మెట్లు ఏ దిక్కున ఉండాలి?

రోజువారీ అవసరాలకు ఇంటి పరిసరాలను సౌకర్యవంతంగా ఉండేలా చేసుకునే ఏర్పాట్లే వాస్తు.

Updated : 18 Feb 2023 05:46 IST

ఇల్లు కట్టాలంటే వాస్తు తప్పనిసరా? 

సాయి సిద్ధార్థ్‌, సరూర్‌ నగర్‌

రోజువారీ అవసరాలకు ఇంటి పరిసరాలను సౌకర్యవంతంగా ఉండేలా చేసుకునే ఏర్పాట్లే వాస్తు. ప్రకృతిలో లభ్యమయ్యే సహజ వనరులైన గాలి, నీరు సూర్యరశ్మిలను ఇంట్లో వినియోగించుకునే తీరును చెప్పేదే వాస్తుశాస్త్రం. కాబట్టి మీకు నచ్చినట్లుగా ఇంజినీరింగ్‌, వాస్తు సలహాలు తీసుకుని ఇల్లు కట్టుకోండి.

* వ్యవసాయ భూములకు వాస్తు పాటించాలా? అందులో ఇల్లు ఎలా కట్టుకోవాలి?

కె.లక్ష్మీనారాయణ, వనస్థలిపురం   

వ్యవసాయ భూములకు వాస్తు వర్తించదని కొందరు పెద్దల అభిప్రాయం. కాని ఉండటానికి ఇల్లు మాత్రం వాస్తు కనుగుణంగా కట్టుకుంటే శాస్త్ర ఫలితాలు సమృద్ధిగా పొందవచ్చు.

* మా ఇంటి ఆవరణలో వేపచెట్టు ఉంది. ఆ చెట్టు ఉండకూడదు అన్నారు. దీని గాలి మంచిదంటారు కదా. ఎందుకిలా చెప్పారు?

టి.సురేందర్‌, హయత్‌నగర్‌

వేప, రావి దేవతా వృక్షాలు. వీటితో ఆరోగ్యపరమైన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఆయుర్వేద వైద్య శాస్త్రం ఇదే  చెబుతుంది. దేవాలయ ప్రాంగణాల్లో ఇవి  ఉంటాయి.ఇవి బలంగా కొమ్మలు విస్తరించి ఉంటాయి.  వీటి వేళ్ళు అదే స్థాయిలో భూమి లోపల ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తాయి. అందుకే వీటి దగ్గరగా ఉన్న ఇళ్లకు పునాదులు, గోడలు బీటలు వారే ప్రమాదం ఉంటుంది.

వాస్తు శాస్త్రం అన్ని మతస్తులకు వర్తిస్తుందా? కేవలం హిందువులకేనా? 

కె.సుధాబాబు, వనస్థలిపురం

వాస్తు శాస్త్రం సృష్టిలో పంచ భూతాలుగా చెప్పబడే భూమి, ఆకాశం, గాలి, నీరు, నిప్పు ఆధారంగా ఏర్పడింది. ప్రతి మనిషి చివరకు చిరు ప్రాణి సైతం ఈ భూమి మీద నివసించడానికి పంచభూతాలపైనే ఆధారపడి ఉందనేది కాదనలేం. వీటికి కులం, మతం, ప్రాంతం అనేది లేదు.  వాటిని సద్వినియోగం చేసుకోవడం అనేది  వారి ఆలోచనా పరిజ్ఞానంపై ఉంటుంది.
వేర్వేరు పేర్లతో వీటిని ఆచరిస్తుంటారు.

* ఇంటిలో ఒక అంతస్తు నుంచి మరో అంతస్తుకు వెళ్లే మెట్లు ఏ దిక్కున ఉండాలి?

జి చిరంజీవులు చౌటుప్పల్‌.

ఇంటి మెట్లు ఈశాన్యంలో కాకుండా మరెక్కడైనా ఉండొచ్చు. మెట్లు దిగేటప్పుడు తూర్పుగాని ఉత్తరం దిక్కుకు గాని ఉండాలి. అంటే మెట్ల మీదుగా పైకి వెళ్ళేటప్పుడు తూర్పు లేదా ఉత్తరం గుండా పడమర దక్షిణం దిక్కులకు పైకి వెళ్ళాలన్న మాట.

* వంటగది ఆగ్నేయంలో ఉండాలంటారు కదా! మేం అద్దెకుంటున్న ఇంట్లో తూర్పు భాగంలో వేరేవాళ్లు ఉంటున్నారు. మేం పడమర వైపు ఉంటున్నాం. వంటగది ఎక్కడ ఉండాలి.  ఎటు తిరిగి వంట చేసుకోవాలి?

మాగంటి కృష్ణవేణి, దిల్‌సుఖ్‌నగర్‌

మీరు ఉంటున్న ఇంట్లో ఎన్ని గదులు ఎలా ఉన్నాయో తెలియదు. ఒకవేళ మీ పోర్షన్‌ గదులు ఒకే వరసలో రైలు బోగీల్లా ఉంటే మొత్తం ఇంటికి వాయువ్య మూలన తూర్పు వైపు తిరిగి వంట చేసుకోవచ్చు. వంట గది వాయువ్య మూలలో ఉండొచ్చు.  వంట చేసేటప్పుడు పొయ్యి వెలిగించేటప్పుడు వచ్చే పొగ, ఘాటు వాసనలు ఇంట్లోకి రాకుండా క్రాస్‌ వెంటిలేషన్‌ ద్వారా బయటకు వెళతాయి. వంట చేసేవారికి అసౌకర్యం కలగకుండా ఈ ఏర్పాట్లు.

* మేమున్న అద్దె ఇంట్లో బాల్కనీ వెడల్పు తక్కువగా ఉంది. తులసి కోట ఎక్కడ పెట్టుకోవాలి?

గుండా రమాదేవి, పామర్రు

అద్దె ఇంట్లో ఉంటున్నా ఆరోగ్యాన్నిచ్చే తులసి చెట్టుపై ఆలోచన చేస్తున్నందుకు అభినందనలు. బాల్కనీలో ఎత్తులో నడకకు అడ్డురాకుండా ఏర్పాట్లు చేసుకోవచ్చు. తూర్పు, ఉత్తరం దిక్కుల వైపు ఉత్తమం. వీలుకాని పక్షంలో ఏదిక్కునైనా మధ్యలో ఏర్పాటు అనువుగా ఉంటుంది.

* కొత్త ఇల్లు కొన్నాం. రెడీమేడ్‌ అల్మారాలు ఏ దిక్కున పెట్టాలి.

సంతోష్‌ కుమార్‌, కొల్లూరు.

అల్మారాల ఏర్పాటులో గదుల పొడవు, వెడల్పుల విషయంలో అవగాహన ఉండాలి. గదులు చిన్నగా ఉన్నప్పుడు పడకమంచాలు, ఇతర ఫర్నిచర్‌ ఎక్కడ వస్తాయనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి.

మూల గదుల్లో ఇలా..

* పడమర, దక్షిణ దిశలు కలిసే నైరుతిలో ఉన్న గదిలో దక్షిణం వైపు నుంచి వచ్చే గాలి శ్రేష్ఠం అంటారు. కాబట్టి అల్మరాలు పడమర వైపు ఏర్పాటు చేస్తే అనుకూలంగా ఉంటుంది.

* తూర్పు, ఉత్తరం దిశలు కలిసే ఈశాన్యంలో ఉన్న గదిలో పడమర, లేదా దక్షిణం దిశలో అల్మరాలను ఏర్పాటు చేసుకోవచ్చు.

* ఉత్తర, పడమర దిక్కులు కలిసే వాయువ్యం మూల గదిలో దక్షిణం వైపు వీలుగా ఉంటుంది.

* తూర్పు, దక్షిణం కలిసే ఆగ్నేయం మూల గదిలో ఉదయం పూట తూర్పు నుంచి వచ్చే ఎండ, గాలి, వెలుతురు తగినంతగా ఉంటుంది. వీటికి అడ్డుపడేలా కాకుండా పడమర గోడకు, దక్షిణం గోడకు అల్మరాలు శాస్త్ర ప్రకారం ఉండాలి.

దిక్కుల విషయానికొస్తే..

* తూర్పు దిశలో ఉన్న గదిలో పడమర దక్షిణం దిక్కుల్లో అల్మారాలు, అటకలు ఏర్పాటు చేసుకోవచ్చు.
* ఉత్తరం దిక్కులో ఉన్న గదిలో దక్షిణ పడమర దిశలో కప్‌బోర్డులు ఏర్పాటు చేసుకోవచ్చు.
* దక్షిణం దిక్కు గదిలో పడమర వైపు అల్మరాల ఏర్పాటు మంచిదే.
* పడమర దిక్కులోని గదిలో దక్షిణంవైపు వీటి ఏర్పాటు ఉత్తమం.  బాత్‌రూంలు ఉండే గదుల్లో ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని సరైన చోట అల్మారాలను బిగించుకోవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని