పర్యావరణ అనుమతులకు ఎదురు చూపులు!

భారీ నిర్మాణ ప్రాజెక్ట్‌లకు పర్యావరణ అనుమతులు తప్పనిసరి. చాలాకాలం తర్వాత రాష్ట్రంలో పర్యావరణ కమిటీ ఏర్పాటైనా అనుమతుల

Published : 13 Mar 2021 02:13 IST

ఈనాడు, హైదరాబాద్‌: భారీ నిర్మాణ ప్రాజెక్ట్‌లకు పర్యావరణ అనుమతులు తప్పనిసరి. చాలాకాలం తర్వాత రాష్ట్రంలో పర్యావరణ కమిటీ ఏర్పాటైనా అనుమతుల జారీలో జాప్యం జరుగుతోంది. త్వరగా లభించేలా చూడాలని క్రెడాయ్‌ హైదరాబాద్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. రియల్‌ ఎస్టేట్‌ సమస్యలపై నెలవారీ సమావేశంలో భాగంగా ఇటీవల పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్‌తో క్రెడాయ్‌ హైదరాబాద్‌ కార్యవర్గం, సభ్యులు సమావేశమయ్యారు. కొవిడ్‌ అనంతర పరిణామాలు, స్థిరాస్తి రంగం వృద్ధి, సంస్కృరణలపై ప్రధానంగా చర్చ జరిగింది. కొవిడ్‌ లాక్‌డౌన్‌తో కార్యకలాపాలు కొనసాగించలేని పరిస్థితుల్లో అనుమతి ఉన్న ప్రాజెక్ట్‌ల గడువును సర్కారు గతంలోనే పొడిగించింది.  పొడిగించిన ఈ గడువు వర్తించాలంటే ఆన్‌లైన్‌ దరఖాస్తు పరంగా ఎదురవుతున్న ఆటంకాలు, టీఎస్‌బీపాస్‌లో పెద్ద ప్రాజెక్ట్‌లకు నిరభ్యంతర పత్రాలను సమర్పించడంలో ఉన్న ఇబ్బందులను సభ్యులు ఎకరవు పెట్టారు. పర్యావరణ కమిటీ నుంచి అనుమతులు ఆలస్యం అవుతున్నాయనే విషయాన్ని పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లినట్లు క్రెడాయ్‌ హైదరాబాద్‌ ప్రధాన కార్యదర్శి వి.రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. అనుమతులు లేకుండా ముందే బుకింగ్‌లతో జరుగుతున్న వ్యాపార కార్యకలాపాలతో మార్కెట్‌పై పడుతున్న ప్రభావంపై సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఏదైనా జరిగితే అలాంటి ప్రాజెక్ట్‌ల్లో కొన్నవారిని ఎవరూ కాపాడలేరని అన్నారు. ఈ అవాంచిత పోకడలను అధికారుల దృష్టికి తీసుకొచ్చినట్లు చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని