Updated : 17 Sep 2022 12:00 IST

అంతెత్తు తూగగలరా?

ఆకాశహర్మ్యాలు అన్నిచోట్లా లాభసాటి కాదంటున్న బిల్డర్లు

ఈనాడు, హైదరాబాద్‌

నగరంలో ఏ ప్రాంతంలో చూసినా ఆకాశహర్మ్యాలు నిర్మిస్తున్నారు. 20 అంతస్తులపైనే నిర్మాణాలు చేపడుతున్నారు. 50 అంతస్తుల ఎత్తు దాటి ఇంకా పైకి వెళుతున్నారు. ఆయా ప్రాంతాల్లో ఇవి అభివృద్ధికి నిదర్శనంగా.. ఐకానిక్‌ టవర్లుగా నిలుస్తున్నాయి. వీటిలో నివాసం సామాజిక హోదాగా కొనుగోలుదారులు భావిస్తున్నారు. ప్రీలాంచ్‌ ఆఫర్లలో ఎక్కువగా ఈ ప్రాజెక్టులే ఉన్నాయి. ఏళ్లు గడుస్తున్నా అసలు పనులే మొదలు పెట్టలేదనే ఫిర్యాదులు వస్తున్నాయి. ఆకాశహర్మ్యాలు కట్టడం అన్ని ప్రాంతాల్లో లాభసాటి కాదని బిల్డర్లు అంటున్నారు. కొనేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

హైదరాబాద్‌లో అత్యంత ఎత్తైన భవనాలన్నీ అధికంగా ఐటీ కారిడార్‌ చుట్టుపక్కల వస్తున్నాయి. ఇక్కడ భూముల ధరలు అధికంగా ఉండటంతో బిల్డర్లు ఆ మేరకు అంతస్తులు పెంచుకుంటూ వెళుతున్నారు. ఇక్కడ కొత్తగా కట్టే ప్రతి భవనం 30 అంతస్తుల పైనే ఉంటోంది. ఎత్తుపై ఫ్లోర్‌ స్పేస్‌ ఇండెక్స్‌(ఎఫ్‌ఎస్‌ఐ) పరిమితులు లేకపోవడంతో ఆకాశమే హద్దుగా కడుతున్నారు. ఇక్కడ చూసి ఇతర ప్రాంతాల్లోనూ ఎత్తైన భవంతులు వస్తున్నాయి. పెద్ద బిల్డర్‌ అనిపించుకోవాలని కొందరు మొదలెడుతుంటే... కొనుగోలుదారుల్లో ఉన్న ఆసక్తిని గమనించి ఇంకొందరు చేపట్టారు. ప్రీలాంచ్‌ పేరుతోనూ పలు కొత్త సంస్థలు వీటిలోకి అడుగుపెట్టాయి. పూర్తి చేయగలరా అనేది ఇప్పటికీ అందులో కొనుగోలు చేసినవారిని వేధిస్తున్న ప్రశ్న.

నిర్మాణ వ్యయం అధికం..

ఐదు అంతస్తుల భవనాలతో పోలిస్తే ఆకాశ హర్మ్యాల నిర్మాణం పక్కా ప్రణాళికతో చేపట్టాలి. వాస్తవానికి నిర్మాణ తీరే పూర్తిగా మార్చాల్సి ఉంటుంది. సాంకేతికత వినియోగించాలి. సహజంగానే అంతస్తులు పెరిగేకొద్దీ నిర్మాణ వ్యయం కూడా పెరుగుతుంది. అనుభవం ఉంటే తప్ప వీటిని చేపట్టడం కష్టం అంటున్నారు నిర్మాణదారులు. చుట్టుపక్కల ఇళ్ల లభ్యత, అక్కడ ఉన్న డిమాండ్, పోటీ సంస్థలు విక్రయిస్తున్న ధరలు అన్నింటినీ బేరీజు వేసుకోవాల్సి వస్తుంది. నిర్మాణంలో అనుకోని ఆలస్యం, ముడిసరుకు ధరల్లో హెచ్చుతగ్గులు, మార్కెట్‌లో ఆర్థిక మందగమనం వంటి పరిస్థితులు హఠాత్తుగా ఎదురైతే తట్టుకునే సామర్థ్యం.. ఇవన్నీ చూసుకున్నాక చేపట్టే ప్రాజెక్టు ఏ మాత్రం లాభసాటి అనేది తెలుస్తుందంటున్నారు సీనియర్‌ బిల్డర్లు. గతంలో సీనియర్‌ బిల్డర్‌ ఒకరు ఆకాశహర్మ్యం నిర్మించి చేతులు కాల్చుకున్నారని గుర్తు చేశారు. అలాంటిది కొత్తగా వచ్చిన కొన్ని సంస్థలు మొదటి ప్రాజెక్ట్‌నే పాతిక అంతస్తులతో చేపడుతున్నాయని అన్నారు. కట్టే సామర్థ్యం, ఆ ప్రాంతంలో నిజంగా అంత ఎత్తైన భవనం అవసరం ఉంటే కట్టడం సాధ్యమేనని.. కానీ ఇవేవీ లేనిచోట్ల కడుతుండటంపైనే తమ భయాలని అంటున్నారు.

నిర్వహణ ఖర్చులు ఎక్కువే

ఆకాశహర్మ్యాలను తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ అంతస్తులు నిర్మిస్తుంటారు. మూడొంతుల స్థలాన్ని ఖాళీగా వదులుతుంటారు. క్లబ్‌ హౌస్, క్రీడా సదుపాయాలు, షాపింగ్, ఆసుపత్రి వంటి వాటికి కేటాయిస్తుంటారు. అందులో నివసించే వారికి కనీస అవసరాలన్నీ అక్కడే దొరికేలా ఏర్పాట్లు ఉంటాయి. సాధారణ అపార్ట్‌మెంట్లతో పోలిస్తే ఈ తరహా గేటెడ్‌ హైరైజ్‌ భవనాల్లో నిర్వహణ వ్యయం అధికంగానే ఉంటుంది. అక్కడ ఉండే ఆవాసాలు, కల్పించే సౌకర్యాలు, ప్రాజెక్ట్‌ను బట్టి ఈ వ్యయాలు వేర్వేరుగా ఉంటాయి. కొనేటప్పుడు వీటిని కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.

హైరైజ్‌ అంటే..

మన రాష్ట్రంలో గృహ నిర్మాణంలో ఐదు అంతస్తులు/18 మీటర్లు దాటితే, వాణిజ్య భవనాలైతే 15 మీటర్లు దాటితే హైరైజ్‌గా పరిగణిస్తున్నారు. హైరైజ్‌కు అగ్నిమాపక నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.

* రాష్ట్రంలో దీన్ని 21 మీటర్లకు పెంచాలని నరెడ్కో తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతోంది. ఇతర నగరాల్లో పరిశీలించి ఆ మేరకు ఇక్కడ మినహాయింపు ఇవ్వాలని అంటోంది.

* ఆకాశహర్మ్యాల భవనాల చుట్టూ 7 మీటర్ల సెట్‌బ్యాక్‌ ఉండాలనే నిబంధన ఉందని.. ఒకవేళ అగ్నిప్రమాదం జరిగితే అగ్నిమాపక యంత్రం తిరిగేందుకు వీలుగా ఈ నిబంధన పెట్టారని బిల్డర్లు అంటున్నారు. ముంబయి లాంటి నగరంలో భవనానికి నలువైపులా రహదారి ఉంటే సెట్‌బ్యాక్‌ అవసరం లేదనే నిబంధనలు ఉన్నాయని.. వీటిని అధ్యయనం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.


బిల్డర్‌ ట్రాక్‌ రికార్డు చూడాలి

- ఎం.విజయసాయి, ప్రధాన కార్యదర్శి, నరెడ్కో తెలంగాణ

హైరైజ్‌ అపార్ట్‌మెంట్లు అన్ని ప్రాంతాల్లో లాభసాటి కావు. కట్టేవారికే కాదు కొనేవారు సైతం తమకు లాభసాటివో కాదో చూసుకోవాలి. వచ్చే అద్దె, నిర్వహణ వ్యయం పరిగణనలోకి తీసుకోవాలి. వీటిల్లో రూ.8వేల నుంచి రూ.12వేల వరకు కూడా నిర్వహణ వ్యయం ఉంటుంది. కొనేటప్పుడు అన్నింటినీ చూసుకుని నిర్ణయం తీసుకోవాలి. ఎలాంటి అనుభవం లేకుండా 30 నుంచి 40 అంతస్తుల భవనం కడతామని వస్తున్నారు. బిల్డర్‌ గత చరిత్ర చూడాలి. గతంలో హైరైజ్‌ కట్టిన అనుభవం ఉందా లేదా తెలుసుకోవాలి. రెరా అనుమతి ఉన్న ప్రాజెక్టులోనే కొనాలి.


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని