ఉగాదులు.. సొంతింటి ఉషస్సులు

నగరంలో సొంతిల్లు ఒక ధీమా.. మన సమాజంలో అంతకుమించిన సామాజిక హోదా స్వగృహం ఇస్తుంది. తెలుగు సంవత్సరాది ఉగాది శుభకృత్‌ నామ సంవత్సరంలో కలల గృహం సాకారం చేసుకునేందుకు ప్రస్తుతం

Updated : 02 Apr 2022 06:15 IST

ఈనాడు, హైదరాబాద్‌

నగరంలో సొంతిల్లు ఒక ధీమా.. మన సమాజంలో అంతకుమించిన సామాజిక హోదా స్వగృహం ఇస్తుంది. తెలుగు సంవత్సరాది ఉగాది శుభకృత్‌ నామ సంవత్సరంలో కలల గృహం సాకారం చేసుకునేందుకు ప్రస్తుతం మార్కెట్‌ పరిస్థితులు అనువుగా ఉన్నాయి. ఆలస్యం చేస్తే ధరలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఉక్రెయిన్‌ యుద్ధం ప్రభావంతో నిర్మాణ ముడి సామగ్రి ధరలు అమాంతం పెరగడంతో మున్ముందు ఇళ్ల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని రియల్‌ ఎస్టేట్‌ సంఘాలు అంటున్నాయి. ధరలు పెరగకముందే  ఇంటిని కొనుగోలు చేయడం మేలని సూచిస్తున్నాయి. ఇప్పటికే పలు ప్రాజెక్టులు నిర్మాణంలో ఉండగా.. కొత్తవి ప్రారంభం అవుతున్నాయి.

హైదరాబాద్‌ లాంటి నగరంలో  సొంతింటి కోసం కల కంటే సరిపోదు.. ఇల్లు కావాలనే లక్ష్యం నెరవేరడానికి స్వీయ ఆర్థిక క్రమశిక్షణ, మరెంతో పరిశ్రమ, ప్రయత్నం కావాలి..అన్నింటికీ మించి స్పష్టమైన ప్రణాళిక ఉండాలి అంటున్నారు నిపుణులు. మౌలిక వసతులున్న ప్రాంతాల్లో రెండు పడకల ఫ్లాట్‌ కావాలంటే రూ.50 లక్షల వరకు అవుతుంది. నగర శివారుకు వెళితే రూ.30 లక్షల నుంచి అందుబాటులో ఉన్నాయి. జనావాసాలున్న చోట చదరపు గజం రూ.20వేలకు ఎక్కడా తక్కువ లేదు.  వీటికి అనుగుణంగా ప్రణాళిక రూపొందించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

బడ్జెట్‌కు తగ్గట్టుగా..

ఇంటి స్థలాన్ని మన బడ్జెట్‌కు తగ్గట్టుగా కొనుగోలు చేయాలి. ఆడంబరాలకు పోకుండా అవసరాలకు తగ్గట్టుగా ఉండాలి. ఇలాంటి విషయాల్లో అనుభవజ్ఞులు, ఇంజినీరింగ్‌, వాస్తు నిపుణుల సూచనలు, సలహాలు ఉపకరిస్తాయి. ఏ పని ఎప్పుడు ప్రారంభించాలి? దేనికెంత సామగ్రి పడుతుంది? అవి ఎక్కడ దొరుకుతాయనే విషయాలు తెలుస్తాయి. తద్వారా అధిక వ్యయం చేయకుండా.. సామగ్రి వృథా కాకుండా ఖర్చులు తగ్గుతాయి. వీటికోసం సమయం కేటాయించలేని వారు సిద్ధంగా ఉన్న ఇళ్లవైపు మొగ్గు చూపవచ్చు. మార్కెట్లో సిటీలోని అన్ని ప్రాంతాల్లో స్టాండలోన్‌ అపార్ట్‌మెంట్లు మొదలు గేటెడ్‌ కమ్యూనిటీ వరకు అందుబాటులో ఉన్నాయి.

ఎక్కడ కొనాలి...

మన అవసరాలు తీర్చేది.. భవిష్యత్తులో వృద్ధికి అవకాశం ఉన్న ప్రాంతాల ఎంపికతో ప్రయోజనం ఉంటుంది. మన స్థోమతకు తగిన స్థలం ఎంచుకోవాలి. రవాణా సదుపాయం, పిల్లల పాఠశాల, భద్రతకు ఇబ్బందులు లేకుండా ప్రాంతం ఉంటే మంచిది. కొనేటప్పుడు లేకపోయినా.. భవిష్యత్తులో ఆ ప్రాంతంలో ఇవన్నీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్న స్థలాలు అనుకూలమైనవి. న్యాయపరమైన చిక్కులు లేకుండా చూసుకోవాలి. కొందరి అనుభవాలను చూస్తే.. వృద్ధికి అవకాశం ఉన్న చోట ముందుగా ఎక్కువ విస్తీర్ణంలో స్థలం కొని.. ఆ ప్రాంతం అభివృద్ధి చెంది ధరలు పెరిగాక అందులో సగం విక్రయించి ఆ వచ్చిన డబ్బుతోనూ ఇంటిని నిర్మించుకుంటున్నారు. మరికొందరు ధరలు పెరగగానే స్థలాన్ని విక్రయించి కావాల్సిన చోట ఇల్లు కొనుగోలు చేస్తుంటారు.

చౌకలో రుణాలు..

ఇంటికి అప్పు చేయడం మేలు చేస్తుంది. మిగతావి ఏవి కొన్నా విలువ తగ్గుతుంది. ఇల్లు విషయంలో మాత్రం స్థలం ధరలు పెరగడమే తప్ప తగ్గడం ఉండదు కాబట్టి.. ఏ దశలోనూ ఇంటి విలువ కొన్నదానికంటే ఎక్కువే ఉంటుంది. కాబట్టి ఇంటి నిర్మాణానికి సంపాదనకు తగ్గట్టుగా అప్పు చేయడం వల్ల సులువుగానే తీర్చగలుగుతారు. ప్రస్తుతం చాలా తక్కువ వడ్డీకి గృహరుణాలు లభిస్తున్నాయి. 6.70 శాతానికే గృహరుణాలు వస్తున్నాయి. ఇంటికోసం చేసిన అప్పు తీర్చడం సులువే. కిరాయి ఇంట్లో ఉన్నప్పుడు చెల్లించిన అద్దె మొత్తంతో నెలసరి వాయిదాలు చెల్లించడం పెద్ద భారమేమి కాదు. గృహరుణం అసలు, వడ్డీపై ఆదాయ పన్ను వెసులుబాటు ఉంటుంది. ఇవన్నీ కాక ఆ ప్రాంతం విస్తరించే కొద్దీ స్థలంతో పాటూ ఇంటి విలువ పెరిగి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.

మున్ముందు ఎలా?

ప్రస్తుతం మార్కెట్‌ బాగుందని స్థిరాస్తి సంఘాలు అంటున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో 20 లక్షల స్థిరాస్తి లావాదేవీలు జరిగితే  ఇందులో అత్యధికంగా హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, సంగారెడ్డి జిల్లాల పరిధిలోనే జరిగాయి. శుక్రవారం నుంచి మొదలైన కొత్త ఆర్థిక సంవత్సరంలోనూ రియల్‌ ఎస్టేట్‌ ఆశాజనకంగా ఉంటుందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. కొవిడ్‌ వంటి క్లిష్ట పరిస్థితులను తట్టుకుని నిలబడిన స్థిరాస్తి రంగం.. నిర్మాణ ముడిసరుకుల ధరల పెంపు ప్రభావం నుంచి బయట పడటమే తన ముందున్న అతిపెద్ద సవాల్‌ అంటున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని