మూడేళ్లలో.. మురిపెంగా ఇళ్లు

గేటెడ్‌ కమ్యూనిటీల్లో నివసించే వారు దేని కోసమూ గేటు దాటి బయటకు వెళ్లాల్సిన పని ఉండదు. అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. విద్యుత్తు, నీటి కోసం మాత్రం ఎందుకు బయట నుంచి ఆధారపడాలి?....

Published : 04 Dec 2021 04:29 IST

హరిత ఆవాసాల దిశగా ఏర్పాట్లు

ఈనాడు, హైదరాబాద్‌: గేటెడ్‌ కమ్యూనిటీల్లో నివసించే వారు దేని కోసమూ గేటు దాటి బయటకు వెళ్లాల్సిన పని ఉండదు. అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. విద్యుత్తు, నీటి కోసం మాత్రం ఎందుకు బయట నుంచి ఆధారపడాలి? ఈ ఆలోచనతోనే పలు గేటెడ్‌ కమ్యూనిటీలు తమ భవనాలపైనే సౌర విద్యుత్తు ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకొస్తున్నాయి. విద్యుత్తు వాహనాల ఛార్జింగ్‌ పాయింట్ల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ప్రాంగణంలో కురిసే ప్రతి వానబొట్టును ఒడిసిపట్టి.. పునర్వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటామంటున్నాయి. రాబోయే మూడేళ్లలో హరిత భవనాలుగా మారేందుకు అవసరమైన మౌలిక వసతుల(గ్రీన్‌ ఇన్‌ఫ్రా) కల్పనే తమ ప్రాధాన్యం అంటున్నాయి.

భవిష్యత్తు విద్యుత్తు వాహనాలదే కావడంతో భవన నిర్మాణ ప్రాంగణంలో ఈవీ ఛార్జింగ్‌ పాయింట్ల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. కొత్తగా చేపట్టే గృహ, వాణిజ్య, కార్యాలయ పార్కింగ్‌ ప్రదేశాల్లో ఈ మేరకు మౌలిక వసతులు కల్పిస్తున్నారు. పాత వాటిల్లో వచ్చే మూడేళ్లలో ఈవీ మౌలిక వసతులు ఏర్పాటు చేసుకుంటామని హైదరాబాద్‌లోని 78 శాతం గేటెడ్‌ కమ్యూనిటీలు అంటున్నాయి. ఇప్పటివరకు 2 శాతం కమ్యూనిటీల్లో మాత్రమే ఈవీ మౌలిక వసతుల కల్పన చేపట్టారు. మై గేట్‌ సర్వే ప్రకారం వచ్చే 12 నెలల్లో 52 శాతం కమ్యూనిటీలు ఈవీ మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెడతామని చెప్పాయి. మరో 26 శాతం కమ్యూనిటీలు.. వచ్చే మూడేళ్లలో ఏర్పాటు చేసుకుంటామని తెలిపాయి.

సౌర విద్యుత్తు

నగరంలో ఇళ్లపై వంద మెగావాట్లకు పైగా సౌర విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు. 1 కిలోవాట్‌ నుంచి 500 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన ప్లాంట్లను భవనాలపై ఇప్పటికే పలువురు వ్యక్తులు, సంస్థలు ఏర్పాటు చేశాయి. గేటెడ్‌ కమ్యూనిటీల్లో ఇప్పటివరకు వీటి శాతం తక్కువగా ఉంది. 11.5 శాతం మాత్రమే ఇక్కడ సౌర విద్యుత్తు ఉత్పత్తి అవుతోంది. వచ్చే మూడేళ్లలో సౌర విద్యుత్తు ప్లాంట్లను ఏర్పాటు చేసుకోబోతున్నట్లు 86 శాతం గేటెడ్‌ కమ్యూనిటీ వాసుల సంక్షేమ సంఘాలు(ఆర్‌డబ్ల్యూఏ) చెబుతున్నాయి. ఏడాది లోపల ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పిన కమ్యూనిటీలు 47 శాతం ఉన్నాయి. ఏడాది నుంచి మూడేళ్లలో మరో 39 శాతం కమ్యూనిటీలు ఏర్పాటు చేసుకోబోతున్నట్లు చెప్పారు. ‘గుండ్లపోచంపల్లిలో మా విల్లాలు మూడో దశలో హరిత ఇళ్లుగా నిర్మిస్తున్నాం. తక్కువ కరెంట్‌ వాడకం ఉండేలా భవన డిజైన్‌ ఉంటుంది. అవసరమైన విద్యుత్తు సైతం ఇంటిపైన ఏర్పాటుచేసే సౌర పలకల నుంచి పొందేలా ఏర్పాట్లు చేస్తున్నాం, నెట్‌ జీరో చేయబోతున్నాం’ అని ఒక ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ ప్రతినిధి ‘ఈనాడు’తో చెప్పారు. 

వాననీరు ఇంకేలా..

గేటెడ్‌ కమ్యూనిటీల్లో 40 ఇళ్లు మొదలు రెండువేల ఫ్లాట్ల వరకు ఉంటున్నాయి. ఇంతమందికి ప్రతిరోజు పెద్ద ఎత్తున నీరు అవసరం పడుతుంది. వాననీరు ఒడిసిపట్టి, వాడే నీటిని పునర్వినియోగం చేయకపోతే భూగర్భనీటి వనరులు పెద్ద ఎత్తున తోడాల్సి ఉంటుంది. ఖర్చుతో పాటూ ఫ్లోరైడ్‌ సమస్యలు ఎక్కువే. అందుకే ఇప్పటికే 60 శాతం కమ్యూనిటీల్లో వాన నీటి సంరక్షణ ఏర్పాట్లు ఉన్నాయి. మరో 40 శాతం కమ్యూనిటీలు వచ్చే మూడేళ్లలో ఏర్పాటు చేసుకుంటామని చెబుతున్నాయి. వీరిలో 15 శాతం కమ్యూనిటీలు ఏడాది సమయంలోనే ఇంకుడు గుంతలు, వాననీరు ఒడిసిపట్టే ట్యాంకుల నిర్మాణం చేసుకుంటామని చెబుతున్నాయి.


ఇంటి విలువ పెరుగుతుంది

హరిత ఇళ్ల నిర్మాణంతో.. కాలంతో పనిలేకుండా వనరులకు లోటు లేకుండా అక్కడ ఉండేవారు నివసించగలుగుతారని ఈ రంగంలోని నిపుణులు అంటున్నారు. ఫలితంగా ఇంటి విలువ పెరుగుతుందని చెబుతున్నారు. నిర్మాణ సమయంలో వ్యయం పెరిగినా.. తర్వాత ఇంటి విలువ అంతకంటే ఎక్కువ పెరుగుతుందని అంటున్నారు. ప్రస్తుతం విద్యుత్తు వాహనాల శకం మొదలైంది.ఈవీ మౌలిక వసతులు  ఉన్న కమ్యూనిటీల్లో ఫ్లాట్‌ విలువ పెరుగుతోందని, అద్దెలు ఎక్కువ వస్తున్నాయని చెబుతున్నారు. సౌర విద్యుత్తుతో విద్యుత్తు బిల్లులు గణనీయంగా తగ్గడంతో నిర్వాహణ భారమూ తగ్గుతుంది. వేసవిలో నీటి ఎద్దడి సమస్యలు తప్పుతాయి. సహజంగానే నీటి ఇబ్బందులు లేని కమ్యూనిటీల్లో ఇంటి విలువ ఎక్కువే ఉంటుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని