కార్యాలయాల భవనాలకు పెరుగుతున్న డిమాండ్‌

దేశంలో కార్యాలయాల భవనాలకు డిమాండ్‌ ఈ ఏడాది 50 మిలియన్‌ చదరపు అడుగులు దాటే అవకాశం ఉందని రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెన్సీ సంస్థ కొల్లియర్స్‌ అంచనా వేసింది. మూడో త్రైమాసికం నివేదికను తాజాగా విడుదల చేసింది.

Published : 29 Oct 2022 01:43 IST

ఈనాడు, హైదరాబాద్‌: దేశంలో కార్యాలయాల భవనాలకు డిమాండ్‌ ఈ ఏడాది 50 మిలియన్‌ చదరపు అడుగులు దాటే అవకాశం ఉందని రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెన్సీ సంస్థ కొల్లియర్స్‌ అంచనా వేసింది. మూడో త్రైమాసికం నివేదికను తాజాగా విడుదల చేసింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మూడో త్రైమాసికంలో ఏ గ్రేడ్‌ కార్యాలయాల భవనాల లీజింగ్‌ 26 శాతం పెరిగిందని తెలిపింది. మూడు నెలల వ్యవధిలో 13 మిలియన్‌ చదరపు అడుగుల లీజింగ్‌ జరిగిందని వెల్లడించింది. డిమాండ్‌ కంటే సరఫరా 7 శాతం తక్కువగా ఉందని పేర్కొంది.

నగరాల వారీగా...

* హైదరాబాద్‌ మార్కెట్‌లో మూడో త్రైమాసికంలో 1.5 మిలియన్‌ చదరపు అడుగుల వాణిజ్య భవనాలు సిద్ధంగా ఉండగా.. 1.1 మిలియన్‌ చదరపు అడుగుల్లో మాత్రమే కార్యాలయాలు ఏర్పాటయ్యాయి.

* బెంగళూరులో అత్యధికంగా 4.4 మిలియన్‌, దిల్లీలో 4.3, ముంబయిలో 1.5, చెన్నైలో 1.0, పుణెలో 0.6 మిలియన్‌ చదరపు అడుగుల్లో కొత్త కార్యాలయాలు వచ్చాయి.

* బెంగళూరు, దిల్లీ రాజధాని ప్రాంతం, ముంబయి మూడు నగరాల వాటానే ఏకంగా 79 శాతంగా ఉంది.

గోదాముల పరంగా..

* పరిశ్రమలు, గోదాముల నిర్మాణాల పరంగా 6.7 మిలియన్‌ చ.అ. డిమాండ్‌ నమోదైంది. 2021 మొదటి త్రైమాసికం తర్వాత ఇదే అత్యధికం. డిమాండ్‌ 14 శాతం ఉండగా.. సరఫరా 4 శాతంగా ఉంది.

* దిల్లీ రాజధాని ప్రాంతం 56 శాతంతో అత్యధిక వాటాని కలిగి ఉంది. పుణె 16 శాతంతో ముందు వరసలో ఉంది.

పెట్టుబడులు వస్తున్నాయ్‌

మూడో త్రైమాసికంలో భారతీయ రియల్‌ ఎస్టేట్‌ రంగంలో 1 బిలియన్‌ యూఎస్‌ డాలర్ల పెట్టుబడులు వచ్చినట్లు నివేదిక స్పష్టం చేసింది. వార్షిక వృద్ధి 54 శాతంగా నమోదైంది.

* రాబడి అధికంగా ఉండే వాణిజ్య భవనాల్లో ఎక్కువగా విదేశీ సంస్థాగత పెట్టుబడులు వచ్చాయి. కార్యాలయాల భవనాల్లో 0.7 బిలియన్‌ డాలర్లు రాగా, పరిశ్రమలు, గోదాముల నిర్మాణాల్లో 0.02 బిలియన్‌ డాలర్లు, గృహ నిర్మాణంలో 0.2 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి.

* వార్షికంగా చూస్తే 2016లో 5.5 బిలియన్‌ డాలర్లు, 2017లో 8.0 బిలియన్‌ డాలర్లు, 2018లో 5.7 బిలియన్‌ డాలర్లు, 2019లో 6.2 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు రాగా.. 2020లో 4.8 బిలియన్‌ డాలర్లు, 2021లో 4.0 బిలియన్‌ డాలర్లకు తగ్గాయి. ఈ ఏడాది మూడో త్రైమాసికం ముగింపు నాటికి 3.6 బిలియన్‌ డాలర్లు వచ్చాయి.

హైదరాబాద్‌లోనే అద్దెలు తక్కువ

కార్యాలయాల అద్దెలు క్రమంగా పెరుగుతున్నాయి. మూడో త్రైమాసికం ముగింపు నాటికి చదరపు అడుగు సగటు అద్దె హైదరాబాద్‌లో రూ.73.7కి చేరింది. అయినా దేశంలోనే హైదరాబాద్‌లో అద్దెలు తక్కువగా ఉన్నాయి. పుణెలో రూ.76.1, బెంగళూరులో రూ.90.6, దిల్లీలో రూ.92.4, ముంబయిలో రూ.140.3గా అద్దెలు ఉన్నాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని