విస్తరిస్తూ.. ఎత్తుకు ఎదుగుతూ..

నాలుగైదు ఏళ్లలో నిర్మాణపరంగా నగర రూపురేఖలు మార్చే పలు భారీ ప్రాజెక్ట్‌లు సిటీలోని అన్ని ప్రాంతాల్లో రాబోతున్నాయి. ఐదంతస్తుల భవనాలు లేని ప్రాంతాల్లో సైతం పాతిక అంతస్తుల ఆవాసాలు వస్తున్నాయి.

Updated : 18 Feb 2023 08:57 IST

నగరం నాలుగు వైపులా ఆకాశహర్మ్యాలు వస్తున్నాయ్‌

నాలుగైదు ఏళ్లలో నిర్మాణపరంగా నగర రూపురేఖలు మార్చే పలు భారీ ప్రాజెక్ట్‌లు సిటీలోని అన్ని ప్రాంతాల్లో రాబోతున్నాయి. ఐదంతస్తుల భవనాలు లేని ప్రాంతాల్లో సైతం పాతిక అంతస్తుల ఆవాసాలు వస్తున్నాయి.  గరిష్ఠంగా 57 అంతస్తుల వరకు రాబోతున్నాయి. ఇప్పటికే పలు నిర్మాణ సంస్థలు అనుమతులు పొంది పనులు ప్రారంభించగా.. మిగిలినవి అనుమతులు పొందే దశలో ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో ఈ భవనాలు ల్యాండ్‌మార్క్‌గా నిలవనున్నాయి. ఆయా ప్రాంగణాల్లో స్థిరాస్తుల కొనుగోలుతో తమ సామాజిక ‘అంతస్తు’ పెరుగుతుందని. అందరిలో తమని పైఎత్తులో నిలబెడుతుందని కొనుగోలుదారులు భావిస్తున్నారు. పెరిగిన భూముల ధరలు, స్థల యజమానులతో డెవలప్‌మెంట్‌ ఒప్పందాల కారణంగా కూడా ఎక్కువ అంతస్తులు నిర్మిస్తే తప్ప ఆర్థికంగా ప్రాజెక్ట్‌ లాభసాటి కాదని అందుకే  ఆకాశహర్మ్యాలను కడుతున్నామని బిల్డర్లు అంటున్నారు.

పశ్చిమంలో...

సిటీలో ఎక్కువగా పశ్చిమ హైదరాబాద్‌లోనే వీటిని నిర్మిస్తున్నారు. 100 నుంచి 200 మీటర్ల ఎత్తు వరకు ఆకాశానికి నిచ్చెన వేసినట్లుగా, చుక్కలను అందుకునేలా భవనాలు కడుతున్నారు. 30కి పైగానే ఈ తరహా ప్రాజెక్ట్‌లు ఇక్కడ వేర్వేరు దశల్లో ఉన్నాయి. ఆకాశహర్మ్యాల గృహ నిర్మాణ ప్రాజెక్టు శేరిలింగంపల్లిలో 50 అంతస్తులతో మరో నిర్మాణానికి అనుమతులు పొందింది. ఇలా కోకాపేటలో ప్రముఖ సంస్థలకు చెందిన గృహ, వాణిజ్య భవనాలు ఎత్తులో ఒకదానితో ఒకటి పోటీపడుతున్నాయి. నానక్‌రాంగూడలో 44 అంతస్తుల, ఖానామెట్‌లో 42 అంతస్తుల భవనాలు, ఖాజాగూడలో వాణిజ్య భవనాల నిర్మాణం చివరి దశలో ఉన్నాయి. నార్సింగ్‌లో 45 అంతస్తులు, మియాపూర్‌, బాచుపల్లి మార్గంలో 33  నుంచి 45 అంతస్తుల భవనాలు నిర్మాణంలో ఉన్నాయి. ఇక్కడ 15 అంతస్తుల లోపలే రెసిడెన్షియల్‌ టవర్లు ఇదివరకే ఉన్నాయి.

సెంట్రల్‌ హైదరాబాద్‌లో..

నగరం మొదట అభివృద్ధి చెందిన ప్రాంతం ప్రస్తుతం సెంట్రల్‌ హైదరాబాద్‌గా ఉంది. ఇక్కడ బషీర్‌బాగ్‌లో నిర్మించిన బాబుఖాన్‌ ఎస్టేటే చాలా దశాబ్దాల పాటు అత్యంత ఎత్తైన భవనంగా ఉంది. 14 అంతస్తులతో ఎత్తైన వాణిజ్య భవనంగా గుర్తింపు పొందింది. సైఫాబాద్‌లో ఎత్తైన గృహ బహుళ అంతస్తుల సముదాయం వచ్చింది. ఆర్‌బీఐ ఎదురుగా మరో ఆకాశహర్మ్యం వచ్చింది. వాణిజ్యపరంగా ఆబిడ్స్‌లో కొన్ని పది అంతస్తుల వరకు వాణిజ్య నిర్మాణాలు వచ్చాయి. చాలాకాలం తర్వాత ఇప్పుడు ఎత్తైన భవనాలు ఈ ప్రాంతాల్లో వస్తున్నాయి. నగరం మధ్యలో ఆబిడ్స్‌లో తొలిసారి హైరైజ్‌ భవనం వస్తోంది. ఇక్కడ ఎకరంన్నర పైగా విస్తీర్ణంలో 40 అంతస్తుల అపార్ట్‌మెంట్‌ కడుతున్నారు. సెల్లార్‌ తవ్వకం పనులు మొదలయ్యాయి. పంజాగుట్టలో 25 అంతస్తుల్లో మొదటి ఆకాశహర్మ్యం నిర్మాణం పూర్తికావొచ్చింది. రాజ్‌భవన్‌ రోడ్డులోనూ పలు భారీ కట్టడాలు సాగర్‌ అభిముఖంగా నిర్మాణమవుతున్నాయి.

దక్షిణం వైపు  పెరుగుతోంది

హైదరాబాద్‌ దక్షిణ ప్రాంతంగా చెప్పే అత్తాపూర్‌, రాజేంద్రనగర్‌, శంషాబాద్‌ వైపు ఆకాశహర్మ్యాల నిర్మాణం మొదలైంది. పది అంతస్తుల వరకు ఇక్కడ ఇప్పటికే పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఈ ప్రాంతంలో దశాబ్దం కిందటే ఉప్పరిపల్లిలో 20 అంతస్తుల టవర్‌ నిర్మించారు. అంతకు మించిన పెద్ద భవనం పీవీ ఎక్స్‌ప్రెస్‌ వే పిల్లర్‌ నంబరు 85 వద్ద 35 అంతస్తుల్లో వస్తోంది. 5 ఎకరాల విస్తీర్ణంలో బెంగళూరుకు చెందిన ఒక నిర్మాణ సంస్థ ఇక్కడ భారీ ప్రాజెక్ట్‌ను మొదలెట్టింది. విమానాశ్రయ మార్గంలో సాతంరాయి వద్ద ఇప్పటికే 14 అంతస్తుల అపార్ట్‌మెంట్ల నిర్మాణం పూర్తి కాగా.. కొత్తగా మరో సంస్థ 40 అంతస్తుల ప్రాజెక్ట్‌ చేపట్టబోతున్నట్లు తెలిసింది.

టీఎస్‌ బీపాస్‌ 2022 ప్రకారం..

* 80 ఆకాశహర్మ్యాలు టీఎస్‌ బీపాస్‌లో అనుమతులు పొందాయి. వీటిలో 60 అపార్ట్‌మెంట్లు, 22 వరకు వాణిజ్య భవనాలు ఉన్నాయి.

* అనుమతి పొందిన గృహ నిర్మాణాల్లో 14 ప్రాజెక్ట్‌లు 30 అంతస్తులపైన నిర్మించబోతున్నవే కావడం విశేషం. మిగతావన్నీ 10 నుంచి 30 అంతస్తుల ఎత్తులో నిర్మిస్తున్నారు.  

ఉత్తరం వైపు : కొంపల్లి నుంచి మేడ్చల్‌ వరకు ఆకాశహర్మ్యాల ప్రాజెక్ట్‌లు ఇప్పుడే మొదలవుతున్నాయి. ఇప్పటివరకు. ఇక్కడ ఐదు నుంచి పది అంతస్తుల గేటెడ్‌ కమ్యూనిటీలు ఎక్కువగా ఉన్నాయి. 17 అంతస్తుల టవర్లు రాబోతున్నాయి. ఓఆర్‌ఆర్‌ చేరువలోనూ 20 అంతస్తుల్లో చేపట్టే ప్రణాళికలో పలు సంస్థలు ఉన్నాయి.

తూర్పులో..

పశ్చిమం తర్వాత తూర్పు హైదరాబాద్‌లో ఎక్కువ హైరైజ్‌ భవనాలు వస్తున్నాయి. ఉప్పల్‌లో 24 అంతస్తుల్లో అపార్ట్‌మెంట్లు స్టేడియం చుట్టుపక్కల నిర్మాణమవుతున్నాయి. ఉప్పల్‌ భగాయత్‌లోనూ 10 అంతస్తులపైన అపార్ట్‌మెంట్లు కడుతున్నారు. పోచారంలో 16 అంతస్తుల్లో ఐటీ కార్యాలయం, 10 అంతస్తుల్లో నివాస సముదాయాలు వస్తున్నాయి. ఎల్‌బీ నగర్‌లో మొదటిసారి 33 అంతస్తుల్లో ప్రాజెక్ట్‌ రాబోతుంది.

ఈనాడు, హైదరాబాద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు