9 నెలల్లో 6 రెట్లు పెరిగింది

కార్యాలయాల భవనాల లీజింగ్‌లో హైదరాబాద్‌ ఈ ఏడాది దూకుడు మీద ఉంది. జనవరి నుంచి సెప్టెంబరు వరకు 9 నెలల్లో క్రితం ఏడాదితో పోలిస్తే లీజింగ్‌ ఏకంగా ఆరురెట్లు పెరిగింది.

Updated : 08 Oct 2022 02:24 IST

కార్యాలయాల లీజింగ్‌లో హైదరాబాద్‌ మెరుగు
కార్పొరేట్లు, కోవర్కింగ్‌ స్పేస్‌ సంస్థల వాటా అధికం
ఈనాడు, హైదరాబాద్‌

కార్యాలయాల భవనాల లీజింగ్‌లో హైదరాబాద్‌ ఈ ఏడాది దూకుడు మీద ఉంది. జనవరి నుంచి సెప్టెంబరు వరకు 9 నెలల్లో క్రితం ఏడాదితో పోలిస్తే లీజింగ్‌ ఏకంగా ఆరురెట్లు పెరిగింది. దేశవ్యాప్తంగా మెట్రో నగరాలన్నింటిలో సానుకూల వృద్ధి కనిపించింది. అయినా సరే కొవిడ్‌ ముందు స్థాయిని చేరడం కష్టమేనని రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెన్సీ సంస్థ జేఎల్‌ఎల్‌ ఇండియా తాజాగా విడుదల చేసిన నివేదిక స్పష్టం చేస్తుంది.

రియల్‌ ఎస్టేట్‌ పరంగా అగ్రగామిగా ఉన్న ఏడు నగరాల్లో ఈ ఏడాది ఇప్పటివరకు 30.26 మిలియన్‌ చదరపు అడుగుల విస్తీర్ణంలో నికర లీజింగ్‌ జరిగింది. గత ఏడాది ఇదే సమయానికి 14.63 మిలియన్‌ చ.అ. విస్తీర్ణం మాత్రమే కార్యాలయ భవనాల లీజింగ్‌ ఒప్పందాలు జరిగాయి. దాదాపుగా రెట్టింపు స్థాయిలో ఈసారి లావాదేవీలు పెరిగాయి. కొవిడ్‌ నుంచి ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం,  కార్యాలయాలు తెరవడం, ఉద్యోగులు వచ్చి పనిచేస్తుండటం వంటి పరిణామాలతో పెరుగుదల నమోదైందని సదరు సంస్థ తెలిపింది.

* 2019లో రికార్డు స్థాయిలో లీజింగ్‌ లావాదేవీలు జరిగిన సంగతి తెలిసిందే. ఆ ఏడాది హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, ముంబయి, కోల్‌కతా, దిల్లీ, పుణె రాజధాని ప్రాంతంలో కలిపి 47.9 మిలియన్‌ చ.అ. విస్తీర్ణాన్ని సంస్థలు లీజుకు తీసుకున్నాయి. కొవిడ్‌ సమయంతో పోలిస్తే ప్రస్తుతం గణనీయంగా పరిస్థితి మెరుగైనా కొవిడ్‌ పూర్వస్థాయిని లీజింగ్‌ల పరంగా ఈ ఏడాది చేరుకోకపోవచ్చు అని జేఎల్‌ఎల్‌ తెలిపింది. చేరుకోవాలంటే ఇంకా 18 మి.చ.అ. విస్తీర్ణంలో లీజింగ్‌ ఒప్పందాలు మూడునెలల వ్యవధిలో జరగాల్సి ఉంటుంది.

* 2020లో కొవిడ్‌ సమయంలో చూస్తే 12 నెలల లీజింగ్‌ 25.6 మిలియన్‌ చదరపు అడుగులకు పడిపోయింది. 2021లోనూ పెద్దగా మార్పులేదు. 26.2 మి.చ.అడుగులకు చేరింది. ఈసారి 9 నెలల్లోనే దీన్ని అధిగమించింది. కొవిడ్‌ పూర్వ స్థాయి దరిదాపులకు చేరే అవకాశం ఉంది.

ఇక్కడ 7.22 మిలియన్‌ చ.అ.కు..
హైదరాబాద్‌లో ప్రతినెలా ఒకటో రెండో అంతర్జాతీయ సంస్థలు తమ కార్యాలయాలను ఇక్కడ ఆరంభిస్తున్నాయి. ఇక్కడ కార్యాలయ భవనాల లీజింగ్‌ ఎలా ఉందనేది ఆసక్తికరం. ఈ ఏడాది 9 నెలల వ్యవధిలో 7.22 మి.చ.అ. విస్తీర్ణంలో కొత్త కార్యాలయాలు ఏర్పాటయ్యాయి. గత ఏడాది కొవిడ్‌ ప్రభావంతో కేవలం 1.18 మి.చ.అ. మాత్రమే ఉండగా.. ఈసారి ఏకంగా ఆరురెట్లు పెరిగింది.

ఇతర  నగరాల్లో..
* బెంగళూరులో 7.84 మి.చ.అ. విస్తీర్ణంలో కార్యాలయాల భవనాల లీజింగ్‌ జరిగింది. క్రితం ఏడాది ఇది 5.41 మి.చ.అ.గా ఉంది. 45 శాతం వృద్ధి నమోదైంది.
* చెన్నైలో గత ఏడాది 1.18 మి.చ.అ.విస్తీర్ణం లీజింగ్‌ నుంచి ఈ ఏడాది ఇదే సమయంలో 2.28 మి.చ.అ.కు పెరిగింది. 92 శాతం పెరిగింది.
* దిల్లీ రాజధాని ప్రాంతంలో ఏడాదికాలంలో 38 శాతం పెరుగుదల కనిపించింది. క్రితం సంవత్సరం 3.11 మి.చ.అ. ఉండగా.. ఈసారి 4.27 మిలియన్‌ చదరపు అడుగులకు పెరిగింది.
* కోల్‌కతాలో 0.18 నుంచి 0.48 మిలియన్‌ చదరపు అడుగులకు పెరిగింది.
* ముంబయిలో రెండింతలు పెరిగింది. జనవరి-సెప్టెంబరు కాలంలో గత ఏడాది 1.83 మి.చ.అ. నుంచి ఈసారి 4.6 మిలియన్‌ చదరపు అడుగులకు పెరిగింది.
* పుణెలో నెట్‌ లీజింగ్‌ 93 శాతం పెరిగింది. ఏడాదికాలంలో 1.85 మి.చ.అ. నుంచి 3.53 మిలియన్‌ చదరపు అడుగులకు చేరింది.

మున్ముందు  ఎలా...
ఐటీ సంస్థలు ప్రస్తుతం హైబ్రిడ్‌ విధానాన్ని అనుసరిస్తున్నాయి. మున్ముందు పూర్తి స్థాయిలో కార్యాలయాలు తెర్చుకునే అవకాశాలు ఉన్నాయి. దీంతో కార్పొరేట్లు, కోవర్కింగ్‌ స్పేస్‌ సంస్థలు ఈ ఏడాది పెద్ద ఎత్తున కార్యాలయాల భవనాలను లీజుకు తీసుకున్నాయి. ఇంకా పలు సంస్థలు ఒప్పందాలు కుదుర్చుకునేందుకు డెవలపర్లతో చర్చిస్తున్నాయి. ప్రధాన కార్యాలయం నుంచి అందే ఆదేశాల కోసం పలు సంస్థలు ఎదురుచూస్తున్నాయి. వివిధ దేశాల్లో నెలకొంటున్న మాంద్యం ప్రభావాన్ని ఆయా సంస్థలు బేరీజు వేసుకుంటున్నాయి. ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. వీటన్నింటి దృష్ట్యా వచ్చే మూడునెలలు భారీ పెరుగుదల ఉండకపోవచ్చు అని.. ఇప్పటిమాదిరే నిలకడగానే లీజింగ్‌ లావాదేవీలు ఉంటాయని డెవలపర్లు అంటున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని