, కలపలోని నిర్మాణమే దీనికి కారణమని వివరిస్తున్నారు. కాంక్రీట్‌ కంటే 15 రెట్లు, ఉక్కు కంటే 400 రెట్లు మంచి ఇన్సులేటర్‌గా పనిచేస్తుందని.. వేడి, చలిని తట్టుకుంటుందని ఇంట్లోవారికి సౌకర్యంగా ఉంటుందంటున్నారు.

మూడు నుంచి ఆరునెలల్లోనే..

సాధారణంగా ఇల్లు కట్టాలంటే ఏడాది పడుతుంది. కలపతో కట్టే ఇళ్లను మూడు నెలల నుంచి ఆరునెలల వ్యవధిలో పూర్తిచేయవచ్చు. 6500 చదరపు అడుగుల ఇంటిని సైతం ఆరునెలల్లో పూర్తి చేయవచ్చు అంటున్నారు. ఫ్లోర్‌ను మొదట కాంక్రీట్‌తో నిర్మించుకున్న తర్వాత మిగతా కలప పనులన్నీ చకచకా జరిగిపోతుంటాయి. 70 శాతం పనిని వర్క్‌షాపులోనే పూర్తవుతుంది. వేర్వేరు పరిమాణాల్లో ఉన్న కలప దుంగలను తీసుకొచ్చి బిగించడమే సైట్‌లో పని. తలుపులు, కిటికీలు ఎలా కావాలో నిర్ణయించుకోవచ్చు.


ఏంటి ప్రయోజనాలు..

* కావాల్సిన రీతిలో డిజైన్‌ చేయించుకోవచ్చు
* ఎండాకాలంలో వేడిని లోపలికి రానీయకుండా చల్లగా ఉంచుతుంది
* చలికాలంలో ఇంటిలోపల వెచ్చగా ఉంటుంది.
* కరెంట్‌ బిల్లు తగ్గుతుంది. ఆ మేరకు కార్బన్‌ ఉద్గారాలను తగ్గించనట్లు అవుతాం. పర్యావరణహితం.


వుడ్‌ ఫ్రేమ్‌ కన్‌స్ట్రక్షన్‌ డిజైన్‌...

కాంక్రీట్‌ నిర్మాణంలో ఆర్కిటెక్చర్‌ పరంగా కొన్ని పరిమితులు ఉంటాయి. ఎక్కువ వైవిధ్యం చూపించేందుకు అవకాశం ఉండదు. కలపతో కట్టే ఇళ్లలో కావాల్సిన రీతిలో  ఇంటిని డిజైన్‌ చేయించుకోవచ్చు. కాటేజెస్‌, రిసార్టుల వంటి ఒక అంతస్తులో ఉండే నిర్మాణాలను డంగ్‌ అండ్‌ గ్రూ విధానంలో డిజైన్‌ చేస్తారు. జీ+1 నుంచి 4 వరకు అంతస్తులు కావాలంటే వుడ్‌ ఫ్రేమ్‌ డిజైన్‌ అనుకూలం. 18 అంతస్తుల వరకు నిర్మించిన ఉదాహరణలు ఉన్నాయి. ఈ విధానంలో లోడ్‌ ఆధారంగా డిజైన్‌ చేస్తారు. స్లాబ్‌లు సైతం చెక్కలతో రెండు విధానంలో వేస్తారు. ఒకదానిపై ఒక కలపను పేర్చే గ్లూ పద్ధతి ఒకటికాగా... మరొకటి క్రాస్‌ పద్ధతిలో వేర్వేరు బిగిస్తారు. కాంక్రీట్‌ మాదిరి దృఢంగా ఉంటుంది. పై అంతస్తు స్లాబు మాత్రం ఏటావాలుగా ఉంటుంది.

వ్యయం ఎక్కువే..

కాంక్రీట్‌తో పోలిస్తే కలపతో కట్టే ఇంటికి ప్రస్తుతం వ్యయం ఎక్కువే అవుతోంది. విదేశాల నుంచి కలపను దిగుమతి చేసుకుంటున్నారు. సుంకాలు, ఇతరత్రా పన్నుల వల్ల ఇల్లు ప్రస్తుతానికి ఖరీదే. కాంక్రీట్‌తో పోలిస్తే 50 శాతం వరకు వ్యయం పెరుగుతుంది. ఇల్లు కట్టే విస్తీర్ణం, డిజైన్‌ను బట్టి ధరల్లో వ్యత్యాసాలు ఉంటాయి. భవిష్యత్తులో పన్నులు తగ్గి, రాయితీలు ఇస్తే కాంక్రీట్‌తో సమానంగా వీటి ధరలు దిగి వచ్చే అవకాశం ఉంది.


కావాల్సినట్లుగా కట్టించుకోవచ్చు..

‘‘కెనడాలో అడవులు ఎక్కువ. విదేశీ మార్కెటలో అటవీ ఉత్పత్తులను ప్రోత్సాహించాలనే లక్ష్యంగా భారత్‌లో ఐదు కలప జాతులను ప్రోత్సహిస్తోంది. వాటిలో ఒకటి స్ప్రూస్‌ పైన్‌ ఫిర్‌ రకం. ఇది ఇంటి నిర్మాణానికి పనికొస్తుంది. నేను కొంతకాలం కెనడాలో ఉన్నాను. అక్కడ 95 శాతం ఇళ్లు కలపతో చేసినవే. మన దగ్గర వీటిని తీసుకురావాలని చూస్తున్నప్పుడు కెనడియన్‌ వుడ్‌తో భాగస్వామ్యం అయ్యాం. ఇదొక స్వచ్ఛంద సంస్థ. వారి నుంచి కలప ఇళ్లు ఎలా కట్టాలో శిక్షణ పొందాం. మా కార్మికులను అక్కడికి తీసుకెళ్లి శిక్షణ ఇప్పించాం. మ్యాక్‌ ప్రాజెక్ట్‌లో మోడల్‌ విల్లాను 6500 చ.అ. విస్తీర్ణంలో కడుతున్నాం. గతంలోనూ వేర్వేరు నగరాల్లో కలప ఇళ్లను కట్టాం. కలపతో ఇళ్లను అభిరుచులకు తగ్గట్టుగా నిర్మించుకోవచ్చు.

- లక్ష్మీనారాయణ, డైరెక్టర్‌, నెస్కా హోమ్స్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని