Real Estate: ఎన్నికల వేళ.. నెరవేర్చుకో ఇంటి కల

రాష్టంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆ ప్రభావం రియల్‌ ఎస్టేట్‌పై కన్పిస్తోందా? ఫ్లాట్ల క్రయ విక్రయాలు ఆశాజనకంగా ఉన్నా.. స్థలాల లావాదేవీల్లో కొంత స్తబ్దత నెలకొంది. ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ఇది ఇలాగే కొనసాగే సూచనలు కన్పిస్తున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

Updated : 07 Oct 2023 08:45 IST

కొనేందుకుసరైన సమయమేనంటున్న నిపుణులు

రాష్టంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆ ప్రభావం రియల్‌ ఎస్టేట్‌పై కన్పిస్తోందా? ఫ్లాట్ల క్రయ విక్రయాలు ఆశాజనకంగా ఉన్నా.. స్థలాల లావాదేవీల్లో కొంత స్తబ్దత నెలకొంది. ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ఇది ఇలాగే కొనసాగే సూచనలు కన్పిస్తున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా కృత్రిమంగా ధరలు పెరిగే అవకాశం తక్కువ కాబట్టి తమ బడ్జెట్‌లో స్థిరాస్తులను కొనుగోలు చేయవచ్చు అంటున్నారు. ముఖ్యంగా సొంతిల్లు కట్టుకునేందుకు, భవిష్యత్తు అవసరాల కోసం స్థలాలు కొనుగోలు చేసేవారికి సరైన సమయం అని సూచిస్తున్నారు.

దేశవ్యాప్తంగా స్థిరాస్తి రంగం దూకుడు మీద ఉంది. కొవిడ్‌ అనంతరం పలు నగరాలు మంచి జోరు కనబరుస్తున్నాయి. రికార్డు స్థాయిలో ఇళ్ల విక్రయాలు, కొత్త ప్రాజెక్ట్‌ల ప్రకటనలు ఉన్నాయి. ఇది ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. మన దగ్గర మొన్నటివరకు పరుగులు పెట్టినా.. కొద్దినెలలుగా మార్కెట్‌ మాత్రం నిలకడగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో స్తబ్దుగా ఉందని.. ప్రాంతాలను బట్టి హెచ్చుతగ్గులు ఉంటాయని ఎన్నికల వరకు ఇదే పరిస్థితి అని రియల్టర్లు అంటున్నారు.

ప్రాంతాన్ని బట్టి మారుతుంది..

స్థిరాస్తి మార్కెట్‌ నగరం మొత్తం ఒకే తీరున ఎప్పుడు ఉండదని.. ప్రాంతాలను బట్టి అక్కడి మౌలిక వసతులను బట్టి మారుతూ ఉంటుందని ఈ రంగంలోని నిపుణులు చెబుతున్నారు. సర్కారు వేలం వేసిన కోకాపేట, బుద్వేల్‌, మోకిల వంటి ప్రాంతాల్లో ఈ ప్రభావాలేవీ కన్పించలేదు. భూముల వేలానికి మంచి స్పందన కన్పించింది. బడా సంస్థలు తమ సొమ్ములను హెచ్‌ఎండీఏకు పూర్తిగా చెల్లించాయని అధికారులు చెప్పారు. భవిష్యత్తు అవసరాల కోసం వీరు ఆయా ప్రాంతాల్లో కొనుగోలు చేశారు. కోకాపేటలో తక్షణం అభివృద్ధి చేసేందుకు సంస్థలు పోటీపడగా.. బుద్వేల్‌లో ఐదు నుంచి పదేళ్ల వ్యవధిలో నిర్మాణాలు చేపట్టేందుకు భూములను ఖరీదు చేశారు.  ఆ ప్రాంతం భవిష్యత్తులో వృద్ధి చెందే అవకాశం ఉందని ముందుచూపుతో వేలంలో భూములను దక్కించుకున్నారు.

సామాన్య వర్గాలు  సైతం..

బడా సంస్థలే కాదు సామాన్యులకు మార్కెట్‌ ఎప్పుడూ అవకాశాలు కల్పిస్తుంది. సిటీ అనుభవాలు ఏం చెబుతున్నాయంటే.. మార్కెట్‌ నిలకడగా, స్తబ్దుగా ఉన్నప్పుడు కొంటే ఆయా స్థిరాస్తులు వాస్తవ ధరలకు సొంతం చేసుకోవచ్చు. బేరమాడితే ఇంకా తక్కువ ధరకే దొరికే వీలు ఉంటుంది. ధరలు పెరుగుతున్నప్పుడు అందరూ పరుగెత్తి కొనుగోలు చేస్తుంటారు. రోజుల వ్యవధిలోనే కృత్రిమంగా ధరలను బాగా పెంచేస్తుంటారు. కొని అమ్మేవారు లాభపడుతుంటారు. అదే మార్కెట్‌ స్తబ్దుగా ఉన్నప్పుడు కృత్రిమంగా ధరల పెరుగుదల స్వల్పం. ఉండేందుకు ఇల్లు.. భవిష్యత్తు అవసరాల కోసం స్థలం కొనాలని చూసేవారికి వాస్తవిక ధరలకే దొరికే వీలుంటుంది. కాబట్టి కొనే ఆలోచన ఉన్నవారు మార్కెట్‌ బాగోలేదని నిర్ణయాన్ని వాయిదా వేయవద్దు అని స్థిరాస్తి సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు.

గృహ  నిర్మాణంలోనూ...

నివాస స్థలాలే కాదు.. గృహ కొనుగోలుకు కూడా మంచి తరుణమే. ఇప్పుడు నిర్మాణంలో ఉన్నవి, దాదాపు పూర్తి కావొచ్చిన ప్రాజెక్టుల్లో ధరలతో పోలిస్తే.. కొత్తగా ప్రారంభిస్తున్న వాటిలో ధరలు అధికంగా ఉంటాయి. కాబట్టి కొనుగోలుదారులు వారి బడ్జెట్‌కు తగ్గవాటిని ఎంపిక చేసుకోవచ్చు. ఆలస్యం చేసే కొద్దీ ధరల పెరుగుదల భారమవుతుంది. హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు గతేడాదితో పోలిస్తే ఏకంగా 11శాతం పెరిగాయి. గత త్రైమాసికంలో 2 శాతం పెరుగుదల ఉంది. ఆలస్యంతో.. వాయిదాలతో ఇల్లు కొనుగోలు భారమవుతుంది.
గత మూడు నెలల్లో హైదరాబాద్‌లో 7900 ఇళ్లను  విక్రయిస్తే.. రూ.50 లక్షల లోపు ఇళ్లవాటా తక్కువగా ఉంది. అత్యల్పంగా 749 ఇళ్ల విక్రయాలే జరిగాయి. ఈ ధరలకు ఇళ్లే దొరకడం లేదు.  రూ.50 లక్షలు నుంచి కోటి రూపాయల లోపు 3247 యూనిట్లు, కోటిపైన ధర పలికే ఇళ్లు 4329 విక్రయం జరిగినట్లు నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా వెల్లడించింది.  ఈ స్థాయిలో ధరలు ఉండటంతో మళ్లీ పెరగకముందే స్థిరాస్తిని కొనుగోలు చేయడం మేలని పరిశ్రమ పెద్దలు సూచిస్తున్నారు.


లభ్యత ఎక్కువే ఉంది..

  • నగరంలో ప్రీమియం అపార్ట్‌మెంట్లకు చిరునామాగా ఐటీ కారిడార్‌ ఉంది. ఇక్కడ సిద్ధంగా ఉన్న ఫ్లాట్లతో పాటూ కొత్తగా పనులు మొదలెట్టిన ప్రాజెక్టులు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. నచ్చిన వాటిని ఎంపిక చేసుకోవచ్చు.
  • ఆకాశహర్మ్యాల నిర్మాణాలు గచ్చిబౌలి చుట్టుపక్కలతో పాటూ ఎల్బీనగర్‌, ఉప్పల్‌, కొంపల్లి, శంషాబాద్‌, పటాన్‌చెరు వైపు అందుబాటులో ఉన్నాయి.
  • విల్లాల ప్రాజెక్టులు ఎక్కువగా కొల్లూరు,  విమానాశ్రయం చుట్టుపక్కల రావిర్యాల, తుక్కుగూడ, మేడ్చల్‌, కంది ప్రాంతాల్లో ఉన్నాయి.
  • వ్యక్తిగత ఇళ్ల కోసం చూస్తున్నవారికి సిటీలో అవుటర్‌ రింగ్‌ రోడ్డు లోపల.. బడంగ్‌పేట, తుర్కయంజాల్‌ తదితర జనావాసాలు ఉన్నచోట కట్టి విక్రయిస్తున్నారు.
  • ఇల్లు కట్టుకునే స్థలాలు ఓఆర్‌ఆర్‌ లోపల లభ్యత ఉన్నా.. ధరలు ఎక్కువగా చెబుతున్నారు. స్థలం కొని ఇల్లు కట్టుకోవాలంటే మరింత ఆలస్యం చేయకుండా కొనుగోలు చేయడం మేలు.
  • భవిష్యత్తు అవసరాలు, పెట్టుబడి కోసమైతే అనుమతి పొందిన వెంచర్లు బాహ్య వలయ రహదారి బయట అందుబాటులో ఉన్నాయి.  

ఈనాడు, హైదరాబాద్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని