Updated : 17 Sep 2022 07:09 IST

‘రియల్‌’ ఎక్కడ మెరుగవ్వాలంటే..!

డిమాండ్‌ వృద్ధి భేష్‌.. మిగతా అంశాల్లో వెనకబాటు

కొత్త ప్రాజెక్టులు మొదలెట్టడంలో క్రమశిక్షణ తప్పింది

పోటీతత్వం తక్కువే అంటున్న నివేదికలు

ఈనాడు, హైదరాబాద్‌

హైదరాబాద్‌ స్థిరాస్తి మార్కెట్‌ డిమాండ్‌ వృద్ధిపరంగా మొదటిస్థానంలో ఉంది. దేశంలోని ప్రధాన నగరాలన్నింటి కంటే ఈ విషయంలో ఇక్కడే ఎక్కువ వృద్ధి ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఆరు రేటింగ్‌ పాయింట్లతో హైదరాబాద్‌ అగ్రస్థానంలో నిలిచింది. మిగతా అంశాల్లో మాత్రం వెనకబడింది.

కొత్త ప్రాజెక్టులు, డిమాండ్‌ వృద్ధి, అమ్ముడుపోని గృహాలు, స్థిరాస్తుల ధరలు, పోటీతత్వం.. ఇలా ఐదు అంశాల ఆధారంగా మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మెట్రిక్‌(రిమ్‌) ఫ్రేమ్‌వర్క్‌ పేరుతో ఒక నివేదిక తాజాగా విడుదల చేసింది. అంశాల వారీగా ఒకటి నుంచి ఆరు రేటింగ్‌ ఇచ్చింది. కొత్త ప్రాజెక్టులు, అమ్ముడుపోని గృహాలు, స్థిరాస్తి ధరలు, పోటీతత్వంలో ఇచ్చిన రేటింగ్‌లో హైదరాబాద్‌ వెనకబడినా.. డిమాండ్‌ వృద్ధిలో మాత్రం ముందుంది. అన్ని అంశాల్లో కలిపి బెంగళూరు 4.7 రేటింగ్‌తో అగ్రస్థానంలో ఉండగా, 4 రేటింగ్‌తో హైదరాబాద్‌ రెండో స్థానంలో నిలిచింది.

ఈ అంశాలను పరిశీలిస్తే..

* హైదరాబాద్‌లో డిమాండ్‌కు అనుగుణంగా కొత్త ప్రాజెక్టులను మొదలెట్టడంలో కొంత క్రమశిక్షణ తప్పిందని నివేదిక చెబుతోంది. రేటింగ్‌లో ఒకటే పాయింట్‌ దక్కింది. ఇటీవల ప్రీలాంచ్‌ పేరుతో భారీ ఎత్తున కొత్త ప్రాజెక్టులు చేపట్టారు. ఆ మేరకు సిటీలో, ఆ ప్రాంతంలో ఇళ్లకు డిమాండ్‌ ఉందా లేదా చూసుకోకుండా మొదలెట్టారని రియల్‌ ఎస్టేట్‌ సంఘాలు సైతం అందోళన వ్యక్తం చేశాయి. కొవిడ్‌ ముందు వరకు ఈ విషయంలో దేశంలో మెరుగైన స్థితిలో హైదరాబాద్‌ మార్కెట్‌ ఉండేది. డిమాండ్‌కు తగ్గట్టుగా కొత్త ప్రాజెక్ట్‌లను ఒక్కోటిగా ప్రారంభిస్తూ వచ్చేవారు.

* ఇన్వెంటరీ... అమ్ముడుపోని గృహాలు పెరిగాయని రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెన్సీ సంస్థలు తరచూ తమ నివేదికలో భారీ సంఖ్యను చూపుతున్నాయి. నిర్మాణం పూర్తై నివాసయోగ్య ధృవీకరణ పత్రం వచ్చిన తర్వాత కూడా అమ్ముడు పోకుండా మిగిలి ఉన్నవాటినే ఇన్వెంటరీగా చూడాలి తప్ప... అనుమతులు వచ్చిన దగ్గర్నుంచే చూడొద్దని బిల్డర్లు అంటున్నారు. అనుమతి తీసుకున్న తర్వాత దశల వారీగా ప్రాజెక్టు పనులు మొదలెడతామని. అప్పుడే దాన్ని ఇన్వెంటరీగా తీసుకుంటే ఎలా అనే వాదనను వినిపిస్తున్నారు. వీరి వాదనకు బలం చేకూర్చేలా హైదరాబాద్‌కు మంచి రేటింగే దక్కింది. 20 వెయిటేజీకిగాను 6 దక్కింది.

* స్థిరాస్తి ధరల పరంగా హైదరాబాద్‌కు 4 రేటింగ్‌ దక్కింది. 25 శాతం వెయిటేజీలో బెంగళూరు(6), పుణె(5) మనకంటే మెరుగైన స్థితిలో ఉన్నాయి. ధరల పెరుగుదల, ప్రస్తుతం అమ్ముడుపోని ఇళ్ల సంఖ్య, డిమాండ్‌ వృద్ధి, పోటీతత్వం ఆధారంగా ధరల నిర్ణయంపై రేటింగ్‌ నిర్ణయించారు. అయితే మన డెవలపర్ల వాదన భిన్నంగా ఉంది. సిటీలో ఇటీవల కాలంలో ఇళ్ల ధరలు పెరిగినా.. ఇప్పటికీ ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లోనే ధరలు అందుబాటులో ఉన్నాయని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. ప్రధాన నగరం, పశ్చిమ హైదరాబాద్‌ మినహా మిగతా చోట్ల చదరపు అడుగు రూ.4500 ధరల స్థాయిలో అపార్ట్‌మెంట్లలోని ఫ్లాట్లను విక్రయిస్తున్నారని చెబుతున్నారు.

* పోటీతత్వంలోనూ మనవాళ్లు తీసికట్టేనా? అవుననే చెబుతోంది నివేదిక. 15 శాతం వెయిటేజీగాను రేటింగ్‌లో ఒకటే దక్కింది. అగ్రశ్రేణి డెవలపర్ల మధ్య పోటీతో కొనుగోలుదారులకు మేలు జరుగుతుంది. ఆరోగ్యకరమైన పోటీ ఉంటే సరైన ధరకు ఇల్లు కొనుగోలుకు అవకాశం ఉంటుంది. అయితే మన దగ్గర ఎవరి మార్కెట్‌ వాళ్లది అన్న చందంగా నడుస్తోంది. ప్రీలాంచ్‌ పథకాలతో కొంత పోటీ కనిపించినా..ఆరోగ్యకర పోటీ కాకపోవడంతో కొనుగోలుదారులకు మేలు కంటే నష్టమే ఎక్కువ జరిగిందనే వాదనల్లో పాక్షికంగా నిజం లేకపోలేదు. పోటీతత్వం పెరగాల్సి ఉందని నివేదికలు చెబుతున్నాయి.

నగరాల వారీగా చూస్తే...

* ముంబయి అన్ని అంశాల్లో సమతౌల్యంగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. ఆరుకు గాను 3.1 రేటింగ్‌ దక్కింది. ఇన్వెంటరీలో మినహా అన్ని అంశాల్లో మూడు అంతకంటే ఎక్కువే రేటింగ్‌ లభించింది.

* కొనుగోలుదారుల విశ్వాసం కోల్పోయిన మార్కెట్‌గా దిల్లీ రాజధాని ప్రాంతం నిలిచింది. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడంలో కొంతవరకు క్రమశిక్షణ పాటిస్తున్నా.. మిగతా అన్ని అంశాల్లో వెనకబడింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని